Share News

స్లిప్పులు–లెక్కలు

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:32 AM

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం)లలో నమోదైన ఓట్లన్నింటినీ వీవీప్యాట్‌ స్లిప్పులతో నూటికి నూరుశాతం సరిపోల్చిన తరువాతే విజేతలను నిర్ణయించాలంటూ

స్లిప్పులు–లెక్కలు

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం)లలో నమోదైన ఓట్లన్నింటినీ వీవీప్యాట్‌ స్లిప్పులతో నూటికి నూరుశాతం సరిపోల్చిన తరువాతే విజేతలను నిర్ణయించాలంటూ దాఖలైన పిటిషన్లను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. రెండురోజుల పాటు విచారణ జరిపి, సరిగ్గా తొలిదశ పోలింగ్‌ ముందురోజున తీర్పును రిజర్వుచేసిన ఇద్దరు న్యాయమూర్తులూ పదిరోజుల్లోనే దానిని ప్రకటించేయడం వారు ఈ కేసుకు ఇచ్చిన ప్రాధాన్యానికి నిదర్శనం. ఈవీఎంలమీద నిరసన ప్రదర్శనలు, చర్చాకార్యక్రమాలు జరుగుతూండటం, ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి ప్రముఖులు లేఖలు రాయడం వంటి పరిణామాల నేపథ్యంలో పిటిషన్ల విచారణ, తీర్పు ప్రకటన త్వరితంగా జరగడం అత్యవశ్యకమని సర్వోన్నత న్యాయస్థానం భావించి ఉంటుంది.


ఈవీఎం వ్యవస్థమీద న్యాయమూర్తులు అపరిమిత విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పుల్లో ఏకాభిప్రాయాన్ని ప్రకటించడం మరీ విశేషం. పిటిషన్‌దారులు వెలిబుచ్చిన అన్ని అభ్యంతరాలు, అనుమానాలు, చేసుకున్న విన్నపాలు అన్నింటినీ కొట్టివేస్తూ తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. బ్యాలెట్‌ పేపర్ వాడిన రోజుల్లో దేశం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నమాట నిజం. బూతుల స్వాధీనం, బ్యాలెట్‌ పత్రాలను నాశనం చేయడం వంటివి చాలా జరిగాయి. ఈవీఎంలు వచ్చిన తరువాత ఆ తరహా అక్రమాలకు పూర్తిగా తెరపడింది. అంతమాత్రాన ఈవీఎంలను ఎంతమాత్రం అనుమానించకూడదని ఏమీ లేదు. వాటిని ట్యాంపర్‌ చేయవచ్చునన్న వాదనలు, ప్రదర్శనలు జరుగుతున్నప్పుడల్లా ఎన్నికల సంఘం ఖండిస్తూ వస్తున్నది. న్యాయమూర్తులే అన్నట్టుగా, గుడ్డిగా ఒక వ్యవస్థను అనుమానించడం సరైనది కాదు. దానితోపాటే, ఆ వ్యవస్థ చక్కనిదని, అభేజ్యమైనదని, ఎవరూ దానిని తాకలేరని అతిగా నమ్మడమూ సరికాదు. సాంకేతిక అంశాలను, నమోదైన డేటాను పరిశీలించిన తరువాత ఈవీఎంలపై అనుమానాలు సహేతుకమైనవి కావని నిర్ధారణకు వచ్చినట్టుగా న్యాయమూర్తులు ప్రకటించారు. ఎన్నికల సంఘం అందించిన డేటా, అది చేసిన వాదనలు న్యాయమూర్తులకు ఈ అభిప్రాయానికి రావడానికి విశేషంగా ఉపకరించినట్టుంది.


కొందరు స్వార్థపరశక్తులు ఈ దేశం సాధించిన విజయాలను తక్కువచేయాలని చూస్తున్నారని, అభివృద్ధిని బలహీనపరచేందుకు ప్రయత్నిస్తున్నారని, అటువంటి ప్రయత్నాలను మొగ్గలోనే తుంచేయాలని ఒక న్యాయమూర్తి ఆగ్రహించారు. పిటిషన్లు వేసిన సంస్థలు, వ్యక్తులు ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్నవారే తప్ప ప్రచారకాంక్షతోనో, దేశాన్ని అప్రదిష్టపాల్జేసేందుకో ప్రయత్నిస్తున్నారని అనుకోలేం. ఈవీఎం, వివిప్యాట్‌ వ్యవస్థ పనితీరును నిగ్గుతేల్చి, ఇప్పుడున్న వ్యవస్థ నూరుశాతం బలమైనదేనా, దానిని మెరుగుపరచుకోవాల్సినదేమైనా ఉన్నదా అన్నవి నిర్ధారించడానికి ఇటువంటి పిటిషన్లు ఉపకరిస్తాయి. విచిత్రమేమంటే, పిటిషన్‌దారులు అడిగినవన్నీ కాదని, ఈవీఎంలమీద మరింత నమ్మకం పెంచేందుకంటూ న్యాయమూర్తులు ఓ రెండు ఆదేశాలు జారీచేశారు. లోడింగ్‌ యూనిట్లను 45రోజుల పాటు భద్రపరచడం అటుంచితే, ఓడిన అభ్యర్థులకు ఐదుశాతం ఈవీఎంలను పరీక్షించుకోగలిగే అవకాశం ఇచ్చారు. నూరుశాతం వీవీప్యాట్‌లను సరిపోల్చాలన్న పిటిషన్‌దారుల అభ్యర్థన నచ్చకపోయినప్పటికీ, ప్రస్తుత పరిమాణాన్ని మరికాస్తంత పెంచివుంటే బాగుండేది. ఈవీఎంలు వచ్చిన తరువాత ఎన్నికల నిర్వహణ, ఫలితాల ప్రకటన సులభం, వేగవంతం అయిన మాట నిజం. ఆ వ్యవస్థమీద నమ్మకాన్ని పెంచేందుకు వీవీప్యాట్‌ వచ్చిచేరింది. అనంతరకాలంలో, పరిమితసంఖ్యలోనైనా పేపర్‌ స్లిప్పులను లెక్కించాల్సిందేనన్న నియమమూ వచ్చింది. 97కోట్ల మంది ఓటర్లున్న దేశంలో నూరుశాతం పేపర్‌స్లిప్పులను సరిపోల్చడం అసాధ్యం, తిరోగామి చర్య అని భావించిన న్యాయస్థానం మరోపక్క ఈ స్లిప్పుల కౌంటింగ్‌కు ఎలక్ట్రానిక్‌ యంత్రాలు వాడే అంశాన్ని పరిశీలించమన్నది. పోలింగ్‌ బూతులోకి ఓటరు అడుగుపెట్టిన క్షణం నుంచి ఫలితాల ప్రకటన వరకూ ప్రస్తుత వ్యవస్థ ఎంత పటిష్టంగా పనిచేస్తున్నదో చెప్పడానికి న్యాయమూర్తులు ఈసీ వాదనలను ఈ తీర్పులో అధికంగా ఉటంకించారు. అగ్రరాజ్యాలతో సహా అనేకదేశాలు ఈవీఎంలను వదిలి తిరిగి బ్యాలెట్‌వైపు మళ్ళిన విషయాన్ని అటుంచితే, ఈవీఎంలను మించిన పకడ్బందీ విధానం మరేదీలేదన్న ఈ తీర్పు తాత్కాలికంగానైనా ఆ వివాదాన్ని చల్లార్చుతుందని ఆశిద్దాం.

Updated Date - Apr 27 , 2024 | 04:32 AM