Share News

యుద్ధం ఆపండి...!

ABN , Publish Date - Apr 19 , 2024 | 05:01 AM

వార్‌ రుక్వాదీ పాపా, ఔర్‌ ఫిర్‌ హమారీ బస్‌ నికాలీ పాపా...! అని ఓ విద్యార్థిని ఎంతో ఉద్వేగంతో తన తల్లిదండ్రులకు చెబుతున్న ఓ విడియో అడ్వర్టయిజ్‌మెంట్‌...

యుద్ధం ఆపండి...!

వార్‌ రుక్వాదీ పాపా, ఔర్‌ ఫిర్‌ హమారీ బస్‌ నికాలీ పాపా...! అని ఓ విద్యార్థిని ఎంతో ఉద్వేగంతో తన తల్లిదండ్రులకు చెబుతున్న ఓ విడియో అడ్వర్టయిజ్‌మెంట్‌ భారతీయ జనతాపార్టీ ఇటీవల విడుదల చేయడం, సామాజిక మాధ్యమాల్లో అది విస్తృతంగా ప్రచారం కావడం తెలిసినవే. ప్రధానమంత్రి అధికారిక యూట్యూబ్‌ చానెల్‌లోనూ అది కనిపిస్తుంది. ‘నేను చెప్పలేదూ...మోదీ ఎట్లాగయినా మమ్మల్ని ఇంటికి చేరుస్తాడని, యుద్ధం ఆపేశారు నాన్నా, ఆ తరువాత మమ్మల్ని తీసుకొని బస్సు బయలుదేరింది’ అంటూ ఆ అమ్మాయి చెబుతూంటే తల్లిదండ్రులు ఆనందబాష్పాలు రాల్చుతూంటారు. ఈ అడ్వర్టయిజ్‌మెంట్‌లో స్థలకాలాదులకు సంబంధించిన ప్రస్తావనలు, మోదీ నిలువరించిన ఆ యుద్ధం ఏమిటన్న వివరాలు ఉండవు. కానీ, ఆ సంభాషణ, విమానాశ్రయ దృశ్యాలను బట్టి అది ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించిన ప్రస్తావన అని తెలుస్తూనే ఉంటుంది.

ఉక్రెయిన్‌ మీద రష్యా యుద్ధం ప్రకటించిన తరువాత, బీజేపీతో ముడిపడి సామాజిక మాధ్యమాల్లో ఒక అంశం విస్తృతంగా ప్రచారమైంది. భారతదేశానికి చెందిన విద్యార్థినీ విద్యార్థులను స్వదేశానికి చేర్చడం కోసం నరేంద్రమోదీ ఈ యుద్ధాన్ని కొంతకాలం నిలిపివేశారట. భారతీయవిద్యార్థులను స్వదేశానికి చేర్చుతున్నప్పుడు బీజేపీ నాయకులు చేసిన హడావుడి అటుంచితే, మనపిల్లలకోసం మోదీ ఏకంగా యుద్ధాన్ని ఆపారని అప్పట్లో కొందరు వ్యాఖ్యానించారు కూడా. వీటిని విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఈ తరహా వ్యాఖ్యలన్నీ నిరాధారమైనవీ, పూర్తి అసత్యాలని అని ఖండించారు. ఆ యుద్ధపరిస్థితుల మధ్య కాస్తంత క్షేమకరమైన మార్గం ఏమిటన్నది మేం తెలుసుకొని చెప్పాం, చాలామంది ఆ మార్గాన్ని వినియోగించుకొని బయటపడ్డారు అని అన్నారాయన. దీనిని ఆధారంగా చేసుకొని ఎవరో బాంబులు వేయకుండా ఆపారని, లేదా అందుకు ప్రయత్నించారని చెప్పుకోవడం సరికాదు అన్నారాయన. కానీ, విదేశాంగశాఖ ప్రతినిధి ఇలా కాదు పొమ్మన్నంతమాత్రాన ఎందుకు ఊరుకోవాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా అనిపించింది. 22వేలమంది పిల్లలను క్షేమంగా ఇళ్ళకు చేర్చడానికి నరేంద్రమోదీ రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపారని గత ఏడాది ఫిబ్రవరిలో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఆయన వ్యాఖ్యానించారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సార్వత్రక ఎన్నికల ప్రచారంలో బీజేపీ మళ్ళీ ఈ అంశాన్ని బాగానే వాడుకుంటోంది.

