Share News

అబ్బే.. మోదీ పాత్ర ఉందనలేదు

ABN , Publish Date - Nov 23 , 2024 | 05:41 AM

ఖలిస్థానీ వేర్పాటువాది నిజ్జర్‌ హత్యలో భారత ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోభాల్‌ పాత్ర ఉందని తమ దేశ దినపత్రిక ‘ది గ్లోబ్‌

అబ్బే.. మోదీ పాత్ర ఉందనలేదు

నిజ్జర్‌ హత్యపై కెనడా భద్రతా సలహాదారు

ఒటావా, నవంబరు 22: ఖలిస్థానీ వేర్పాటువాది నిజ్జర్‌ హత్యలో భారత ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోభాల్‌ పాత్ర ఉందని తమ దేశ దినపత్రిక ‘ది గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌’ ప్రచురించిన కథనాన్ని కెనడా ప్రభుత్వం ఖండించింది. తమ దేశంలో తీవ్ర నేర కార్యకలాపాలతో మోదీకి, మిగతా ఇద్దరికీ లింకుందని తామెక్కడా చెప్పలేదని ప్రధాని జస్టిస్‌ ట్రూడో భద్రత-నిఘా సలహాదారు నథాలీ డ్రూయిన్‌ ప్రకటించారు. అయితే, నిజ్జర్‌ హత్యకోసం పన్నిన కుట్రకు భారత హోం మంత్రి అమిత్‌షా సారథ్యం వహించారని తాము నమ్ముతున్నట్లు కెనడా జాతీయ భద్రతా అధికారి ఒకరు తమకు సమాచారం ఇచ్చారని సదరు పత్రిక తెలిపింది. ఈ విషయం జైశంకర్‌, దోభాల్‌తో పాటు మోదీకి కూడా తెలుసని ఆయన చెప్పినట్లు వెల్లడించింది. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ట్రూడో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. తమ దేశంలో తీవ్ర నేర కార్యకలాపాలతో మోదీ, జైశంకర్‌, దోభాల్‌కు సంబంధాలున్నట్లు తామెక్కడా చెప్పలేదని.. ఇందుకు ఆధారాలున్నాయన్న సంగతి కూడా తమకు తెలియదని నథాలీ గురువారం వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా, భారత్‌ నుంచి కెనడాకు విద్యార్థి వీసాతో వచ్చేవారిలో అత్యధిక శాతం నకిలీ ధ్రువపత్రాలు ఇచ్చారని ‘ది గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌’ తెలిపింది. 10 వేల మంది భారతీయ విద్యార్థులు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారని ‘ఇమిగ్రేషన్‌, రెఫ్యూజీస్‌ సిటిషన్‌ కెనడా(ఐఈర్‌సీసీ)’ గుర్తించినట్లు ఓ కథనం ప్రచురించింది. వీరిలో 80ు మంది గుజరాత్‌, పంజాబ్‌ విద్యార్థులేనని పేర్కొంది.

Updated Date - Nov 23 , 2024 | 05:41 AM