Share News

వీసీల ఎంపికకు మూడు విలువలు

ABN , Publish Date - May 25 , 2024 | 05:03 AM

తెలంగాణలో పది సంప్రదాయ విశ్వవిద్యాలయాల వీసీల పదవీకాలం మే 21తో ముగిసింది. కొత్త వీసీల ఎంపిక కోసం ప్రభుత్వం సెర్చ్‌ కమిటీలను నియమించింది. వీసీల ఎంపికకు సంబంధించి గతంలో ఎన్నడూ లేనంతగా ఉన్నత విద్యాలోకంలో చర్చ నడుస్తోంది. మేధోవర్గంలో ఆసక్తి

వీసీల ఎంపికకు మూడు విలువలు

దరఖాస్తులు వడపోయటానికి ఏర్పాటు చేసిన సెర్చ్‌ కమిటీ విశ్వసనీయతను బట్టి వీసీల ఎంపికలో ఎంతటి పారదర్శకత ఉంటుందో తెలిసిపోతుంది. బోధన, పరిశోధన రంగాలలో విశిష్టమైన ప్రమాణాలు నెలకొల్పిన ఎందరో ప్రొఫెసర్లు తెలంగాణ సమాజంలో ఉండగా, ఒక ప్రత్యేకమైన భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని ఒకటికి మించి ఎక్కువ యూనివర్సిటీల సెర్చ్‌ కమిటీలో సభ్యులుగా నియమించడంలో ఔచిత్యమేమిటో అర్థం కాకుండా ఉంటుందా?

తెలంగాణలో పది సంప్రదాయ విశ్వవిద్యాలయాల వీసీల పదవీకాలం మే 21తో ముగిసింది. కొత్త వీసీల ఎంపిక కోసం ప్రభుత్వం సెర్చ్‌ కమిటీలను నియమించింది. వీసీల ఎంపికకు సంబంధించి గతంలో ఎన్నడూ లేనంతగా ఉన్నత విద్యాలోకంలో చర్చ నడుస్తోంది. మేధోవర్గంలో ఆసక్తి నెలకొన్నది. కొత్త ప్రభుత్వం, కొత్త ముఖ్యమంత్రి ఎలాంటి హేతుబద్ధతను పాటిస్తారనే అంశం చుట్టూ ఆలోచనలు కేంద్రీకృతమయ్యాయి. గతంలో వీసీ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నవాళ్లు, ఎంపిక చేసే ప్రభుత్వం మధ్య మాత్రమే గోప్యంగా నడుస్తుండిన ఈ వ్యవహారం సమాజంలో కొందరిలోనైనా ఇప్పుడు చర్చనీయాంశంగా మారటం మన సమాజపు చలనశీలతకు నమూనాగా చెప్పవచ్చు. ఇంతటి చర్చకు మూలమైన మూడు విషయాలను పరిశీలిస్తే... ఒకటి– గత ప్రభుత్వం ఎంపిక చేసిన వీసీలు వివాదాస్పదం కావటం, రెండు– సామాజిక మాధ్యమాల ఆధారంగా సత్య–అసత్య విషయాలు ప్రచారంలోకి రావటం, మూడు– వీసీల ఎంపికలో గత ప్రభుత్వం అకడమిక్‌ సామర్థ్యాన్ని అప్రధానం చేసి పైరవీలకు అవకాశం కల్పించటం.

విశ్వవిద్యాలయాలు స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు. యూజీసీ రూపొందించిన నియమ నిబంధనలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన చట్టం ద్వారా రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు ఏర్పడతాయి. పాఠ్యప్రణాళిక రూపకల్పన, అధ్యాపకుల నియామకాలు, పరిపాలన నిర్వహణ, పరీక్షల నియంత్రణ, అకడమిక్‌ క్యాలెండర్‌ మొదలైనవన్నీ విశ్వవిద్యాలయం స్వతంత్రంగా రూపొందించుకుంటాయి. కొన్ని నిధులను కూడా విశ్వవిద్యాలయమే వివిధ మార్గాల ద్వారా సమకూర్చుకుంటుంది. ప్రభుత్వం తప్పనిసరిగా తమ వార్షిక బడ్జెట్‌లో విశ్వవిద్యాలయాల నిర్వహణ కోసం నిధులను కేటాయిస్తుంది. కాల పరిమితి అనుసరించి వీసీలను కూడా ప్రభుత్వమే నియమిస్తుంది. ఉన్నత విద్య కమిషనర్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ద్వారా విశ్వవిద్యాలయాల అభివృద్ధికి ప్రభుత్వం తగు సూచనలు, సలహాలు ఇస్తుంది. కానీ విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తి అనే విలువలకు పరిమితులు ఏర్పడకుండా ప్రభుత్వం విచక్షణను పాటించటం ఒక సంప్రదాయంగా కొనసాగుతుండేది.


