Agriculture Sector : 1.52 లక్షల కోట్లతో వ్యవసాయానికి భారీ ఊతం
ABN , Publish Date - Jul 24 , 2024 | 05:46 AM
వ్యవసాయానికి కేంద్రం ఊతమందించే చర్యలను ప్రకటించింది. మధ్యంతర బడ్జెట్‌లో చెప్పిన పథకాలను కొనసాగిస్తూనే.. కొత్త విధానాలను ప్రకటించింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లను
కూరగాయల సాగుకు భారీ క్లస్టర్లు
వ్యవసాయానికి కేంద్రం ఊతమందించే చర్యలను ప్రకటించింది. మధ్యంతర బడ్జెట్‌లో చెప్పిన పథకాలను కొనసాగిస్తూనే.. కొత్త విధానాలను ప్రకటించింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లను కేటాయించింది. ముఖ్యంగా.. కూరగాయల సాగుకు భారీ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. కూరగాయల సేకరణ, నిల్వ, మార్కెటింగ్‌కు సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు స్టార్టప్‌లు, సహకార సంఘాలు, రైతు సంఘాలను ప్రోత్సహించనున్నట్లు వెల్లడించింది. వాతావరణ మార్పులను తట్టుకునేలా 32 వ్యవసాయ, ఉద్యాన కేటగిరీలకు చెందిన 109 రకాల అధిక దిగుబడి వంగడాలను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. 100 రోజుల కార్యక్రమంలో భాగంగా అధిక దిగుబడి వంగడాలను అందజేస్తామని పేర్కొంది. ప్రతికూల వాతావరణాన్ని కూడా తట్టుకుని, అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాల దిశగా పరిశోధనలను ప్రోత్సహించనున్నట్లు తెలిపింది. రానున్న రెండేళ్లలో కోటి మంది రైతులు ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చేలా ప్రోత్సహించి, వారి ఉత్పత్తులకు బ్రాండింగ్, సర్టిఫికేషన్ ఇస్తామని పేర్కొంది. ఈ విధానాన్ని శాస్త్రసాంకేతిక సంస్థలు, గ్రామ పంచాయతీల ద్వారా అమలు చేస్తామని, 10 వేల బయో-ఇన్‌పుట్ రిసోర్స్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. పప్పు ధాన్యాలు, నూనెగింజల సాగులో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా.. ప్రత్యేక వ్యూహంతో వాటి ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్‌ను బలోపేతం చేయనున్నట్లు వివరించింది. రొయ్యల సాగు కేంద్రాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి, నాబార్డ్ ద్వారా ప్రత్యేక ఆర్థిక సాయం అందజేస్తామని స్పష్టం చేసింది. ఐదు రాష్ట్రాల్లోని రైతులకు జన్ సమర్థ్ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేస్తామని వెల్లడించింది. వ్యవసాయంలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాను ప్రోత్సహిస్తామని, ఖరీఫ్ సీజన్‌లో 400 జిల్లాల్లో డిజిటల్ క్రాప్ సర్వేను నిర్వహిస్తామని ప్రకటించింది.