Share News

రూఫ్‌టాప్‌ సోలార్‌ ద్వారా 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు

ABN , Publish Date - Feb 02 , 2024 | 05:00 AM

కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లో గృహవిద్యుత్తు వినియోగానికి సంబంధించి ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పేరిట సరికొత్త పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా.. ఇళ్లపై రూఫ్‌టాప్‌ సోలార్‌ ఏర్పాటు చేసుకున్న

రూఫ్‌టాప్‌ సోలార్‌ ద్వారా 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు

అదనపు విద్యుత్తును విక్రయించుకునేందుకూ అవకాశం

‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పేరుతో కొత్త పథకం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లో గృహవిద్యుత్తు వినియోగానికి సంబంధించి ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పేరిట సరికొత్త పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా.. ఇళ్లపై రూఫ్‌టాప్‌ సోలార్‌ ఏర్పాటు చేసుకున్న వారికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా.. అదనపు విద్యుత్తును డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలకు విక్రయించవచ్చని, తద్వారా ఏడాదికి రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు ఆదా చేసుకోవచ్చని పేర్కొంది. ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌కు కూడా ఈ పథకాన్ని వినియోగించవచ్చని తెలిపింది. ఈ సోలార్‌ సిస్టమ్‌ ఏర్పాటు ద్వారా వ్యాపార అవకాశాలు పెరుగుతాయని, వీటి తయారీ, సరఫరా, ఇన్‌స్టాలేషన్‌, నిర్వహణతో పెద్దసంఖ్యలో యువతకు ఉపాఽధి లభిస్తుందని వివరించింది. జనవరి 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రకటించిన విషయాన్ని నిర్మలా సీతారామన్‌ గుర్తు చేశారు. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆర్‌ఈసీ లిమిటెడ్‌కు ఈ పథకం అమలు బాధ్యతలు అప్పగించినట్లు ప్రకటించారు. ఏడాదిలోగా దేశంలో కోటి ఇళ్లకు రూఫ్‌టాప్‌ సోలార్‌ ఏర్పాటు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2019 మార్చి 8న న్యూ అండ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ మంత్రిత్వ శాఖ రెసిడెన్షియల్‌ రూఫ్‌టాప్‌ సోలార్‌ (ఆర్‌టీఎస్‌) ఫేజ్‌-2ను ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక సహాయం, సబ్సిడీతో రెసిడెన్షియల్‌ సెక్టార్‌లో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంతో ఆర్‌టీఎ్‌సను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. 2023 నవంబరు నాటికి 2651.10 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఆర్‌టీఎ్‌సను ఏర్పాటు చేశారు. తాజాగా ప్రధానమంత్రి సూర్యోదయ యోజనలో మరింత మెరుగైన సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Updated Date - Feb 02 , 2024 | 05:00 AM