Share News

Delhi: 75 శాతం గ్రామీణులకు నల్లా కనెక్షన్లు ఇచ్చాం.. మోదీ కల సాకారమవుతోందన్న కేంద్ర మంత్రి

ABN , Publish Date - Mar 07 , 2024 | 05:47 PM

దేశంలోని 75 శాతం గ్రామీణ కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు అందించామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(Gajendra Singh Shekhawat) గురువారం వెల్లడించారు. దీనిని "భారీ మైలురాయి"గా పేర్కొన్న షెకావత్, లక్ష్య సాధన కోసం కృషి చేస్తున్న అన్ని రాష్ట్రాలను అభినందించారు.

Delhi: 75 శాతం గ్రామీణులకు నల్లా కనెక్షన్లు ఇచ్చాం.. మోదీ కల సాకారమవుతోందన్న కేంద్ర మంత్రి

ఢిల్లీ: దేశంలోని 75 శాతం గ్రామీణ కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు అందించామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(Gajendra Singh Shekhawat) గురువారం వెల్లడించారు. దీనిని "భారీ మైలురాయి"గా పేర్కొన్న షెకావత్, లక్ష్య సాధన కోసం కృషి చేస్తున్న అన్ని రాష్ట్రాలను అభినందించారు. "#HarGharJal దిశగా 75% గ్రామాలను చేరుకున్నాం. ఇది మా ప్రయాణంలో ఒక పెద్ద మైలురాయి.

ప్రతి ఇంటికి స్వచ్ఛమైన కుళాయి నీటిని అందించాలనే ప్రధానమంత్రి మోదీ కల సాకారం అయ్యే రోజు దగ్గర్లోనే ఉంది. కల సాకారం చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న రాష్ట్రాలు, అధికారులకు జల్ జీవన్ మిషన్ తరఫున అభినందనలు. మేం బలమైన, ఆరోగ్యకరమైన భారత్‌ను నిర్మిస్తున్నాం" అని X లో చేసిన పోస్ట్‌లో కేంద్ర మంత్రి అన్నారు.


అధికారిక సమాచారం ప్రకారం 19,27,94,822 గ్రామీణ కుటుంబాలకు గాను 14,46,57,889 కుటుంబాలకు ఇప్పటి వరకు నీటి కనెక్షన్‌లు అందించారు. పదకొండు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో (UT) 100 శాతం ఇళ్లకు కుళాయిలు బిగించాయి. 15 రాష్ట్రాలు, UTలు 75-100 శాతం మధ్య కుళాయిలను కలిగి ఉన్నాయి.

ఆరు రాష్ట్రాలు 50-75 శాతం కవరేజీని కలిగి ఉన్నాయి. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు 50 శాతం కంటే తక్కువ కవరేజీని కలిగి ఉన్నాయి. జల్ జీవన్ మిషన్‌ని కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించింది. 2024 నాటికి గ్రామీణ భారత్‌లోని అన్ని గృహాలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 07 , 2024 | 05:50 PM