Share News

6Th phase polling : 6వ దశలో 61%

ABN , Publish Date - May 26 , 2024 | 06:15 AM

లోక్‌సభ ఎన్నికల ఆరో దశలో 61.11 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలోని 58 నియోజకవర్గాలకు, ఒడిశాలోని 42 అసెంబ్లీ సీట్లకు శనివారం ఎన్నికలు జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని 7 స్థానాలతో పాటు హరియఽణా (10), బిహార్‌ (8), జార్ఖండ్‌ (4), ఒడిశా (6), ఉత్తరప్రదేశ్‌ (14),

6Th phase polling : 6వ దశలో 61%

న్యూఢిల్లీ, మే 25 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల ఆరో దశలో 61.11 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలోని 58 నియోజకవర్గాలకు, ఒడిశాలోని 42 అసెంబ్లీ సీట్లకు శనివారం ఎన్నికలు జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని 7 స్థానాలతో పాటు హరియఽణా (10), బిహార్‌ (8), జార్ఖండ్‌ (4), ఒడిశా (6), ఉత్తరప్రదేశ్‌ (14), పశ్చిమబెంగాల్‌ (8), జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌-రాజౌరీ స్థానానికి ఈసీ ఎన్నికలు నిర్వహించింది. పశ్చిమబెంగాల్‌లో అత్యధికంగా 79.4ు పోలింగ్‌ నమోదైంది. జార్ఖండ్‌లో 63.76ు, ఒడిశాలో 69.32ు, హరియాణాలో 60.06ు, ఢిల్లీలో 57.67ు, యూపీలో 54.03ు, బిహార్‌లో 55.24ు, అనంత్‌నాగ్‌లో 54.15ు పోలింగ్‌ నమోదైంది. మొత్తంగా చూస్తే, అనంత్‌నాగ్‌లో అత్యల్ప పోలింగ్‌ జరిగినప్పటికీ, గత కొన్ని దశాబ్దాల్లో ఆ నియోజకవర్గంలో ఇదే అత్యధికమని ఈసీ వెల్లడించింది. కాగా, అనంత్‌నాగ్‌ నుంచి పోటీ చేస్తున్న పీడీపీ అభ్యర్థి మోహబూబా ముఫ్తీ.. రిగ్గింగ్‌ జరిగినట్లు ఆరోపించారు. మరోవైపు, ఢిల్లీలో ఇండియా కూటమికి గట్టి పట్టున్న ప్రాంతాలలో ఓటింగ్‌ ప్రక్రియ మందకొడిగా సాగేలా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా పోలీసులను ఆదేశించారని ఆప్‌ మంత్రి ఆతిషి తీవ్ర ఆరోపణ చేశారు. ఆరో దశతో కలిసి ఇప్పటివరకు మొత్తం 486 లోక్‌సభ సీట్లకు పోలింగ్‌ జరిగింది. మరోవైపు, ఒడిశాలోని 147 అసెంబ్లీ సీట్లకు గానూ 105 స్థానాల్లో పోలింగ్‌ ముగిసింది. ఇదిలా ఉండగా, న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఇండియా కూటమి అభ్యర్థిగా ఆప్‌ నుంచి సోమ్‌నాథ్‌ భారతి పోటీ చేస్తుండటంతో ఇక్కడ కాంగ్రెస్‌ తన అభ్యర్థిని నిలబెట్టలేదు. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్‌ ఈ నియోజకవర్గంలోనే ఓటర్లుగా ఉండటంతో ఇక్కడే ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారు తొలిసారిగా కాంగ్రెసేతర అభ్యర్థికి ఓటు వేయాల్సి వచ్చిన సందర్భమిది.


ఓటేసిన ప్రముఖులు

ఆరో దశ పోలింగ్‌లో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఢిల్లీలోని డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ కేంద్రీయ విద్యాలయలోని పోలింగ్‌ స్టేషన్‌లో ఓటు వేశారు. ఈ పోలింగ్‌ బూత్‌ను పూర్తిగా మహిళా సిబ్బంది నిర్వహించింది. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ దంపతులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ దంపతులు, కేంద్రమంత్రి జైశంకర్‌, కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌, ఈసీ సభ్యులు జ్ఞానేష్‌ కుమార్‌, సుఖ్‌బీఆర్‌సింగ్‌ సంధు తదితర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్రికెటర్‌ గౌతం గంభీర్‌ చైన్నె నుంచి ఢిల్లీకి వచ్చి ఓటేశారు. ఐపీఎల్‌ టీం కేకేఆర్‌కు మెంటర్‌గా ఉన్నప్పటికీ ఆయన ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ఒక రోజు విరామం ఉండడంతో ఢిల్లీ వచ్చి ఓటు వేశారు.

Updated Date - May 26 , 2024 | 06:15 AM