Share News

Miss Japan: మిస్ జపాన్ పరువుని గంగలో కలిపిన ‘ఎఫైర్’.. అసలేమైందంటే?

ABN , Publish Date - Feb 07 , 2024 | 02:58 PM

సాధారణంగా.. ఏ రంగంలో అయినా వృత్తికి, వ్యక్తిగత జీవితానికి సంబంధం ఉండదు. వృత్తిలో ఫలానా వ్యక్తి ప్రతిభను మాత్రమే లెక్కలోకి తీసుకుంటారే తప్ప, వ్యక్తిగత జీవితంలో ఏం చేస్తున్నారన్న విషయాన్ని అస్సలు పట్టించుకోరు. కానీ.. మిస్ జపాన్ టైటిల్ సొంతం చేసుకున్న కరోలినా షినో విషయంలో మాత్రం అలా జరగలేదు.

Miss Japan: మిస్ జపాన్ పరువుని గంగలో కలిపిన ‘ఎఫైర్’.. అసలేమైందంటే?

సాధారణంగా.. ఏ రంగంలో అయినా వృత్తికి, వ్యక్తిగత జీవితానికి సంబంధం ఉండదు. వృత్తిలో ఫలానా వ్యక్తి ప్రతిభను మాత్రమే లెక్కలోకి తీసుకుంటారే తప్ప, వ్యక్తిగత జీవితంలో ఏం చేస్తున్నారన్న విషయాన్ని అస్సలు పట్టించుకోరు. కానీ.. మిస్ జపాన్ టైటిల్ సొంతం చేసుకున్న కరోలినా షినో విషయంలో మాత్రం అలా జరగలేదు. వ్యక్తిగత జీవితంలో తాను చేసిన ఓ తప్పు కారణంగా ఆమె తన టైటిల్‌తో పాటు పరువుని కూడా కోల్పోవాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా చీవాట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అసలు మేటర్ ఏమిటంటే..

కరోలినా కుటుంబ సభ్యులు ఉక్రెయిన్‌కు చెందిన వారు. అయితే.. కరోలినాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె కుటుంబం జపాన్‌కు షిఫ్ట్ అయ్యింది. మోడలింగ్‌లో తనకు ఆసక్తి ఉండటంతో.. ఆ రంగంలో అడుగుపెట్టింది. అంచెలంచెలుగా ఎదుగుతూ.. గత నెలలో జరిగిన ‘మిస్ జపాన్ 2024’ పోటీల్లో విజేతగా నిలిచింది. అయితే.. ఆ సమయంలో ఆమెపై విమర్శలొచ్చాయి. జపాన్ దేశీయురాలు కానీ కరోలినాకు మిస్ జపాన్ టైటిల్ ఎలా ఇస్తారని ప్రశ్నల వర్షం కురిశాయి. ఈ నేపథ్యంలోనే.. ఆమెకు సంబంధించిన ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఒక వివాహితుడితో కరోలినా వివాహేతర సంబంధం కలిగి ఉందని ఓ స్థానిక పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ అంశం దుమారం కావడంతో.. ఆమెకిచ్చిన టైటిల్‌ని తిరిగి తీసుకోవాలన్న డిమాండ్లు వచ్చాయి.


అప్పుడు మిస్ జపాన్ పోటీ నిర్వాహకులు కరోలినాకు మద్దతుగా నిలిచారు. ఆ వ్యక్తి వివాహితుడన్న విషయం ఆమెకి తెలియదని సమర్థించారు. కానీ.. ఇంతలోనే మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అతడు వివాహితుడన్న విషయం తనకు ముందే తెలుసని, అయినా అతనితో సంబంధాన్ని కొనసాగించానని కరోలినా ఒప్పుకున్నట్లు.. ఆమె పనిచేస్తున్న మోడల్‌ ఏజెన్సీ తెలిపింది. ఈ విషయాలన్నీ బయటకు పొక్కడంతో.. కరోలినా మిస్ జపాన్ అసోసియేషన్‌కు క్షమాపణలు తెలుపుతూ, తన ‘మిస్ జపాన్’ కిరీటాన్ని తిరిగి ఇచ్చేసింది. దీనిపై ఆ సంస్థ స్పందిస్తూ.. వ్యక్తిగత కారణాలతో కరోలినా తన మిస్ జపాన్ కిరీటాన్ని అసోసియేషన్‌కు తిరిగి ఇచ్చేసిందని, కాబట్టి 2024లో ‘మిస్ జపాన్’ ఎవరూ లేరని ఖరారు చేసింది.

ఈ వ్యవహారంపై కరోలినా ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమంగా స్పందిస్తూ.. మొదట్లో గందరగోళం, భయం కారణంగా తాను నిజం మాట్లాడలేకపోయానని వివరణ ఇచ్చింది. తనని నమ్మి తనకు మద్దతుగా నిలిచిన వారికి క్షమాపణలు చెప్తున్నానని పేర్కొంది. ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణిస్తూ.. తాను మిస్ జపాన్ టైటిల్‌ని తిరిగి ఇచ్చేశానని తెలిపింది. ఆ వ్యక్తి భార్యతో పాటు ఇతరులకు కూడా తాను సారీ చెప్తున్నానని చెప్పింది. అయితే.. ఈ పోటీలతో తనను జపాన్‌ దేశీయురాలిగా గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉందని కరోలినా చెప్పుకొచ్చింది.

Updated Date - Feb 07 , 2024 | 02:58 PM