అరచేతిని అడ్డుపెట్టి..
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:40 AM
ఏదైనా స్టోర్‌కో, షాపింగ్ మాల్‌కో వెళితే సరుకులు కొన్నాక నగదు రహిత చెల్లింపులు మామూలైపోయాయి. డెబిట్, క్రెడిట్ కార్డుతోనో, యూపీఐ యాప్స్ ద్వారానో డబ్బు చెల్లిస్తుంటాం! మరి.. ఇవేవీ లేకుండా కేవలం ‘అరచేతి’ ద్వారా చెల్లింపులు చేయగలిగితే? మీరు

చైనాలో స్టోర్లు, షాపింగ్ మాల్స్‌లో అరచేతితో చెల్లింపులు
సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసిన పాక్ కంటెంట్ క్రియేటర్
న్యూఢిల్లీ, అక్టోబరు 24: ఏదైనా స్టోర్‌కో, షాపింగ్ మాల్‌కో వెళితే సరుకులు కొన్నాక నగదు రహిత చెల్లింపులు మామూలైపోయాయి. డెబిట్, క్రెడిట్ కార్డుతోనో, యూపీఐ యాప్స్ ద్వారానో డబ్బు చెల్లిస్తుంటాం! మరి.. ఇవేవీ లేకుండా కేవలం ‘అరచేతి’ ద్వారా చెల్లింపులు చేయగలిగితే? మీరు చదివింది వాస్తవమే. స్కానర్ ముందు అరచేతిని ఉంచితే చాలు.. కొన్న సరుకుల విలువ మేరకు బిల్లు చెల్లింపు జరిగిపోతుంది. ఈ వినూత్న సాంకేతిక పరిజ్ఞానం చైనాలో వచ్చేసింది. పాకిస్థాన్‌కు చెందిన రానా హంజా సైఫ్ అనే కంటెంట్ క్రియేటర్ చైనాలోని జూజౌ పట్టణంలోని ఓ స్టోర్‌లో ఈ ‘పామ్ పేమెంట్ సిస్టమ్’ ద్వారా జరుగుతున్న చెల్లింపులను చూసి ఆశ్చర్యపోయాడు. చైనాలో ఈ తరహా చెల్లింపుల కోసం ఆయన తన అరచేతిని స్కాన్ చేయించుకొని రిజిస్టర్ చేసుకున్నారు. తర్వా త తన చేతితోనే చెల్లింపులు చేశారు. ఈ తతంగాన్నంతా ఆయన వీడియోగా తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. సాంకేతిక, మౌలిక రంగాల్లో ముందంజలో నిలిచి ప్రపంచ దేశాలకే సవాలు విసురుతున్న చైనా ‘ప్రస్తుతం 2050’లో ఉంది అని వీడియో కింద క్యాప్షన్ పెట్టారు. సైఫ్. పామ్ పేమెంట్ విధానంపై నెటిజెన్లు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు. ‘త్వరలో ఇది ప్రపంచ వ్యాప్తం కానుందేమో’ అని ఓ నెటిజెన్ కామెంట్ చేశారు. దీనిపై సైఫ్ తరహాలోనే ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గొయాంకా గతంలోనే ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. బీజింగ్‌లోని మెట్రోలో ఓ మహిళ తన చేతితో చెల్లింపు చేస్తుండటాన్ని అందులో చిత్రీకరించారు.
ఎలా పనిచేస్తుందంటే..
అరచేతి ద్వారా చెల్లింపులు చేయాలంటే యూపీఐ యాప్స్ తరహాలోనే కొన్ని లాంఛనాలు పూర్తిచేయాలి. మన అరచేతిని ప్రత్యేక స్కానర్ ద్వారా స్కాన్ చేయించాలి. ఆ తర్వాత ఆ స్కాన్ చేసిన అరచేతి నకలును బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసి ఉన్న మొబైల్ నంబరుతో కూడిన యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఒకసారి రిజిస్ట్రేషన్ పూర్తయితే.. ఎక్కడైనా కేవలం అరచేతిని ఉపయోగించి నగదు రహిత చెల్లింపులు చేయొచ్చు. ఇది చైనాలో మాత్రమే అమల్లో ఉంది.