Share News

Rahul Gandhi ; ఇండియా కూటమి గెలిస్తే.. రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తేస్తాం

ABN , Publish Date - Feb 06 , 2024 | 03:26 AM

లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే.. కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన నిర్వహిస్తుందని,

 Rahul Gandhi ; ఇండియా కూటమి గెలిస్తే.. రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తేస్తాం

దేశవ్యాప్తంగా కులగణన చేపడతాం: రాహుల్‌

హేమంత్‌ సోరెన్‌ సతీమణికి పరామర్శ

రాంచీ, ఫిబ్రవరి 5: లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే.. కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన నిర్వహిస్తుందని, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేస్తుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. దళితులు, ఆదివాసీల రిజర్వేషన్లను తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆయన చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్ర ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో కొనసాగుతోంది. మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పనా సోరెన్‌ను రాహుల్‌ సోమవారం పరామర్శించారు. అనంతరం రాంచీలోని షహీద్‌ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్‌ మాట్లాడారు. ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి గిరిజనుడు కావడం వల్లే జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నించిందని మండిపడ్డారు. ‘ప్రజాస్వామ్యంపైనా, రాజ్యాంగంపైనా బీజేపీ దాడి చేస్తోంది. ప్రజల గొంతు నొక్కేస్తోంది. ఇండియా కూటమి అలా జరగనివ్వదు. ఝార్ఖండ్‌ ప్రభుత్వాన్ని కాపాడేందుకు కాంగ్రెస్‌, జేఎంఎం నిలబడ్డాయి. ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాలన్నింటిలోనూ వారు(బీజేపీ) ధనబలాన్ని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు’ అని రాహుల్‌ మండిపడ్డారు. కాగా, ప్రజల్ని ఓట్లు అడిగే సందర్భంలో తాను ఓబీసీనని చెప్పే ప్రధాని మోదీ.. కులగణన డిమాండ్‌ రావడంతో ‘రెండే కులాలున్నాయి.. ధనిక, పేద’ అంటున్నారని విమర్శించారు. దళితులు, గిరిజనులు, ఓబీసీల హక్కుల విషయానికి వచ్చేసరికి కులాలు లేవని ప్రధాని అంటున్నారని రాహుల్‌ మండిపడ్డారు.

Updated Date - Feb 06 , 2024 | 03:31 AM