భారత దౌత్యవేత్తలపై నిఘా!
ABN , Publish Date - Oct 20 , 2024 | 05:40 AM
కెనడాలోని మిగిలిన భారత దౌత్యవేత్తలపై గట్టి నిఘా ఉంచామని ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ తెలిపారు. ‘‘వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిన, కెనడా పౌరుల జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ప్రయత్నించిన ఏ ఒక్క దౌత్య వేత్తను మా ప్రభుత్వం
కెనడా విదేశాంగ మంత్రి మెలానీ వెల్లడి
టొరంటో, అక్టోబరు 19: కెనడాలోని మిగిలిన భారత దౌత్యవేత్తలపై గట్టి నిఘా ఉంచామని ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ తెలిపారు. ‘‘వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిన, కెనడా పౌరుల జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ప్రయత్నించిన ఏ ఒక్క దౌత్య వేత్తను మా ప్రభుత్వం ఉపేక్షించదు’’ అని శుక్రవారం తెలిపారు. సోమవారం భారత ప్రభుత్వం కెనడాకు చెందిన ఆరుగురు దౌత్యవేత్తలను బహిష్కరించిన దరిమిలా.. కెనడా కూడా తమ దేశంలోని ఆరుగురు భారత దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జోలీ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌ను రష్యాతో పోల్చారు. భారత దౌత్యవేత్తలకు కెనడాలో జరిగిన హత్యలు, హత్యా బెదిరింపులతో సంబంధాలు ఉన్నాయని తమ జాతీయ పోలీసు దళం గుర్తించినట్టు సంచలన ఆరోపణలు చేశారు. ‘‘కెనడా గడ్డపై ఇలాంటి అంతర్జాతీయ అణిచివేతలను చూస్తూ ఊరుకోం. ఇలాంటి ఘటనలు ఐరోపాలో చూశాం. జర్మనీ, బ్రిటన్‌లలో రష్యా ఇలాంటి దురాగతాలకు పాల్పడింది’’ అని జోలీ అన్నారు.
భారత జర్నలిస్టులపై కూడా
భారత జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులపైనా కెనడా ప్రభుత్వం డేగ కన్ను సారించింది. వారి ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తోంది. నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యల అనంతరం.. అంతర్జాతీయ సమాచార మార్పిడిలో అవకతవకలు, జర్నలిస్టుల వైఖరికి సంబంధించి కెనడా ర్యాపిడ్ రెస్పాన్స్ మెకానిజం(ఆర్‌ఆర్‌ఎం) సెప్టెంబరు 26న ఓ నివేదిక రూపొందించింది. ఈ నివేదికలో.. ‘‘గోడి మీడియా... ప్రధాని ట్రూడో సహా కెనడా సంస్థలను ఉగ్రవాదానికి దోహదపడే సంస్థలుగా పేర్కొంది’’ అని ఆర్‌ఆర్‌ఎం వెల్లడించింది.