తొంభయ్యో దశకం తర్వాత ప్రవేశించిన గ్లోబలైజేషన్‌ మన దేశంలో ఉన్నతవిద్యా వ్యవస్థను విధ్వంసం చేసింది. మన పాలకులు ప్రపంచ బ్యాంకు నిర్దేశిత విద్యావిధానాన్ని రూపొందించి అమలుచేసారు. మన రాజ్యాంగం ప్రజలకు హామీపడిన విలువలను అతిక్రమించారు. అందరికీ విద్య, నాణ్యమైన బోధన, పరిశోధన అనే మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ క్రమంలోనే ఉన్నత విద్యను ఈ దేశ నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించి ఉత్తమ ఫలితాలను రాబట్టవలసిన యూజీసీ పాత్రకు అనేక పరిమితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మన తెలుగునేల మీద ఉదాత్తమైన విలువలతో ఏర్పడిన విశ్వవిద్యాలయాలు స్వయంప్రతిపత్తిని కోల్పోయాయి. నిధుల కోసం ప్రభుత్వం వైపు బేలగా చూసే దుస్థితి దాపురించింది. తమ స్వయంప్రతిపత్తిని ఉపయోగించి పనులు చేసుకోలేని దీనావస్థలో విశ్వవిద్యాలయాలు ఉండిపోయాయి. నిధులలేమి, అధ్యాపకుల కొరత, మౌలికవసతుల శూన్యత మొదలైన వ్యవస్థాపరమైన సమస్యల వలయంలో విశ్వవిద్యాలయాలు చిక్కుకున్నాయి.


ఇంకోవైపు స్వయంప్రతిపత్తి కలిగిన యూజీసీ గత పదేళ్లుగా ఉదా‍సీనంగా మార్చబడింది. కేవలం ఫెలోషిప్‌లను మంజూరు చేసే పనికి దీనిని పరిమితం చేశారు. రాజకీయ ప్రాధాన్యత, ప్రయోజనం దృష్టికోణంలో ఈ సంస్థ కురచగా మారిపోయింది. సర్వేపల్లి రాధాకృష్ణన్‌, పండిట్‌ నెహ్రూ ఆలోచనలలో భాగంగా 1953లో ఏర్పడిన యూజీసీ, 1956లో పార్లమెంటరీ చట్టం ద్వారా నిర్మాణాత్మకమైంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలను సమన్వయం చేస్తుంది. ఉన్నత విద్యా ప్రమాణాలను నెలకొల్పడానికి మార్గదర్శకాలను తయారుచేసి విశ్వవిద్యాలయాలకు సూచిస్తుంది. వాటి అమలుకు సంబంధించిన బాధ్యతను తీసుకుంటుంది. విశ్వవిద్యాలయాలకు గుర్తింపును ఇస్తుంది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలకు, కళాశాలలకు యూజీసీ నిధుల పంపిణీ చేస్తుంది. వీసీల, అధ్యాపకుల నియామకాలకు సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తుంది. పరిశోధకులకు ఫెలోషిప్‌ను మెరిట్‌ ఆధారంగా అందిస్తుంది.

ఈ కాలంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎజెండా మీదికి వచ్చింది. మేధోజీవులుండే విశ్వవిద్యాలయాలు సహజంగానే తెలంగాణ ఆర్తిని వ్యక్తంచేసాయి. పరిశోధన, రచన, ప్రసంగం ద్వారా తెలంగాణ పట్ల ఉండిన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక వివక్షను విశ్వవిద్యాలయాలు ప్రపంచం ముందు ఉంచాయి. కేవలం విశ్లేషణలకు మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణ సమాజం కదలబారడానికి, ఆచరణాత్మకంగా మారడానికి విశ్వవిద్యాలయాలు చేసిన కృషి చారిత్రాత్మకమే. ఒక్కోసారి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పార్లమెంటరీ నాయకత్వం ఉదాసీనంగా మారినప్పుడు సమాంతర ఉద్యమాలకు విశ్వవిద్యాలయాలు వేదికలయ్యాయి. ఈ సందర్భంలో ఉన్నత విద్యలో ఏర్పడిన దీనస్థితికి కోస్తాంధ్ర పాలకులే కారణమని చెప్పిన ఉద్యమ నాయకత్వం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భిన్నంగా వ్యక్తమైన సందర్భాలు లేనేలేవు. మునుపటి ప్రభుత్వం నియమించిన వీసీల కాలపరిమితి 2014లో పూర్తయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2016లో గానీ కొత్త వీసీలను నియమించలేకపోయింది. రెండో దఫా కూడా 2019లో వీసీల కాలపరిమితి ముగిసిన రెండేళ్లకు(2021) కొత్త వీసీలను నియమించారు. ఫలితంగా విశ్వవిద్యాలయాల పాలన, బోధన, పరిశోధన కుంటుబడింది. తెలంగాణ యువతలో మేధోవికాసాన్ని, నవకల్పనలను నింపాల్సిన విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు కేవలం పట్టాలు ప్రదానం చేసే కేంద్రాలుగా మారిపోయాయి. కనుక నైపుణ్యాల లేమి వలన బహుళజాతి సంస్థలలో మన విద్యార్థులు ఎంపిక కావటానికి అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయి.


