Share News

India Maldives Row: ముయిజ్జు.. మొండితనం మానేసి, సంబంధాల్ని సరిదిద్దుకోండి

ABN , Publish Date - Mar 25 , 2024 | 10:13 PM

మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ ముయిజ్జు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ముయిజ్జు భారత వ్యతిరేకత వైఖరి వల్లే ఇరు దేశాల మధ్య ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే.. తన మొండి వైఖరిని మార్చుకోవాల్సిందిగా మాల్దీవుల ప్రతిపక్షాలు కోరుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ అదే డిమాండ్ చేశారు.

India Maldives Row: ముయిజ్జు.. మొండితనం మానేసి, సంబంధాల్ని సరిదిద్దుకోండి

మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ ముయిజ్జు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ముయిజ్జు భారత వ్యతిరేకత వైఖరి వల్లే ఇరు దేశాల మధ్య ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే.. తన మొండి వైఖరిని మార్చుకోవాల్సిందిగా మాల్దీవుల ప్రతిపక్షాలు కోరుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ అదే డిమాండ్ చేశారు. మొండిగా ఉండటం మానేసి.. మాల్దీవులు ఎదుర్కుంటున్న ఆర్థిక సవాళ్లను పరిష్కరించేందుకు, పొరుగు దేశాలతో సంబంధాల్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాలని కోరారు. ఇటీవల రుణమాఫీ కోసం ముయిజ్జు భారత్‌కు చేసిన విజ్ఞప్తి అనంతరం సోలిహ్ ఈ వ్యాఖ్యలు చేశారు.


మాల్దీవియన్ డెమొక్రాటిక్ పార్టీ (MDP) పార్లమెంటరీ అభ్యర్థులకు మద్దతుగా ‘మేల్’లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో సోలిహ్ మాట్లాడుతూ.. పొరుగు దేశాలతో ముఖ్యంగా భారత్‌తో ఉండాల్సిన సహకార ఒప్పందాల అవసరాన్ని నొక్కి చెప్పారు. చైనాకు ఎక్కువ రుణాలు ఉన్నప్పటికీ.. ముయిజ్జు మాత్రం భారత్‌తో రుణ పునర్నిర్మాణ చర్చలను కోరినట్లు తాను విన్నానని.. ఇది ఆర్థిక వాస్తవాలను తప్పుగా చూపించడమేనని ఆయన ఎత్తి చూపారు. మాల్దీవులు ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితిలో భారత్ అప్పుల పాత్ర ఏమీ లేదని సోలిహ్ అన్నారు. మాల్దీవులు చైనాకు 18 బిలియన్ల మాల్దీవుల రుణాలు, భారతదేశానికి 8 బిలియన్ల మాల్దీవుల రుణాలు ఉన్నాయని వివరణ ఇచ్చారు. భారత్ విషయానికొస్తే.. మాల్దీవులు 25 ఏళ్లలో రుణాన్ని చెల్లించాలని, ఏదేమైనా భారత్ తమకు తప్పకుండా సహాయం చేస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో పొరుగు దేశాల నుంచి సహాయం పొందాలంటే.. ముయిజ్జు తన మొండి వైఖరిని పక్కనపెట్టి, భారత్‌తో చర్చల మార్గాన్ని అనుసరించాల్సి ఉంటుందని సోలిహ్ సూచించారు. తమకు సహాయం చేసేందుకు అనేక పార్టీలున్నాయని, కానీ ముయిజ్జు మాత్రం రాజీపడటానికి ఇష్టపడడని దుయ్యబట్టారు. ఇప్పుడిప్పుడే మాల్దీవుల ప్రభుత్వం పరిస్థితిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టిందని తాను భావిస్తున్నానని చెప్పుకొచ్చారు.

Updated Date - Mar 25 , 2024 | 10:13 PM