Share News

కారణజన్ములు

ABN , Publish Date - May 25 , 2024 | 04:47 AM

ఎందుకు ఈ భూమి మీద పుట్టామా అని ఎప్పుడో ఒకప్పుడు బాధగా ప్రశ్నించుకోనివారు ఎవరూ ఉండరు. అసలు ఈ జన్మకు అర్థమేమిటి అంటూ కుతూహలంతో కూడిన తత్వచింతన ఆవరించని మనిషీ ఉండరు.

కారణజన్ములు

ఎందుకు ఈ భూమి మీద పుట్టామా అని ఎప్పుడో ఒకప్పుడు బాధగా ప్రశ్నించుకోనివారు ఎవరూ ఉండరు. అసలు ఈ జన్మకు అర్థమేమిటి అంటూ కుతూహలంతో కూడిన తత్వచింతన ఆవరించని మనిషీ ఉండరు. పుట్టుకకు ఏదో లక్ష్యమో, ప్రయోజనమో, కారణమో ఉండాలనుకోవడం కూడా మానవులు సంతరించుకున్న మేధా పరిపక్వతకు ఒక గుర్తు. కొన్ని విలువలను, ప్రమాణాలను పెట్టుకుని, అందుకు అనుగుణంగా జీవించాలని తపించడంలో అనుకంప, సహానుభూతి, కరుణలతో హృదయాన్ని నింపుకోవడం ఉంది.

అనేక పరీక్షాసందర్భాలలో నిర్ణయాలు తీసుకోవడానికి, నిబ్బరంగా ఉండడానికి సహాయం కావాలి. భారత యుద్ధారంభంలో అర్జునుడికి అటువంటి సాయమే కావలసివచ్చింది. కృష్ణుడు ఒక మాయావరణాన్ని కల్పించి, అందులో అర్జునుడికి తన దైవత్వాన్ని చూపాడు. విశ్వం పుట్టుక దగ్గర నుంచి సమాజనిర్మాణం దాకా వివరించి, సంశయాన్ని విడిచిపెట్టడానికి కావలసిన ఒకానొక నిశ్చయాన్ని అందించాడు. ‘‘పుట్టుక ద్వారానే సమస్త ప్రాణికోటి ఈ భౌతిక ప్రపంచంలో ఏర్పడుతున్నారు. వాటికి బీజ ప్రదాత అయిన పితను నేనే’’ అని కృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు. విశ్వకారణాలను వివరించే ఆస్తిక వాదనల ప్రకారం భగవంతుడే ప్రతి ఒక్కరినీ పుట్టిస్తున్నాడు. ప్రత్యేక కారణాలతో ప్రత్యేక వ్యక్తులను పుట్టించడు. అంతగా అవసరమైతే, ధర్మానికి చాలా ప్రమాదం ముంచుకువస్తే, తానే రంగంలోకి దిగుతాడు, స్వయంగానో, అవతారంగానో.


అవతారమెత్తిన దేవుడు ఎప్పుడూ తనను తాను సులభంగా బహిరంగపరచుకోడు. మానవరూపంలోనే నిగూఢంగా సంచరిస్తాడు. రామాయణ భారతాల్లో అవతారపురుషుల గురించి ప్రశంస, ప్రస్తావన పక్కన ఉన్నవాళ్లే చేస్తారు కానీ, స్వయంగా రాముడో కృష్ణుడో చేయరు. మరీ అవసరమైతే, మరో మార్గం లేకపోతే, కురుక్షేత్రంలో లాగా, ఒక ‘ మాయ’ను ఆశ్రయించి, తన నిజస్వరూపం చూపిస్తారు. నోరుతెరిచి పదునాలుగు లోకాలు చూపినప్పుడు కూడా, యశోదకు అది కలో, మాయో అనిపించింది, తాను యశోదనేనా అని అనుమానం వేసింది కానీ, ఆ బాలుడు దేవుడని స్ఫురించలేదు. దేవుళ్ల, దైవాంశసంభూతుల గొప్పతనాన్ని వారి చర్యల ద్వారా మనుషులు గ్రహిస్తారు. క్రీస్తు కూడా తనను తాను దేవుడి కుమారుడిగా చెప్పుకున్నాడు. అందరూ దేవుని బిడ్డలే కదా, కాదనేదెవరు? క్రీస్తు బోధనల ప్రభావంతో ఆయన చుట్టూ ఒక అద్భుతత్వం కూడా ఆవరించింది. తన భావప్రసారంలో భాగంగా, తాను ప్రజలకు ఆశ్వాసన అందించడం కోసం ‘‘దేవుడి యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి’’ అని గట్టిగా చెప్పవలసివచ్చింది. అంతే తప్ప, అబ్రహమిక్ మతాలలో ‘ప్రకటన’ (రివిలీషన్) అంత తరచుగా జరిగే ప్రక్రియ కాదు..

