Share News

Thai Airways: టేకాఫ్‌కి ముందు షాకిచ్చిన టూరిస్ట్.. ఎయిర్‌పోర్టులో అల్లకల్లోలం

ABN , Publish Date - Feb 10 , 2024 | 03:19 PM

థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మాయి ఎయిర్‌పోర్ట్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక విమానం టేకాఫ్‌కి సిద్ధమవుతున్న తరుణంలో.. ఓ టూరిస్ట్ ఉన్నట్లుండి ఎగ్జిట్ డోర్ తెరిచాడు. దీంతో.. లోపలున్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. విమానాన్ని వెంటనే టర్మినల్‌కు తీసుకెళ్లి, ఆ ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Thai Airways: టేకాఫ్‌కి ముందు షాకిచ్చిన టూరిస్ట్.. ఎయిర్‌పోర్టులో అల్లకల్లోలం

థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మాయి ఎయిర్‌పోర్ట్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక విమానం టేకాఫ్‌కి సిద్ధమవుతున్న తరుణంలో.. ఓ టూరిస్ట్ ఉన్నట్లుండి ఎగ్జిట్ డోర్ తెరిచాడు. దీంతో.. లోపలున్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. విమానాన్ని వెంటనే టర్మినల్‌కు తీసుకెళ్లి, ఆ ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. తాను ఈ ఎగ్జిట్ డోర్ తెరిచే సమయంలో ఏదో భ్రమలో ఉన్నానని ఆ ప్రయాణికుడు జవాబు ఇవ్వడం గమనార్హం. ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

థాయ్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఒక విమానం విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవ్వడానికి రెడీ ఉండగా.. అందులో ఉన్న ఓ కెనడియన్ టూరిస్ట్ తన సీటులో నుంచి లేచాడు. మెల్లగా నడుచుకుంటూ ఎగ్జిట్ డోర్ వద్దకు వెళ్లాడు. ఒక్కసారిగా ఆ డోర్ తెరవడంతో.. విమానంలోని ‘ఇన్‌ఫ్లేటబుల్ స్లైడ్’ యాక్టివేట్ అయ్యింది. దీంతో వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని, ఆ ఎగ్జిట్ డోర్ మూసివేశారు. విమానాన్ని తిరిగి టర్మినల్‌కు తీసుకొచ్చారు. అక్కడ స్థానిక పోలీసులు ఆ టూరిస్ట్‌ని అరెస్టు చేశారు. ఈ ఘటన వల్ల ఆ విమానం ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది. అంతేకాదు.. మరో 12 విమానాల ప్రయాణాలపై కూడా ఈ ఘటన ప్రభావం చూపింది.


ఆ కెనడియన్ టూరిస్ట్ తరఫు లాయర్ మాట్లాడుతూ.. తాను ఎగ్జిట్ డోర్ తెరిచినట్టు తన క్లయింట్ ఒప్పుకున్నాడని తెలిపాడు. ఆ సమయంలో తాను ఏదో భ్రమలో ఉన్నానని చెప్పాడన్నారు. అటు.. చియాంగ్ మాయి విమానాశ్రయం డైరెక్టర్ రోన్నకోర్న్ మాట్లాడుతూ.. ఆ టూరిస్ట్ ఎగ్జిట్ డోర్ తెవరడంతో ఎయిర్‌పోర్టులో అల్లకల్లోల వాతావరణం నెలకొందన్నారు. విమానం తిరిగి టెర్మినల్‌కు తిరిగొచ్చిందని.. సాంకేతిక నిపుణులు భద్రతా తనిఖీలు నిర్వహించిన తర్వాత అది బయలుదేరిందని చెప్పారు. మరోవైపు.. విమానం 30 వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగి ఉంటే తమ పరిస్థితి ఏంటంటూ ఓ ప్రయాణికురాలు ఆందోళన వ్యక్తం చేసింది.

ఇదిలావుండగా.. గత నెలలో మెక్సికోలోనూ సరిగ్గా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కొన్ని అనుకోని కారణాల వల్ల విమానం నాలుగు గంటలపాటు ఎయిర్‌పోర్టులో నిలిచిపోవడంతో.. నీళ్లు లేక, గాలి అందక ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచాడు. అనంతరం విమానం రెక్కపై నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఆ కాసేపటికే అతడు తిరిగొచ్చాడు కానీ, ఈ చర్యకు పాల్పడినందుకు అతడ్ని అరెస్ట్ చేశారు. అయితే.. ఈ వ్యవహారంలో ఇతర ప్రయాణికులు అతనికి మద్దతుగా నిలిచారు. తమకు గాలి అందక ఇబ్బంది పడుతున్నప్పుడు అతడు డోర్ తెరిచి మంచి పనే చేశాడంటూ.. అతని చర్యను సమర్థించారు.

Updated Date - Feb 10 , 2024 | 03:19 PM