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం మూడేళ్ళుగా సాగుతోంది. ఈ సుదీర్ఘకాలంలో దానిని ముగించడానికి మోదీ ఎంత కృషిచేశారో, ఎన్ని ప్రయత్నాలు చేశారో తెలియదు కానీ, యుద్ధం ఆరంభమైన తొలినాళ్ళలో మోదీ జోక్యంచేసుకోవాలని చాలామంది విదేశీ నాయకులు కోరారు కూడా. ఇప్పుడు యుద్ధాన్ని ఆపేందుకు స్విట్జర్లాండ్‌ ఆధ్వర్యంలో ఒక అంతర్జాతీయస్థాయి ప్రయత్నం మొదలైంది. జూన్‌ 15–16 తేదీల్లో జరిగే ఈ సమావేశంలో అత్యధికదేశాలు పాలుపంచుకుంటాయని అంటున్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు మూడునెలలక్రితం చేసిన అభ్యర్థనకు ఇటీవల సానుకూలంగా స్పందించిన స్విట్జర్లాండ్‌ తదనుగుణంగా ప్రయత్నాలు ఆరంభించింది. దేశాధినేతలంతా పాల్గొనే ఈ సమావేశం అతిత్వరలోనే యుద్ధాన్ని ముగించేందుకు తోడ్పడుతుందని అంచనా. జూన్‌లోగా స్విట్జర్లాండ్‌ అన్ని దేశాలతోనూ చర్చోపచర్చలు జరిపి, ఇచ్చిపుచ్చుకోవడాలను తేల్చి, యుద్ధం ముగింపునకు వాతావరణాన్ని సానుకూల పరుస్తుందట. యుద్ధంలో తనది పైచేయిగా ఉన్న వర్తమాన స్థితిలో, అంతర్జాతీయంగా తనమీద ఒత్తిడితెచ్చి, ఉక్రెయిన్‌కు మేలుచేయడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారంటూ రష్యా దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అందులో పాల్గొనేది లేదని అంటోంది. చైనా కూడా రష్యాపక్షాన నిలబడింది. ఇంకా రెండునెలల సమయం ఉన్నందున ఇంతలోగా పరిస్థితులన్నీ చక్కబడతాయని పశ్చిమదేశాల తరఫున ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్న స్విట్జర్లాండ్‌ బలంగా నమ్ముతోంది. ఉక్రెయిన్‌ దౌత్యప్రతినిధులు ప్రపంచదేశాలన్నీ తిరుగుతూ ఈ సమావేశానికి మద్దతు కూడగడుతున్నారు. అందులో భాగంగానే, గత నెలల ఉక్రెయిన్‌ విదేశాంగమంత్రి మనదేశంలో పర్యటించి, సమావేశాల్లో పాల్గొనాల్సిందిగా అభ్యర్థించారు. కొద్దిరోజుల్లో ముగుస్తుందని అనుకున్న రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ఏళ్ళతరబడి సాగుతూ, ప్రపంచ ఆర్థికాన్ని పెద్దదెబ్బకొట్టింది. ఎవరివాదనలు ఏమైనప్పటికీ, యుద్ధభూమినుంచి కాలువెనక్కుతీసుకొనేందుకు అన్ని పక్షాలకు అందివచ్చిన అవకాశం ఇది. ఇప్పటికైనా, యుద్ధాన్ని ముగించడంలో మనవంతు ప్రయత్నం చేస్తే మంచిది.

Updated Date - Apr 19 , 2024 | 05:01 AM