పోనీ, దేవుడు అప్పుడప్పుడు మనిషి రూపంలో అవతరిస్తాడని చెప్పి, తాము దేవుళ్లమని చెప్పుకునే మనుషులందరినీ ఆరాధించగలమా? దైవత్వానికి కారణమయిన లక్షణాలో, గుణాలో లేకుండా కేవల ప్రకటన ద్వారా ఆ ప్రతిపత్తి ఇవ్వగలమా? దేవుడి దూతనని, దేవుడు పంపితే భూమిమీద అవతరించిన కారణజన్ముడనని ఎవరైనా మానవమాత్రుడు అంటే, అంగీకరించగలమా? అధికారం వల్ల కానీ, సంపద వల్ల కానీ, మరో గొప్ప సంచయం వల్ల కానీ మనుషులు తక్కినవారి కంటె సమాజంలో అధికులు అయి ఉండవచ్చు. ప్రజానీకం చావూబతుకూ వారికి హక్కుభుక్తం అయివుండవచ్చు. రాజు అంటేనే విష్ణువుతో సమానం అని తన ఆస్థాన స్మృతికారులచేత శాసనాలు రాయించి ఉండవచ్చు. ఏమి చేసినా సరే, అటువంటివారిని మనిషి స్థానం నుంచి ఎగువన పెట్టగలమా? చరిత్రలో వర్తమానంలో కొందరు స్వయంప్రకటిత విష్ణువులు, దైవనియుక్తులు మనిషి స్థానానికి దిగువనే సంచరించడం చూస్తున్నప్పుడు, దేవుడిపేరుతో తమకు తామే కాంతిచక్రం తొడుక్కోవాలనుకునేవారి ఆంతర్యం గ్రహించలేమా?


ఏలికలను, నాయకులను ఆకాశానికి ఎత్తే అధికప్రసంగులుంటారు. సాక్షాత్తూ, దేవుడే తమ నాయకుడి భక్తుడని అవాకులుచెవాకులు మాట్లాడతారు. ఇక నాయకుడు ఆ వాగాడంబరానికి ముగ్ధుడై పోతాడు. ఈ కోవలోని వారు, తమను తాము ప్రేమించుకునే జాడ్యంలో, తమ చుట్టూ తాము పరిభ్రమిస్తూ, తాము అసామాన్యులమన్న భ్రమలోకి జారిపోతారు. కీర్తనలలో భజనలలో తమ ప్రతిబింబాన్ని భూతద్దంలో చూసుకుని, తాము అవతారపురుషులమని ‘జ్ఞానోదయం’ పొందుతారు. ఈ చిత్తభ్రాంతి ఎంత బలంగా ఉంటుందంటే, దేవుడే తమను సకారణంగా భూమికి పంపాడని నిస్సంకోచంగా, పైగా గర్వంగా, ప్రపంచం ముందు చెప్పుకుంటారు.

అకారణ జన్ములు ఎవరూ ఉండరు. మనుషులు తల్లి కడుపునే పుడతారు. సమాజపు ఒడిలోనే పెరుగుతారు. సార్థకతను వెదుకుతూ జీవిస్తారు. ఆచరణను బట్టి, సంతృప్తితో చాలిస్తారు. ఎవరు తమను తాము వెలిగించుకుని, పరిసరాలను వెలిగిస్తారో వారిని కాంతివలయం స్వచ్ఛందంగా వరిస్తుంది. వర్తమానమే కాదు, భవిష్యత్తు కూడా స్మరిస్తుంది. దేవతలకు మరణం లేదంటారు. లోకంలో కీర్తిని మిగుల్చుకున్నవారు ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉంటారు. మనుషులే మహనీయులై దేవలోకంలోకి చేరతారు తప్ప, పైనుంచి దిగివచ్చామని చెప్పి పెత్తనం చేసేవారికి ఏ లోకమూ దక్కదు!

Updated Date - May 25 , 2024 | 04:47 AM