Share News

Poonam Pandey: సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటి? దీనికి చికిత్స, నిర్దారణ మార్గాలేంటంటే..

ABN , Publish Date - Feb 02 , 2024 | 03:01 PM

సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటి.. రోగ లక్షణాలు ఎలా ఉంటాయి.

 Poonam Pandey: సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటి? దీనికి చికిత్స, నిర్దారణ మార్గాలేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: వివాదాస్పద నటిగా పేరు ఉన్న బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరోసారి అలాంటి పనే చేసింది. ఈ సారి ఏకంగా తన చావునే వివాదంగా మార్చేసింది. 32 ఏళ్ల పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతూ మరణించినట్టు ఆమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి శుక్రవారం ఓ వీడియో విడుదలైంది. స్వయంగా ఆమె మెనేజరే ఈ విషయాన్ని తెలియచేశాడు. దీంతో పూనమ్‌పాండే మరణించిందని అంతా భావించారు. కానీ ఇంతలోనే శనివారం తాను బతికే ఉన్నానంటూ స్వయంగా పూనమ్ పాండేనే ప్రకటించింది. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను విడుదల చేసింది. సర్వైకల్ క్యాన్సర్‌తో చాలా మంది మహిళలు చనిపోతున్నారని, అందరికీ అవకాగాహన కల్పించడం కోసమే ఇలా చేశానని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స, నిర్దారణ మార్గాలేంటో ఒకసారి పరిశీలిద్దాం.

అసలేమిటీ సర్వైకల్ క్యాన్సర్

భారతీయ మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్‌ది రెండో స్థానం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సంభవించే క్యాన్సర్ వ్యాధుల్లో దీనిది 8వ స్థానం. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 6,61,044 కేసులు బయటపడ్డాయి. 3,48,186 మంది ఈ వ్యాధికి బలయ్యారు.

మహిళల్లో గర్భాశయం దిగువ భాగాన్ని సర్విక్స్ అని అంటారు. ఈ భాగంలో తలెత్తే క్యాన్సర్‌కు సర్వైకల్ క్యాన్సర్ అని పేరు. క్యాన్సర్‌కు ముందు సర్విక్స్‌లోని కణాలు కొన్ని మార్పులు చెందిన క్యాన్సర్ కణాలుగా మారతాయి. చివరకు అవి సర్విక్స్‌ లోతుల్లోకి విస్తరించి వ్యాధి కలగజేస్తాయి.

లైంగికంగా సంక్రమించే హ్యూమన్ పాపిలోమావైరస్ (హెచ్‌పీవీ-HPV) కారణంగా ఈ క్యాన్సర్ తలెత్తుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం లైంగికంగా యాక్టివ్‌గా ఉండే వారు ఏదోక సమయంలో హెచ్‌పీవీ వైరస్‌ల బారిన పడతారు. మొత్తం 200 రకాల హెచ్‌పీవీ వైరస్‌లు ఉన్నాయి. సాధారణంగా ఈ వైరస్‌లను రోగనిరోధక శక్తి సులభంగానే నిరోధిస్తుంది. కానీ ప్రమాదకరమైన హెచ్‌పీవీ 16 లేదా హెచ్‌పీవీ 18 వైరస్‌ల బారినపడ్డ సందర్భాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇతర హెచ్‌పీవీ వైరస్‌‌లు మాత్రం క్యాన్సర్‌ను కలుగజేయవు.


రోగ లక్షణాలు..

చాలా సందర్భాల్లో సర్వైకల్ క్యాన్సర్ బారిన పడ్డ తొలినాళ్లల్లో ఎటువంటి రోగ లక్షణాలు కనిపించవని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి ముదిరేకొద్దీ రక్తస్రావం మొదలవుతుంది. శృంగారంలో పాల్గొన్నప్పుడు నొప్పి కూడా ఉంటుంది.

వ్యాధి నిర్ధారణ ఇలా..

పాప్ టెస్ట్ ద్వారా సర్విక్స్‌లో క్యాన్సర్ కణాలను సులువుగా గుర్తించవచ్చు. క్యాన్సర్‌గా మారే అవకాశం ఉన్న అసాధారణ కణాల ఉనికిని కూడా ఈ టెస్టు ద్వారా తెలుసుకోవచ్చు. 21 ఏళ్ల వయసు దాటినవారు ఈ టెస్టు చేయించుకోవడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. ప్రతి మూడు లేదా ఐదు సంవత్సరాలకు ఓసారి ఈ టెస్టు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచిస్తున్నారు.

చికిత్స ఇదే..

అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ సీడీసీ ప్రకారం, సర్వైకల్ క్యాన్సర్‌కు సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్‌ను తొలి నాళ్లలో గుర్తిస్తే సులువుగా నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు టీకా తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. భారత్‌లో తయారైన తొలి దేశీ వ్యాక్సిన్ గతేడాది జనవరిలో అందుబాటులోకి వచ్చింది. మొత్తం నాలుగు రకాల వైరస్‌లను ఇది టార్గెట్ చేస్తుంది.

తాజా బడ్జెట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా సర్వైకల్ క్యాన్సర్‌‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేలా తొమ్మిది నుంచి 14 ఏళ్ల మధ్య బాలికలు టీకా తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోందని తెలిపారు.

Updated Date - Feb 03 , 2024 | 01:12 PM