Share News

కెనడాలో భారతీయులకు గండం!

ABN , Publish Date - Nov 13 , 2024 | 06:09 AM

కెనడాలో నివసిస్తున్న భారతీయులు ఖలిస్థానీ తీవ్రవాదుల నుంచి తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నారు. వాట్సా్‌పలో గ్రూపులను ట్రాక్‌ చేయడం నుంచి భౌతిక ఘర్షణలు, నిరసనలు, బెదిరింపుల వరకూ ఖలిస్థానీ అనుకూల సంస్థలు (పీకేఈ) అక్కడి భారతీయ సమాజాన్ని టార్గెట్‌ చేస్తున్నాయి. ఈ నెల మొదటి వారంలో కొందరు పాకిస్థాన్‌ నాయకులతో పాటు ఆ దేశానికి చెందిన

కెనడాలో భారతీయులకు గండం!

పాక్‌ ఉగ్ర గ్రూపులతో ఖలిస్థానీ నేతల సమావేశం..

త్వరలో నిరసనలు హింసాత్మకంగా మారే ప్రమాదం

ఈ ఏడాది చివరికి పరిస్థితి తీవ్రం

నిఘా వర్గాల ఆందోళన

అట్టవా, నవంబరు 12: కెనడాలో నివసిస్తున్న భారతీయులు ఖలిస్థానీ తీవ్రవాదుల నుంచి తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నారు. వాట్సా్‌పలో గ్రూపులను ట్రాక్‌ చేయడం నుంచి భౌతిక ఘర్షణలు, నిరసనలు, బెదిరింపుల వరకూ ఖలిస్థానీ అనుకూల సంస్థలు (పీకేఈ) అక్కడి భారతీయ సమాజాన్ని టార్గెట్‌ చేస్తున్నాయి. ఈ నెల మొదటి వారంలో కొందరు పాకిస్థాన్‌ నాయకులతో పాటు ఆ దేశానికి చెందిన ఉగ్ర గ్రూపులతో సమావేశమైన తర్వాత ఖలిస్థానీ నాయకత్వం నిరసనల దూకుడును తీవ్రతరం చేసిందని భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకించి భారతీయులు అధిక సంఖ్యలో నివసించే ప్రాంతాల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నాయి. ఈ నిరసనలు త్వరలోనే హింసాత్మకంగా మారి, పీకేఈకి చెందిన వారు భారతీయులను బెదిరించడంతో పాటు దాడులకు పాల్పడవచ్చని, వారిపై కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉందని ఆ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక పోలీసులు, అధికారుల సహకారంతో కెనడాలోని వివిధ ప్రాంతాల్లో ఖలిస్థాన్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్న భారతీయుల వివరాలను ఈ సంస్థలు సేకరిస్తున్నాయి. వారి చిరునామా, ఫోన్‌ నంబర్లు తదితర కీలక సమాచారాన్ని గ్రూపుల్లో షేర్‌ చేస్తుండటంతో ఆయా కుటుంబాలు ప్రస్తుతం తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. వివిధ భారతీయ కమ్యూనిటీలకు చెందిన సోషల్‌ మీడియా గ్రూపుల్లో ఖలిస్థానీ సంస్థల సభ్యులు చొరబడ్డారని, ఖలిస్థానీ మద్దతుదారులను రెచ్చగొట్టడానికి వీరు చాట్‌లు, సందేశాలను ఉపయోగిస్తున్నారని ఓ అధికారి వివరించారు. ఖలిస్థాన్‌కు మద్దతివ్వాలని, లేకుంటే కెనడా నుంచి వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్‌ చేస్తూ భారతీయులను బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కెనడాలో నివసిస్తున్న చాలామంది భారతీయులు ఇప్పటికే తమ ఆస్తులను అమ్ముకోవడం ప్రారంభించారు. వారంతా స్వదేశానికి తిరిగి రావాలని యోచిస్తున్నారు. ఈ ఏడాది చివరికి పరిస్థితి మరింత తీవ్రమవుతుందని, కెనడాలో నివసిస్తున్న భారతీయులకు మరింత ప్రమాదకరంగా మారుతుందని భారత నిఘా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


