Share News

Maldives: ఇదిరా భారత్ దెబ్బ.. మాల్దీవులకు భారీగా తగ్గిన ఇండియన్ టూరిస్టులు..

ABN , Publish Date - Mar 09 , 2024 | 03:16 PM

భారత్‌తో దౌత్యపర వివాదం మాల్దీవుల(Maldives) సర్కార్‌కు తీరని నష్టం మిగులుస్తోంది. ఆ దేశానికి పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయంలో భారతీయుల వాటే అధికం. ఈ వివాదాల నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య 33 శాతానికి తగ్గిందని మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ నివేదించింది. దీంతో ఆ దేశానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది.

Maldives: ఇదిరా భారత్ దెబ్బ.. మాల్దీవులకు భారీగా తగ్గిన ఇండియన్ టూరిస్టులు..

మాలీ: భారత్‌తో దౌత్యపర వివాదం మాల్దీవుల(Maldives) సర్కార్‌కు తీరని నష్టం మిగులుస్తోంది. ఆ దేశానికి పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయంలో భారతీయుల వాటే అధికం. ఈ వివాదాల నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య 33 శాతానికి తగ్గిందని మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ నివేదించింది. దీంతో ఆ దేశానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది. పర్యాటక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. గత ఏడాది మార్చి 4 నాటికి 41,054 మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారు.

ఈ ఏడాది మార్చి 2 నాటికి కేవలం 27,224 మంది భారతీయులే మాల్దీవులకు వెళ్లారు. అంటే గతేడాది కంటే 13,830 తక్కువ. గతంలో మాల్దీవులకు వచ్చే పర్యాటకుల్లో 10 శాతం భారతీయుల వాటానే ఉండేది. అది ఇప్పుడు ఆరు శాతానికి పడిపోయింది. 2023లో లక్షద్వీప్ పర్యటన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దీవిలో దిగిన ఫొటోలను ఎక్స్‌లో షేర్ చేశారు. పర్యాటకులకు నూతన గమ్యస్థానం లక్షదీవులంటూ తన పోస్టులో రాశారు. ఆయన పోస్ట్‌కు వ్యతిరేకంగా మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు మోదీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో వివాదం చెలరేగింది.


లక్షద్వీప్‌ బీచ్ టూరిజాన్ని పెంపొందించి, దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించే గమ్యస్థానంగా అభివృద్ధి చేస్తామని మోదీ అన్నారు. మంత్రుల వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మాల్దీవుల రాయబారిని పిలిపించి భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ అంశం దౌత్యపర వివాదంగా మారింది.

భారత్ నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి బాయ్‌కాట్ మాల్దీవ్స్ అనే ప్రచారం హోరెత్తడంతో ఆ దేశానికి వెళ్లే చాలా మంది పర్యాటకులు తమ నిర్ణయాలను ఉపసంహరించుకున్నారు. దీంతో మాల్దీవుల పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ప్రతి సంవత్సరం 2 లక్షల కంటే ఎక్కువ మంది పర్యాటకులతో మాల్దీవులు కిక్కిరిసిపోయేది. 2021-23 నాటికి మాల్దీవుల పర్యాటకంలో భారత్ అగ్రస్థానంలో ఉండేది.

Updated Date - Mar 09 , 2024 | 03:18 PM