Share News

సునాక్‌ సాహసం

ABN , Publish Date - May 24 , 2024 | 06:17 AM

వర్షం జోరుగా కురుస్తున్న వేళ, లండన్‌లోని తన అధికారనివాసం 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ మెట్లమీద నిలబడి, చినుకులు మీదపడుతూండగానే బుధవారం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ సార్వత్రక ఎన్నికల ప్రకటన...

సునాక్‌ సాహసం

వర్షం జోరుగా కురుస్తున్న వేళ, లండన్‌లోని తన అధికారనివాసం 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ మెట్లమీద నిలబడి, చినుకులు మీదపడుతూండగానే బుధవారం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ సార్వత్రక ఎన్నికల ప్రకటన చేశారు. జూలై 4న చాలాముందుగా ఎన్నికలు జరపాలన్న ఆ నిర్ణయం అత్యధికులకు ఆశ్చర్యం కలిగించింది. ముందస్తు ఎన్నికలకు పోవాలన్న నిర్ణయాన్ని రాజుగారికి చెప్పానని, పార్లమెంట్‌ రద్దుకు ఆయన అనుమతించారని సునాక్‌ తన ప్రసంగంలో తెలియచేశారు. నిబంధనల ప్రకారం, వచ్చే ఏడాది జనవరిలోగా సార్వత్రక ఎన్నికలు నిర్వహిస్తే చాలు. అందువల్ల, ఈ ఏడాది చివర్లో ఉండవచ్చునని అంతా అనుకున్నారు. భారతీయ మూలాలున్న తమ ప్రధాని బుర్రలో ముందస్తు ఆలోచన మెదులుతోందని అనుమానం వచ్చి, బుధవారమే పార్లమెంటులో కొందరు ఎన్నికలు ఎప్పుడు అని ఓ ప్రశ్న వేశారు కూడా. ఈ ఏడాది ద్వితీయార్థంలో అని సునాక్‌ సమాధానం చెప్పారు. ఏడాదిలో రెండో సగం అంటే కనీసం జూలై కావాలి కానీ, ఇలా ఆరువారాల్లోగానే ఆయన ఎన్నికలకు పోతారని ఎవరూ ఊహించలేదు. హడావుడిగా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి, అందుకోసం దేశవిదేశాల్లో ఉన్న మంత్రులందరినీ రప్పించి, చర్చించి ఈ ముందస్తు ముచ్చటను సునాక్ దేశ ప్రజలకు తెలియచేశారు.


సునాక్‌ ఈ ప్రకటన చేయగానే, ఆయన భార్య, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి కుమార్తె అక్షతామూర్తి సామాజిక మాధ్యమాల్లో దంపతులిద్దరి ఫోటోతో పాటు ‘నీవు వేసే ప్రతీ అడుగులోనూ నీ వెంటే ఉంటా’ అంటూ ఓ వ్యాఖ్యను పోస్టుచేశారు. దేశ ప్రజలు కూడా తన వెంటే ఉండాలన్న లక్ష్యంతో సునాక్‌ ఈ ముందస్తు నిర్ణయం తీసుకున్నమాట నిజం. పద్నాలుగేళ్ళుగా బ్రిటన్‌లో కన్సర్వేటివ్‌ పార్టీ అధికారంలో ఉంది. వరుస ప్రధానులు చేసిన తప్పిదాలతో ఆ పార్టీ ఇప్పటికే అప్రదిష్టపాలైంది. ఉద్ధరిస్తాడనుకున్న సునాక్‌ కూడా పార్టీకి నష్టం చేశాడని, ఆయన పాపులారిటీ తగ్గుతోందని కొందరు నమ్ముతున్నారు. వచ్చే సార్వత్రక ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని ఒపీనియన్‌ పోల్స్‌ అన్నీ ఢంకా బజాయిస్తున్న తరుణంలో, సునాక్‌ ఈ అడుగువేశారు. దేశాన్ని ఆర్థికంగా ఒడ్డునపడేస్తానన్న హామీ నెరవేరి, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉన్న ఈ సమయంలో ఎన్నికలకు పోయినప్పుడే విజయావకాశాలు మెరుగుపడతాయని ఆయన నమ్మినట్టు ఉంది. బ్రిటన్‌ తన భవిష్యత్తును ఎంచుకోవాల్సిన తరుణమిది అంటూ తనను ఎన్నుకోవాల్సిన గురుతరబాధ్యత బ్రిటిషర్లపై ఉందని ఈ ప్రసంగంలో సునాక్‌ గుర్తుచేశారు. ఇదీ నా గ్యారంటీ అంటూ ఉజ్వలమైన భవిష్యత్తుకు, చక్కని భద్రతకు హామీ పడ్డారు. ఆర్థికమంత్రిగా, ప్రధానమంత్రిగా తాను దేశానికి చేసిందేమిటో చెప్పుకొచ్చారు. ఫ్రాన్స్‌, జర్మనీ, అమెరికా కంటే బ్రిటన్‌ ఆర్థికం ఎంతో బాగుందని, కష్టపడి సాధించినదంతా సుస్థిరపడి, మరింత మెరుగ్గా కొనసాగడానికే తాను ముందస్తుకు పోతున్నానని ఆయన చెప్పుకొచ్చారు.


