దిశ మార్చిన యూపీ
ABN , Publish Date - Jun 07 , 2024 | 03:34 AM
దేశాన్ని ఏలాలనుకొనే పార్టీ లక్నోమీదుగా ఢిల్లీ చేరాలని రాజకీయాల్లో అంటూంటారు. 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌ను గెలవనిపక్షంలో కేంద్రంలో...

దేశాన్ని ఏలాలనుకొనే పార్టీ లక్నోమీదుగా ఢిల్లీ చేరాలని రాజకీయాల్లో అంటూంటారు. 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌ను గెలవనిపక్షంలో కేంద్రంలో అధికారం దక్కదని దీని అర్థం. ఈ ఎన్నికల్లో భారతీయజనతాపార్టీ యూపీలో చతికిలబడిన కారణంగానే లోక్‌సభలో ఇప్పుడు తనకాళ్ళమీద తాను నిలబడలేనిస్థితికి వచ్చింది. సొంతబలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల అవకాశాన్ని బీజేపీకి దక్కకుండా చేయడంలో యూపీ కీలకపాత్ర పోషించింది. ఎన్డీయే కూటమిని తీన్‌సౌ పార్ వరకూ కూడా పాకనివ్వకుండా మోకాలడ్డింది. ఈ రాష్ట్రం నుంచి ఇండియా కూటమి 43స్థానాలు సాధిస్తే, 37సీట్లు సమాజ్‌వాదీపార్టీవి, ఆరు కాంగ్రెస్‌వి. ఎన్డీయేకు దక్కిన ముప్పై ఆరులో ముప్పైమూడు బీజేపీవి. హిందూత్వ కంచుకోటకు పడిన ఈ చిల్లు యోగి రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలో పడవేసింది, మోదీకి మూడోసారి రాజ్యాధికారం దక్కినా, బాబు, నితీశ్‌ల భరోసాలేనిదే అడుగుముందుకు వేయలేని స్థితిని కల్పించింది.
పదేళ్ళక్రితం డెబ్బయ్‌ఒక్కస్థానాలు, ఐదేళ్ళక్రితం 62స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు 33సీట్లకు పరిమితం కావడం బలమైన ఎదురుగాలికి నిదర్శనం. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సహా అనేకమంది బీజేపీ మహారథులు ఓడిపోయారు, వారణాసినుంచి నరేంద్రమోదీ విజయం సైతం పలుచబడింది. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం, మోదీ స్వయంగా ప్రాణప్రతిష్ఠ చేయడం, ఆ ప్రత్యక్షప్రసారాలూ సూర్యతిలకాలూ దేశప్రజల మనసులను తమవైపు మళ్ళిస్తాయని బీజేపీ గట్టిగా నమ్మింది. ప్రతీ ఇంటికీ అక్షింతలు చేరాయి, ప్రతీపల్లెనూ సామాజిక మాధ్యమాల ద్వారా ఆ చిత్రాలు తాకాయి. దేశవ్యాప్త ప్రభావం ఉన్నదా లేదా అన్నది అటుంచితే, అయోధ్య కొలువుదీరి ఉన్న ఫైజాబాద్‌లో బీజేపీ ఓడిపోవడం అనూహ్యం. ఎన్నికలముందువరకూ బీజేపీ నాయకులు ఎంతోవిశ్వాసంగా కనిపించినప్పటికీ, వివిధ దశల్లో పోలింగ్ నిస్తేజంగా సాగడం, తదనుగుణంగా ప్రధాని మాట మారడం తెలిసినవే. రెండేళ్ళనాటి అసెంబ్లీ ఎన్నికల్లోనే అఖిలేశ్ యాదవ్ పునరుత్థానం ఆరంభమైంది. చిన్నచితకా ఓబీసీపార్టీలనూ, దళిత ఆదివాసీలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేశాడు. గత ఏడాది ఒక ఉప ఎన్నిక సందర్భంలో ఆయన ప్రయోగించిన పీడీఏ (పిచ్డా–దళిత్–అల్పసంఖ్యాక్) అస్త్రం క్రమంగా బలపడి, అబ్‌కీబార్ పీడీఏ సర్కార్ నినాదం ఇప్పుడు విశేషంగా ప్రభావం చూపిందని ఫలితాలు చెబుతున్నాయి. నినాదంతో సరిపెట్టకుండా టిక్కెట్ల పంపకంలోనూ ఆయన ఆ నీతినీ, సూత్రాన్ని పాటించాడు.
అన్‌రిజర్వుడు స్థానాలైన మీరట్, ఫైజాబాద్‌లలో దళితులను నిలబెట్టడం సాహసమే కాదు, వ్యూహాత్మకంగానూ అధిక ప్రభావం చూపింది. రాష్ట్రవ్యాప్తంగా దళితులకు సానుకూల సంకేతాలు పంపడానికి, ఇప్పటికే బాగా బలహీనపడిన బహుజన్ సమాజ్‌పార్టీ నుంచి ఓటర్లను లాక్కోవడానికి ఈ చర్య ఉపకరించింది. పొత్తులు సర్దుబాట్లలో భీం ఆర్మీ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ కు చోటు దక్కకపోయినా నగీనానుంచి ఆయన ఘనవిజయం సాధించడం అక్కడి దళితరాజకీయాల్లోనూ, కుల సమీకరణాల్లోనూ వస్తున్న మార్పునకు నిదర్శనం. ఇక, ఫైజాబాద్‌లో ఎస్పీ అభ్యర్థి యాభైవేల ఓట్లతో ఘన విజయం సాధించడంతో పాటు, అయోధ్య డివిజన్‌లో అమేథీ సహా ఐదు పార్లమెంటు సీట్లలోనూ బీజేపీ ఓడిపోయింది. రామమందిరంతో పాటు, కొన్ని కులకూటములతో బీజేపీ విజయతీరాలకు చేరడానికి ప్రయత్నించినప్పటికీ, అఖిలేశ్ పీడీఏ ఎక్కువ ఫలితాలు సాధించింది. సరిగ్గా ఎన్నికల ముందు చౌదరీ చరణ్‌సింగ్‌కు భారతరత్న ఇచ్చి, జయంత్ చౌదరిని బీజేపీ తనవైపు లాక్కున్నప్పటికీ అఖిలేశ్ నిలబడగలిగారు.
‘దో లడ్కో కీ జోడీ’ అంటూ మోదీ పలుమార్లు అవహేళనగా మాట్లాడినా, అఖిలేశ్–రాహుల్ కలసికట్టుగా సాగుతూ దైనందిన సమస్యలు మాత్రమే లేవనెత్తుతూ యూపీ ఓటర్లను బాగానే ప్రభావితం చేయగలిగారు. ఉద్యోగం, ఉపాధి, అవినీతి, అభివృద్ధి వంటివి ప్రస్తావిస్తూ, బుల్‌డోజర్ రాజకీయాల స్థానంలో బువ్వపెట్టే కార్యక్రమాలు కావాలని చెప్పగలిగారు. ములాయం మరణం తరువాత జరిగిన ఈ తొలి ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి, 18వ లోక్‌సభలో మూడవ అతిపెద్ద పక్షంగా సమాజ్‌వాదీపార్టీని అఖిలేశ్ నిలబెట్టగలిగారు, మోదీ హవా దిశనూ మార్చగలిగారు.