ఎన్‌డీపీకి ఖలిస్థాన్‌ విరాళాలు

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో మాజీ మిత్రుడు జగ్మీత్‌ సింగ్‌ నేతృత్వంలోని న్యూ డెమొక్రటిక్‌ పార్టీ (ఎన్‌డీపీ)కి ఖలిస్థానీ ఉగ్రవాదుల నుంచి నిధులు సమకూరాయని తేలిపోయింది. కెనడాలో హత్యకు గురైన ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ 2014 నుంచి 2019 వరకూ ఎన్‌డీపీకి విరాళాలు ఇచ్చినట్లు రుజువు చేసే కీలక పత్రాలు వెలుగులోకి వచ్చాయి. అదేవిధంగా ఖలిస్థానీ ఉగ్రవాదులు మో దలివాల్‌, తేహల్‌ సింగ్‌, భగత్‌ బ్రార్‌, మల్కీత్‌ సింగ్‌, దులాయ్‌ తదితరులు కూడా ఎన్‌డీపీకి విరాళాలు ఇచ్చినట్లు వెల్లడైంది. కాగా, భారత కాన్సులేట్‌ ఆధ్వర్యంలో బ్రాంప్టన్‌లోని త్రివేణి మందిరంలో ఈ నెల 17న నిర్వహించాల్సిన లైఫ్‌ సర్టిఫికెట్ల జారీ కార్యక్రమం రద్దయింది. అత్యంత హింసాత్మక నిరసనలు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ వర్గాలు మంగళవారం ప్రకటించాయి.

కెనడా వీసా నిబంధనలు కఠినతరం

బహుళ ప్రవేశ వీసా జారీకి కొత్త నిబంధనలు విడుదల

కెనడా ప్రభుత్వం బహుళ ప్రవేశ వీసాల జారీ నిబంధనలను కట్టుదిట్టం చేసింది. ఆ మేరకు కొత్త నిబంధనలను మంగళవారం విడుదల చేసింది. సింగిల్‌ ఎంట్రీ వీసా పొందిన వ్యక్తులు ఆ వీసాతో ఒక్కసారి మాత్రమే కెనడాలోకి ప్రవేశించగలరు. బహుళ ప్రవేశ వీసా పొందిన వ్యక్తులు అది చెల్లుబాటయ్యే గడువు వరకు ఎన్నిసార్లు అయినా కెనడాకు రావొచ్చు. తాజా నిబంధనల ప్రకారం.. గరిష్ఠ కాలానికి జారీ చేసిన బహుళ ప్రవేశ వీసాలను ఇకపై ప్రామాణిక పత్రంగా పరిగణించబోరు. ఏదేని వ్యక్తికి వీసాను సింగిల్‌ ఎంట్రీకి జారీ చేయాలా? లేక బహుళ ఎంట్రీకి జారీ చేయాలా? అనేది ఇకపై కెనడా ఇమ్మిగ్రేషన్‌ విభాగం ఐఆర్‌సీసీ నిర్ణయిస్తుంది. వీసా చెల్లుబాటు గడువును కూడా ఐఆర్‌సీసీనే నిర్ణయిస్తుంది. బహుళ ప్రవేశ వీసాలు గరిష్ఠంగా పదేళ్ల వరకు లేదా ట్రావెల్‌ డాక్యుమెంట్‌, బయోమెట్రిక్‌ల చెల్లుబాటు గడువు ముగిసే వరకు(ఏది ముందు అయితే అదే) చెల్లుబాటు అవుతాయి. గరిష్ఠంగా ఎంతకాలానికి బహుళ ప్రవేశ వీసాను జారీ చేయాలనేది అధికారులే నిర్ణయిస్తారు. ఏ కారణంతో కెనడాకు వస్తున్నారు? వారి ఆరోగ్య పరిస్థితి, కెనడాలో నివసించే కాలానికి అయ్యే వ్యయానికి సరిపడా నిధులు ఉన్నాయా? తదితర కారణాలను పరిశీలించి సింగిల్‌ ఎంట్రీ వీసా ఇవ్వాలా? లేక బహుళ ఎంట్రీ వీసా ఇవ్వాలా? అనేది నిర్ణయిస్తారు.

Updated Date - Nov 13 , 2024 | 06:10 AM