2022 అక్టోబర్‌లో నలభైరెండేళ్ల వయసులో సునాక్‌ బ్రిటన్‌ ప్రధాని అయ్యారు. 2010లో టోరీలు అధికారంలోకి వచ్చాక ఈయన ఐదో ప్రధాని. ఈ పద్నాలుగేళ్ళకాలంలో టోరీల ఏలుబడిలో, డేవిడ్‌ కెమెరూన్‌ తీసుకున్న కీలకమైన బ్రెగ్జిట్‌ నిర్ణయం సహా చాలా సమస్యలను, వివాదాలను దేశం ఎదుర్కొంది. యూరోపియన్‌ యూనియన్‌నుంచి వేరుపడే ఆ సుదీర్ఘ ప్రక్రియ తెరీసా మే వంటి నాయకులను రాజకీయంగా బలితీసుకుంది. బోరిస్‌ జాన్సన్‌ సంగతి చెప్పనే అక్కరలేదు. బ్రెగ్జిట్‌ను ఒక కొలిక్కి తీసుకువచ్చినప్పటికీ, కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించి లిక్కర్‌ పార్టీలు చేసుకొని ఆయన అప్రదిష్టపాలైనారు, తప్పుకోవడానికి ఒప్పుకోకుండా పార్టీ పరువు తీశారు. తనపై తిరుగుబాటుచేసిన సునాక్‌ను ప్రధానిగా ఎన్నుకోవద్దని టోరీలను జాన్సన్‌ ఒత్తిడిచేయడంతో లిజ్‌ట్రస్‌ రంగప్రవేశం చేసినప్పటికీ, ఇల్లు చక్కదిద్దడం చేతకాక ఆమె కొద్దిరోజుల్లోనే తప్పుకున్నారు. చివరకు అన్యధా శరణం నాస్తి అన్నట్టుగా బరిలో ఎవ్వరూ నిలవకుండా అధికారపక్ష ఎంపీలంతా సునాక్‌కే పగ్గాలు అప్పగించారు.

వర్షం వల్ల సునాక్‌ చెబుతున్నది చాలామందికి సరిగా వినబడలేదు. దీనికి తోడు ఆయన మాట్లాడుతున్నంత సేపూ, అధికారిక నివాసానికి కొంతదూరంలో నిరసనకారులు లౌడ్‌ స్పీకర్లలో 1977నాటి విపక్ష లేబర్‌ పార్టీ విజయగీతికను వినిపిస్తూనే ఉన్నారు. తాను చెబుతున్నది మీడియా ప్రతినిధులకు వినబడటానికి వీలుగా సునాక్‌ గట్టిగా మాట్లాడాల్సి వచ్చిందట. ఆయన చెబుతున్నదీ, ఏడాదిన్నరగా దేశానికి చేసిందీ ప్రజలకు అర్థమైందో లేదో ఎన్నికల్లో తేలుతుంది.

Updated Date - May 24 , 2024 | 06:17 AM