Share News

సిటింగ్‌లు సగమే!

ABN , Publish Date - Apr 30 , 2024 | 05:18 AM

రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధిగా ఒక్కసారి ఎన్నికయ్యారంటే.. ఆ పదవిని వదులుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఎన్నికల్లో మళ్లీ తానే పోటీ చేయాలని, మరోసారి గెలిచి ఆ పదవిని చేపట్టాలని ఆరాటపడుతుంటారు. తాను ఎన్నికైన పార్టీ తరఫున తిరిగి పోటీ చేసేందుకు అవకాశం

సిటింగ్‌లు  సగమే!

ఈసారి ఎన్నికలకు 8 మంది ఎంపీలు దూరం

ఎమ్మెల్యేలుగా గెలుపొంది కొందరు..

సొంత పార్టీలో టికెట్‌ దక్కక మరికొందరు..

పార్టీ మారినా భంగపాటుకు గురైన ఇంకొందరు

ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌ :

రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధిగా ఒక్కసారి ఎన్నికయ్యారంటే.. ఆ పదవిని వదులుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఎన్నికల్లో మళ్లీ తానే పోటీ చేయాలని, మరోసారి గెలిచి ఆ పదవిని చేపట్టాలని ఆరాటపడుతుంటారు. తాను ఎన్నికైన పార్టీ తరఫున తిరిగి పోటీ చేసేందుకు అవకాశం లభించకపోతే.. పార్టీ మారి అయినా పోటీ చేసేందుకు సిద్ధపడతారు. ఇలాంటి సిటింగ్‌లు కొందరికి ఇతర పార్టీలు పిలిచి మరీ పోటీ చేసే అవకాశం ఇస్తాయి. మరికొందరికి మాత్రం అలాంటి అవకాశమేదీ లభించక పోటీకి దూరం కావాల్సి వస్తుంది. ఇంకొందరు మాత్రం మరో పదవికి పోటీ చేయడం కోసం సిటింగ్‌ స్థానాన్ని వదులుకుంటారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇలా.. దాదాపు సగం మంది సిటింగ్‌ ఎంపీలు పోటీకి దూరంగా ఉన్నారు. వీరిలో కొందరు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలవగా, మరికొందరు సొంత పార్టీ నాయకత్వం టికెట్‌ ఇవ్వనివారు ఉన్నారు. ఇంకొందరు తమకు మళ్లీ టికెట్‌ రాదన్న విషయాన్ని గుర్తించి పార్టీ మారినా.. కొత్త పార్టీలోనూ అవకాశం దక్కక భంగపాటుకు గురైనవారూ ఉన్నారు.

ఎనుముల రేవంత్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. సీఎం పదవి చేపట్టేదాకా మల్కాజిగిరి ఎంపీగా ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో ఓటమిపాలయ్యాక.. ఆ వెంటనే 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కొడంగల్‌లో ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ప్రస్తుతం మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పట్నం సునీతా మహేందర్‌రెడ్డిని బరిలోకి దించి.. ఆమె గెలుపు బాధ్యతను తన భుజాన వేసుకొని పనిచేస్తున్నారు.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా మంత్రి పదవి చేపట్టేదాకా ఎంపీగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్‌ హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోవడంతో పార్లమెంటుకు వెళ్లారు. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి హుజూర్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. రాష్ట్ర మంత్రి అయ్యారు. తాను ప్రాతినిధ్యం వహించిన నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డిని గెలిపించేందుకు కృషి చేస్తున్నారు.


కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా మంత్రి పదవి చేపట్టేదాకా భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. నల్లగొండ శాసనసభ స్థానం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వెంకట్‌రెడ్డి అనూహ్య ఓటమి చవిచూశారు. అనంతరం 2019 పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. తిరిగి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. దీంతో ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి నుంచి బరిలోకి దిగిన చామల కిరణ్‌కుమార్‌రెడ్డి గెలుపు కోసం పనిచేస్తున్నారు.

పోతుగంటి రాములు

2019లో బీఆర్‌ఎస్‌ తరఫున నాగర్‌కర్నూల్‌ నుంచి ఎంపీగా గెలిచిన సీనియర్‌ రాజకీయ నేత పి.రాములు కూడా ఈసారి పోటీకి దూరమయ్యారు. స్థానిక బీఆర్‌ఎస్‌ నేతలతో పొసగకపోవడంతో పార్టీ వీడాలని ముందే నిర్ణయించుకున్న రాములు.. తాజా ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. తన కుమారుడు భరత్‌ ప్రసాద్‌కు ఎంపీ టికెట్‌ ఇప్పించి.. పోటీకి దూరంగా ఉన్నారు.

కొత్త ప్రభాకర్‌రెడ్డి

మెదక్‌ నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున ప్రభాకర్‌రెడ్డి వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచారు. సిటింగ్‌ ఎంపీగా ఉంటూనే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఈ ఎన్నికల్లో మెదక్‌ నుంచి మాజీ ఐఏఎస్‌ వెంకట్రామారెడ్డిని బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించింది.

సోయం బాపురావు

గతంలో టీడీపీ, కాంగ్రెస్‌లో పనిచేసిన సోయం బాపురావు 2019 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరి.. ఆదిలాబాద్‌ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే సిటింగ్‌ ఎంపీగా ఉన్న బాపురావుకు ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో తిరిగి టికెట్‌ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది. ఆయన స్థానంలో గోడం నగేశ్‌కు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దించింది. దీంతో బాపురావు సిటింగ్‌ ఎంపీగా ఉండి కూడా పోటీకి దూరం కావాల్సివచ్చింది.


వెంకటేశ్‌ నేత

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలైన వెంకటేశ్‌ నేత.. అనంతరం బీఆర్‌ఎ్‌సలో చేరి 2019 పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. అయితే 2024 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం తనకు టికెట్‌ ఇచ్చే యోచనలో లేదనే విషయాన్ని ముందుగానే గ్రహించి ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరిగి కాంగ్రె్‌సలో చేరారు. అయితే పెద్దపల్లి నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఆయనకు అవకాశం ఇవ్వకుండా గడ్డం వంశీకృష్ణను బరిలోకి దించింది. దీంతో వెంకటేశ్‌ నేత సిటింగ్‌ ఎంపీ నుంచే మాజీ అయిపోయారు.

పసునూరి దయాకర్‌

పసునూరి దయాకర్‌దీ దాదాపుగా వెంకటేశ్‌ పరిస్థితే. వరంగల్‌ స్థానం నుంచి వరుసగా రెండుసార్లు బీఆర్‌ఎస్‌ తరఫున దయాకర్‌ ఎంపీగా గెలిచారు. ఈసారి టికెట్‌ దక్కే అవకాశం లేదన్న సమాచారంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కాంగ్రెస్‌లో చేరారు. కానీ, కాంగ్రెస్‌ మాత్రం సీనియర్‌ నేత కడియం శ్రీహరిని పార్టీలోకి రప్పించి ఆయన కుమార్తె కడియం కావ్యను అభ్యర్థిగా ఎంపిక చేసింది. దీంతో సిటింగ్‌ ఎంపీ దయాకర్‌కు పార్టీ మారినా నిరాశ తప్పలేదు.

Updated Date - Apr 30 , 2024 | 05:18 AM