Share News

స్కూటీ సరే...!

ABN , Publish Date - Apr 13 , 2024 | 03:15 AM

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ ప్రతిచరాస్తి వివరాన్ని కచ్చితంగా తెలియచేయాలన్న నియమమేమీ లేదని సుప్రీంకోర్టు ఇటీవల ఓ తీర్పు సందర్భంగా తేల్చేయడం చాలామందికి...

స్కూటీ సరే...!

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ ప్రతిచరాస్తి వివరాన్ని కచ్చితంగా తెలియచేయాలన్న నియమమేమీ లేదని సుప్రీంకోర్టు ఇటీవల ఓ తీర్పు సందర్భంగా తేల్చేయడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. పోటీచేస్తున్న అభ్యర్థికి సంబంధించిన సమస్త సమాచారం తెలుసుకోవడం ఓటరుకు కచ్చితమైన హక్కేమీ కాదని కూడా కోర్టు ఈ సందర్భంలో వ్యాఖ్యానించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తేజు ప్రాంతం నుంచి 2019లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన కరిఖో క్రి అనే వ్యక్తి ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన కేసులో తీర్పు చెబుతూ సర్వోన్నత న్యాయస్థానం ఓటరుకూ, అభ్యర్థికీ మధ్య ఉన్న సంబంధం మీద లోతైన వ్యాఖ్యలు చేసింది. కరిఖో తన నామినేషన్‌తో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో కుటుంబీకుల పేరిట ఉన్న మూడు వాహనాల వివరాలు వెల్లడించలేదని, ఈ చరాస్తి వివరాలు దాచిపెట్టినందుకు అతడిని అనర్హుడుగా ప్రకటించాలని ప్రత్యర్థి కేసువేశాడు. గువాహటి కోర్టు కరిఖో ఎన్నికను రద్దుచేసింది. కానీ, అభ్యర్థి ప్రతీ చరాస్తినీ అఫిడవిట్‌లో చూపాలన్న నియమం ఏమీ లేదని, వివరాలన్నీ వెల్లడించకపోవడం తప్పుకాదని సుప్రీంకోర్టు అతడిని కాపాడుకొచ్చింది. ఆస్తి అత్యంత విలువైనదై, సదరు అభ్యర్థి విలాసవంతమైన జీవితాన్ని ప్రతిబింబిస్తే తప్ప జాబితాలో ప్రతీదీ రాయనక్కరలేదన్నది ఈ తీర్పు సారాంశం.

తీర్పులో భాగంగా చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారితీశాయి. అభ్యర్థికి సంబంధించిన వివరాలు తెలుసుకొనే హక్కు ఓటరుకు ఏ పాటిది, అభ్యర్థి ఎంతమేరకు గోప్యత పాటించవచ్చు అన్న ప్రశ్నలు ఉదయించాయి. ఖరీదైన జీవనశైలి అన్నదానిని ఎలా నిర్వచించాలన్న అనుమానాలను అటుంచితే, ప్రతీ ఆస్తివివరం చెప్పనంతమాత్రాన అది మోసం కాబోదన్న సుప్రీంకోర్టు వ్యాఖ్య రాజకీయనాయకులకు ఇకపై ఎంతో స్వేచ్ఛనిస్తుందన్న భయాలూ మొదలైనాయి. కోర్టు ఇచ్చిన ఈ మినహాయింపు దాదాపు ప్రతీ ఏటా ఏదో ఒక ఎన్నిక ఎదుర్కొనే ఈ దేశంలో కొత్త సమస్యలు తెచ్చినా తేవచ్చు. తాను ఎన్నుకోబోయే అభ్యర్థికి సంబంధించి పుట్టుపూర్వోత్తరాలనుంచి ఆస్తులు, కేసుల వరకూ సమస్తమూ తెలుసుకొనే హక్కు ఓటరుకు ఉన్నదని, ఎంపిక వాటి ఆధారంగానే జరుగుతుందని అంటున్నప్పుడు ఆవగింజంత ఆస్తిని కూడా దాచకుండా తనకు ఎరుకలో ఉన్న ప్రతీ వివరాన్నీ అభ్యర్థి చెప్పాల్సిందే. కానీ, రాజకీయనాయకులకు కూడా ఇతరుల మాదిరిగానే గోప్యత హక్కు ఉన్నదని, ఓ చిన్న స్కూటీ గురించి చెప్పనంతమాత్రాన అతడు ఓటరును మోసం చేసినట్టు కాదని కోర్టు భావిస్తోంది. అభ్యర్థులు అన్నీ చెప్పనక్కరలేదు, పౌరులకు అన్నీ తెలియనక్కరలేదు అన్నది తీర్పు సారాంశం. పైగా, అఫిడవిట్ ద్వారా అభ్యర్థి వెల్లడించిన తన మొత్తం ఆస్తిపాస్తుల్లో, ఇలా చూపకుండా వదిలేసిన ఆస్తివిలువ ఆవగింజంత కూడా లేనందున దానిని పట్టుకొని అది ఉద్దేశపూర్వకంగా చేసినదిగా భావించలేమని, విస్మరించదగ్గదని కోర్టు వ్యాఖ్యానించడం విశేషం.

