Share News

Papaya: బొప్పాయి పండు వరుసగా 30 రోజులు తింటే జరిగేదిదే!

ABN , Publish Date - Jan 30 , 2024 | 05:25 PM

బొప్పాయి రోజూ తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. మలబద్ధకం కూడా వదిలిపోతుందని అంటున్నారు.

Papaya: బొప్పాయి పండు వరుసగా 30 రోజులు తింటే జరిగేదిదే!

ఇంటర్నెట్ డెస్క్: గొప్ప రుచిగా ఉండటంతో పాటూ ఆరోగ్యం మెరుగుపరిచే బొప్పాయి పండును ఇష్టపడని వారంటూ ఉండరు. రకరకాల పోషకాలతో పాటూ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బొప్పాయితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడం, వ్యాధులను నిరోధించడంతో పాటూ యవ్వనంగా కనిపించేందుకు బొప్పాయి ఉపకరిస్తుంది. అన్ని వయసుల వారూ తినదగిన పండు ఇది.

పచ్చి బొప్పాయిని కూడా తినొచ్చు. అయితే, దీన్ని వండుకున్నాకే తినాలని పోషకాహారనిపుణులు చెబుతున్నారు. గర్భవతుల ఈ నియమాన్ని తూచా తప్పకుండా పాటించాలి. బొప్పాయిలో లేటెక్స్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. ఇది గర్భవతుల్లో ఇబ్బందులు కలగజేయచ్చు.

బొప్పాయిలో ఉండే పాపెయిన్ అనే ఎంజైమ్ మాంసంలోని కఠినమైన ప్రొటీన్లను చిన్నవాటిగా విడగొడుతుంది. ఫలితంగా దీన్ని సహజమైన మీట్ టెండరైజర్‌గా కూడా వాడతారు.


30 రోజుల పాటు వరుసగా బొప్పాయి తింటే..

బొప్పాయి పండును రోజూ ఉదయం పూట తింటే అనేక ప్రయోజనాలు చేకూరతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. నెల రోజుల పాటు బొప్పాయిని తింటే మలబద్ధకం వదిలిపోతుంది. కడుపుబ్బరం లాంటి సమస్యలు కూడా సమసిపోతాయి. బొప్పాయి పండు ఆహారంలోని ప్రొటీన్లను జీర్ణం చేయడంలో సహకరిస్తుంది. కాబట్టి, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ ఉన్న వారికి ఈ పండు అమృతంతో సమానం.

ఇన్‌ఫ్లమేషన్‌లో తగ్గుదల

దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్ అనేక రోగాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ సమస్యతో బాధపడుతున్న వారు రోజూ బొప్పాయి తింటే పరిస్థితి గణనీయంగా మెరుగవుతుంది. కెరోటినాయిడ్స్ అధికంగా ఉండే బొప్పాయి లాంటి వాటిని పురుషులు ఎక్కువగా తింటే శరీరంలో ప్రధాన ఇన్‌ఫ్లమేషన్ సూచిక సీఆర్‌పీ ప్రొటీన్ స్థాయిలు తగ్గినట్టు పరిశోధనల్లో రుజువైంది.

గుండె ఆరోగ్యం మెరుగు

లైకోపీన్, విటమిన్ సీ అధికంగా ఉన్న బొప్పాయి పండుతో గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు గుండెను అనారోగ్యాల నుంచి కాపాడతాయి. హితకరమైన హెడీఎల్ కొలెస్టెరాల్ ప్రభవాన్ని కూడా ఇనుమడింపచేస్తాయి.

బొప్పాయిలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

సాధారణ జీవక్రియల్లో భాగంగా ఉత్పత్తి అయ్యే ఫ్రీరాడికల్స్ శరీరానికి హానికరం. ఇది ఒంట్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను పెంచుతాయి. అయితే, బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్‌ను నిర్వీర్యం చేసి దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ఇస్తాయి.

Updated Date - Jan 30 , 2024 | 05:30 PM