Share News

జేఈఈ మెయిన్స్‌లో మనోళ్ల సత్తా

ABN , Publish Date - Feb 14 , 2024 | 08:08 AM

జేఈఈ మెయిన్స్‌-2024లో తెలంగాణ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. మంగళవారం ప్రకటించిన మొదటి విడత జేఈఈ పరీక్ష ఫలితాల్లో జాతీయస్థాయిలో.....

జేఈఈ మెయిన్స్‌లో మనోళ్ల సత్తా

100% స్కోరు సాధించిన 23 మందిలో ఏడుగురు తెలంగాణ విద్యార్థులే

రిషి శేఖర్‌ శుక్లాకు రెండో ర్యాంకు

టాప్‌ స్కోరర్లలో ఏపీ నుంచి ముగ్గురు

బీసీ గురుకుల విద్యార్థుల హవా.. 248 మందిలో 98 మంది ఉత్తీర్ణత

ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్సే లక్ష్యం: జేఈఈ విజేతలు

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి: జేఈఈ మెయిన్స్‌-2024లో తెలంగాణ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. మంగళవారం ప్రకటించిన మొదటి విడత జేఈఈ పరీక్ష ఫలితాల్లో జాతీయస్థాయిలో రెండో ర్యాంకుతోపాటు 100 శాతం స్కోరులో అత్యధిక ర్యాంకులు మన రాష్ట్రానికే దక్కాయి. గత నెలాఖరులో దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో పాటు ఇతర దేశాలకు చెందిన 21 నగరాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 11.70 లక్షల మంది హాజరయ్యారు. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు తదితర 13 భాషల్లో పరీక్ష నిర్వహించారు. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో 23 మంది 100 శాతం స్కోరు (100 పర్సంటైల్‌) సాధించారు. వీరిలో తెలంగాణ నుంచి అత్యధికంగా ఏడుగురు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రల నుంచి ముగ్గురు చొప్పున ఉన్నారు. హరియాణ, ఢిల్లీ నుంచి ఇద్దరు చొప్పున, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు నుంచి ఒక్కొక్కరు టాప్‌ స్కోరర్లలో ఉన్నారు. టాప్‌ 23 మందిలో అందరూ అబ్బాయిలే. హైదరాబాద్‌కు చెందిన రిషి శేఖర్‌ శుక్లా జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. కాగా, ఈసారి 100 పర్సంటైల్‌ సాధించిన వారిలో అమ్మాయిలు, జనరల్‌(ఈడబ్ల్యూఎస్‌), ఎస్సీ, ఎస్టీల నుంచి ఎవరూ లేరు. రెండోవిడత జేఈఈ మెయిన్స్‌ పరీక్ష ఏప్రిల్‌లో జరగనుండగా.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను మే 26న నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రవేశాలు జరుపుతారు. జేఈఈ మెయిన్స్‌లో బీసీ గురుకుల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. బీసీ ఇంటర్మీడియట్‌ గురుకులం నుంచి 248 మంది హాజరుకాగా.. 98 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 50 మంది బాలికలు, 48 మంది బాలురు. ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులను మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం, బీసీ గురుకుల కార్యదర్శి మల్లయ్యబట్టు అభినందించారు. 100 పర్సంటైల్‌ సాధించిన హైదరాబాద్‌ విద్యార్థుల్లో కొంత మంది ఆంధ్రజ్యోతితో మాట్లాడారు.

రెండో ర్యాంకు ఊహించలేదు: రిషి శేఖర్‌ శుక్లా

చాలా సంతోషంగా ఉంది. 100 పర్సంటైల్‌ వస్తుందని, జాతీయస్థాయిలో రెండో స్థానంలో నిలుస్తానని ఊహించలేదు. ఆకాశ్‌ కాలేజీ ఫ్యాకల్టీ మంచి తర్ఫీదు ఇచ్చారు. అమ్మానాన్నలు, అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైంది. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చేయాలన్నదే లక్ష్యం. నాన్న రిషి శేఖర్‌ ఇస్రోలో శాస్త్రవేత్త. అమ్మ వందన శేఖర్‌ కూడా సైంటిస్టే.

మా అక్కనే నాకు స్ఫూర్తి: ముతవరపు అనూప్‌

ఇంజనీరింగ్‌ చదవాలనే కోరికకు ఐఐటీ చెన్నైలో బీటెక్‌ చేస్తున్న మా అక్క హరితనే స్ఫూర్తి. చిన్నప్పటి నుంచి ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ నాకు చాలా ఇష్టం. నాన్న రాజ్‌కుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, అమ్మ గృహిణి. అమ్మానాన్నలతో తోడ్పాటుతో పాటు లెక్చరర్ల గైడెన్స్‌తోనే 100 పర్సంటైల్‌ సాధ్యమైంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవడ మే నా లక్ష్యం.

Updated Date - Feb 14 , 2024 | 08:08 AM