Share News

రుతుసంధి

ABN , Publish Date - May 25 , 2024 | 04:48 AM

ఒక గది లోంచి మరో గది లోకి వెళ్లినంత సులభం కాదు వేసవి వీడ్కోలు చెప్తుండగానే

రుతుసంధి

ఒక గది లోంచి

మరో గది లోకి వెళ్లినంత

సులభం కాదు

వేసవి వీడ్కోలు చెప్తుండగానే

వానలు సృష్టించే బీభత్సం

కాస్త తత్తరపరుస్తుంది

ఇన్నాళ్ల చెమట నదులు

జల్లుల రూపంలో కురుస్తుంటే

మిశ్రమ వాయు స్పర్శ

కొద్దిసేపు

హాయిగానే వుంటుంది

నింగీ నేలా ఏకమై

పొంగి పొర్లే వర్షం కన్నా

ఎండాకాలమే నయమనిపిస్తుంది.

మనుషులు మర్చిపోతారు

మరుపనేదే లేకపోతే

రుత్వాగమనం కలగాపులగమయ్యేది.

అయితే ఒకటి

ఏ కాలానికి ఆ కాలం

ప్రత్యేకంగా వుంటాయి

సంధి దశలోనే కొంచెం రంధి

జీవితమూ అంతే

దాని నిత్య నూతన రహస్యం కూడా

ఇదే!

– --డా. ఎన్.గోపి

Updated Date - May 25 , 2024 | 04:48 AM