Share News

Aliens: నాసా వద్ద ఏలియన్స్ మృతదేహాలు.. కళ్లారా చూశానన్న మాంత్రికుడు

ABN , Publish Date - Jan 28 , 2024 | 05:07 PM

అసలు ఏలియన్స్ ఉన్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం వెతికేందుకు అంతరిక్ష పరిశోధన సంస్థలు కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇతర గ్రహాల్లోనూ జీవం ఉందా? లేదా? అనే విషయంపై పరిశోధనలు చేస్తున్నాయి. ఆ ప్రయోగాల ఫలితం ఇంకా తేలలేదు

Aliens: నాసా వద్ద ఏలియన్స్ మృతదేహాలు.. కళ్లారా చూశానన్న మాంత్రికుడు

అసలు ఏలియన్స్ ఉన్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం వెతికేందుకు అంతరిక్ష పరిశోధన సంస్థలు కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇతర గ్రహాల్లోనూ జీవం ఉందా? లేదా? అనే విషయంపై పరిశోధనలు చేస్తున్నాయి. ఆ ప్రయోగాల ఫలితం ఇంకా తేలలేదు కానీ.. ఇక్కడ భూమిపై ఉన్న కొందరు వ్యక్తులు మాత్రం తాము గ్రహాంతరవాసులతో పాటు యూఫోలను చూశామంటూ తమ వాదనలు వినిపించిన సందర్భాలున్నాయి. అంతెందుకు.. అత్యంత రహస్య ప్రదేశమైన ‘ఏరియా 51’లో ఏలియన్స్‌పై ప్రయోగాలు జరుగుతున్నాయని చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ ప్రచారానికి బలం చేకూర్చే సాక్ష్యాలేమీ లేవు. అసలు ఏలియన్స్ ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి రుజువులు లేవు.


ఇలాంటి తరుణంలో.. ఉరి గెల్లర్ అనే ప్రముఖ మాంత్రికుడు ఏలియన్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను గ్రహాంతరవాసుల్ని కళ్లారా చూశానని.. వాటి తల పెద్దగానూ, శరీరం చిన్నగానూ ఉన్నాయని పేర్కొన్నాడు. అవి చూడ్డానికి మనుషుల్లాగే ఉన్నప్పటికీ.. అవి మనుషులైతే కావని చెప్పాడు. ఈ ఏలియన్స్ మృతదేహాల వద్దకు తనను ఒక నాసా ఇంజనీర్, వ్యోమగామి తీసుకెళ్లారని ఈ 77 ఏళ్ల మెజీషియన్ తెలిపాడు. నాసాకు చెందిన గొడ్దార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ క్రింద ఒక భారీ రిఫ్రిజిరేటెడ్ గది ఉందని, దాని లోపల ఈ గ్రహాంతరవాసుల మృతదేహాలను ఉంచారని అన్నాడు. ఈ ప్రదేశం వాషింగ్టన్ డీసీకి ఈశాన్యంగా 10 కి.మీ. దూరంలో ఉందన్నాడు. జర్మన్ రాకెట్ ఇంజనీర్ వెర్నర్ బ్రౌన్, చంద్రునిపై నడిచిన ఆరో వ్యోమగామి ఎడ్గార్ మిచెల్ కలిసి తనను బేస్ వద్ద ఉన్న కాంక్రీట్ భవనానికి తీసుకెళ్లారన్నాడు. అక్కడ తాను గ్లాస్ కంటైనర్లలో ఉన్న దాదాపు 8 ఏలియన్ మృతదేహాలను చూశానని చెప్పుకొచ్చాడు.

లోపలికి వెళ్లడానికి ముందు వెర్నర్ బ్రౌన్ తనకు నాసా లోగో కలిగిన ఒక వెచ్చని కోట్ ధరించమని ఇచ్చాడని, అది వేసుకొని తాను లోనికి వెళ్లానని ఉరి గెల్లర్ చెప్పాడు. లోపలికి వెళ్లాక తనకు ఆసుపత్రి వాసన వచ్చిందన్న ఆయన.. ఒక పెద్ద గాజు లోపల మృతదేహం ఉండటాన్ని చూశానని, అది చూసి తాను ఒక్కసారిగా ఆశ్చర్యపోయానని అన్నాడు. అదేదో పెద్ద ప్రమాదాన్ని చూసిన భావన తనకు కలిగిందన్నాడు. ఆ కంటైనర్లు మందపాటి గాజుతో తయారు చేయబడ్డాయని, వాటిలోనే ఏలియన్స్ మృతదేహాలున్నాయని చెప్పాడు. వాటికి గాయాలున్నాయని కూడా తెలిపాడు. ఈ విధంగా ఉరి గెల్లర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. కాగా.. ఏలియన్స్ గురించి గెల్లర్ ఇలాంటి వాదనలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2021లో తాను ఏలియన్స్‌తో సంప్రదింపులు జరిపేందుకు అమెరికాతో కలిసి రహస్యంగా పని చేస్తున్నానని చెప్పాడు.

Updated Date - Jan 28 , 2024 | 05:07 PM