Hongkong: విమానం ఢీకొని వ్యక్తి దుర్మరణం.. ఎయిర్‌పోర్టులో అసాధారణ ప్రమాదం
ABN , Publish Date - Feb 06 , 2024 | 03:52 PM
హాంగ్‌కాంగ్ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న గ్రౌండ్ వర్కర్ ఒకరు విమానం ఢీకొనడంతో దుర్మరణం చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: హాంగ్‌కాంగ్ విమానాశ్రయంలో (Hongkong Airport) షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న గ్రౌండ్ వర్కర్ ఒకరు విమానం ఢీకొనడంతో దుర్మరణం చెందారు. మంగళవారం జరిగిన ఈ అసాధారణ ప్రమాదం ఒక్కసారిగా కలకలం రేపింది (Man Falls Out Of Truck At Hong Kong Airport Dies After Being Hit By Plane).
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ టో ట్రక్ (విమానాలను లాక్కెళ్లే వాహనాలు) విమానాన్ని టాక్సీవేపై మరో చోటకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ వాహనాన్ని 60 ఏళ్ల డ్రైవర్ నడుపుతుండగా ప్యాసెంజర్ సీటులో జోర్డాన్‌కు చెందిన వర్కర్ ఒకరు కూర్చున్నారు. ఈ క్రమంలోనే ప్యాసెంజర్ సీటులోని వ్యక్తి కింద పడిపోవడంతో వెనక ఉన్న విమానం తగిలి అతడు దుర్మరణం చెందాడు. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల భావిస్తున్నారు.
తెల్లవారుజామున ఇతర సిబ్బంది.. ట్యాక్సీవేపై అచేతనంగా పడి ఉన్న వర్కర్‌ను గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అయితే, తీవ్రగాయాల పాలైన అతడు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు గుర్తించారు. ఈ ఘటనలో టో ట్రక్‌ను నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలను మాత్రం వెల్లడించలేదు.