ఈ పదేళ్లలో అనాసక్తితో, పట్టింపులేని తనంతో, యూజీసీ నియమ నిబంధనలను అతిక్రమించి, పైరవీలకు అవకాశమిచ్చి నియమించిన వీసీలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. కాలేజీ విద్యా కమిషనర్‌కు నిర్దేశిత లక్ష్యాలు ఉండటం వలన ఉన్నత విద్యలో తన ‘ఇష్టారాజ్యాన్ని’ నెలకొల్పుకున్నారు. విశ్వవిద్యాలయాలను నిర్వహించడానికి ఏర్పడిన పాలకమండళ్లను నామమాత్రం చేసి వీసీలను కూడా ప్రేక్షకులుగా మార్చి... ఫీజులను పెంచారు, భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించారు, ఎయిడెడ్‌ విద్యను మూతేసారు. కమిషనర్‌–వీసీ పరస్పర ఒప్పందాలలో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయం వీసీ గల్లాపెట్టెను తెరిచి నడిపించిన పాలనను తెలంగాణ సమాజమంతా గమనించింది. ‘చివరికి ప్రొఫెసర్లు కూడా లంచాలు తీసుకుంటారా?’ అనే అపఖ్యాతిని అధ్యాపకులందరూ మోయవలసి వచ్చింది. కొందరు వీసీల వైయక్తిక వైకల్యం వలన విశ్వవిద్యాలయాలలో కొందరు అధ్యాపకులలో, విద్యార్థులలో అరాచకవాదం ప్రబలింది. అన్యాయానికి నోరు ఎక్కువ కనుక విశ్వవిద్యాలయాల ప్రతిష్ఠ పౌరసమాజం ముందు ప్రశ్నార్థకంగా మారింది.

ఈ నేపథ్యంలో నేటి ప్రభుత్వం వీసీలను ఎంపిక చేయబోతున్నది. అయితే వీసీల కోసం వచ్చిన దరఖాస్తులు వడపోయటానికి ఏర్పాటు చేసిన సెర్చ్‌ కమిటీ విశ్వసనీయతను బట్టి వీసీల ఎంపికలో ఎంతటి పారదర్శకత ఉంటుందో తెలిసిపోతుంది. బోధన, పరిశోధన రంగాలలో విశిష్టమైన ప్రమాణాలు నెలకొల్పిన ఎందరో ప్రొఫెసర్లు తెలంగాణ సమాజంలో ఉండగా, ఒక ప్రత్యేకమైన భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని ఒకటికి మించి ఎక్కువ యూనివర్సిటీల సెర్చ్‌ కమిటీలో సభ్యులుగా నియమించడంలో ఔచిత్యమేమిటో అర్థం కాకుండా ఉంటుందా? పైగా సమాజాన్ని విశ్వాసాల ప్రాతిపదికన శకలాలుగా మార్చే ఆచరణలో ఉంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ద్వారా ప్రయోజనాలను పొందే వ్యక్తులను ప్రమోట్‌ చేయటం వలన ఎలాంటి సంకేతాన్ని ఈ ప్రభుత్వం మేధోరంగంలో వ్యాపింపచేయనున్నది? తరగతి గది బోధనలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పినవారు మాత్రమే విశ్వవిద్యాలయాలను విద్యాత్మకంగా రూపొందించగలరు. పరిశోధనలో నాణ్యతను ప్రోది చేసినవాళ్లే ఉత్తమ పరిశోధనలకు యూనివర్సిటీలను కేంద్రం చేయగలరు. విశ్వవిద్యాలయంలో పనిచేసే అధ్యాపకులు సమాజం పట్ల, విద్యార్థుల పట్ల ఆత్మీయతను కలిగి ఉండాలి. నిండు మనంబు నవ్యనవనీతమే కాదు, పలుకు కూడా వెన్నలాగా ఉన్నప్పుడే సుపరిపాలన సాధ్యమవుతుంది. వీసీల ఎంపికకు ఈ మూడు విలువలు కేంద్రబిందువు కావాలి.

ప్రొఫెసర్‌ చింతకింది కాశీం

Updated Date - May 25 , 2024 | 05:03 AM