కరిఖో తన అఫిడవిట్‌లో చూపని చరాస్తులు ఒక స్కూటీ, ఓ మోటార్‌బైక్‌, ఓ చిన్నవ్యాన్‌ కావడం, వాటికారణంగా దిగువకోర్టు అతడిని అనర్హుడుగా ప్రకటించడం సుప్రీంకోర్టుకు బాధ కలిగించివుంటుంది. అతడు ప్రకటించిన మొత్తం ఆస్తులు ఓ ఎనిమిదికోట్ల వరకూ ఉన్నందున ఆ మేరకు పోల్చిచూస్తే ఈ వాహనాల విలువ బాగా తక్కువే. కరిఖోవరకూ బాగున్నది కానీ, అదే సూత్రం ప్రకారం వేలాదికోట్ల ఆస్తిపాస్తులున్న ఓ అభ్యర్థి తన హెలికాప్టర్‌నో, ఇతరత్రా విలువైన వాహనాలనో అఫిడవిట్‌లో పేర్కొనకుండా వదిలేయవచ్చునా? అని కొందరి అనుమానం.

అభ్యర్థి గోప్యత హక్కును గుర్తిస్తూ, తన అభ్యర్థిత్వానికీ, ఓటరుకు సంబంధం లేని వివరాలు విప్పనక్కరలేదనీ, సమస్తం చెప్పనక్కరలేదనీ అన్న మినహాయింపు రాజకీయనాయకులకు ఎంతో ఆశ్వాసననిస్తుంది, ప్రత్యర్థులనుంచి రక్షిస్తుంది. కానీ, ఐదేళ్ళకోమారు మళ్ళీ ఎన్నికల్లో నిలబడి, తిరిగి అధికారం సాధించడంకోసం నాయకులు విధిలేక సమర్పించాల్సి వస్తున్న ఈ అఫిడవిట్లలో వారు సంపాదించినదంతా తెలియచెబుతున్నారన్న భ్రమలు ఎవరికీ లేవు. కానీ, తాము ఎన్నుకోబోయే వారి వివరాలు తెలుసుకొనే హక్కు ఓటరు ఎంతో కష్టపడిసాధించుకున్నది. అది సంపూర్ణమైనది కాదు అని సర్వోన్నతన్యాయం తేల్చేయడం బాధాకరం. రాజకీయపార్టీలకు విరాళంగా వచ్చే ప్రతీరూపాయి ఎక్కడనుంచి వస్తున్నదో పౌరులకు తెలియాల్సిందేనని ఎన్నికలబాండ్ల గుట్టువిప్పిన సుప్రీంకోర్టు ఈ కేసులో గట్టిగా నిలబడివుంటే బాగుండేది.

Updated Date - Apr 13 , 2024 | 03:15 AM