Share News

పచ్చని తెలంగాణలో ఓట్ల కోసం మత చిచ్చు!

ABN , Publish Date - May 11 , 2024 | 06:00 AM

ఉత్తర భారతంలో కలగలసి పోయిన హిందూ – ముస్లిం సంస్కృతులను చెప్పేందుకు గంగా – జమునా తెహజీబ్/ హిందూస్తానీ తెహజీబ్ అన్నారు. అదే తెహజీబ్ (సంస్కృతీ) తెలంగాణ లోనూ కనబడుతుంది.

పచ్చని తెలంగాణలో ఓట్ల కోసం మత చిచ్చు!

ఉత్తర భారతంలో కలగలసి పోయిన హిందూ – ముస్లిం సంస్కృతులను చెప్పేందుకు గంగా – జమునా తెహజీబ్/ హిందూస్తానీ తెహజీబ్ అన్నారు. అదే తెహజీబ్ (సంస్కృతీ) తెలంగాణ లోనూ కనబడుతుంది. ఇవాళ ఏ హైదరాబాద్‌నైతే తెలంగాణకు తలమానికం అనుకుంటున్నామో అది ఇబ్రహీం కుతూబ్ షా, బాగీరథిల ప్రేమతో ఉన్నది. కొందరు ఫెయిరీ టేల్ అని కొట్టిపడేసిన కులీ కుతుబ్ షా, భాగ్‍మతిల ప్రేమ చిహ్నంగా ఉన్నది. తమను తాము నిజాంకి స్వచ్ఛంద సేవకులుగా ప్రకటించుకున్న రజాకార్లు చేసిన అకృత్యాలను మొత్తం ముస్లిం సమాజానికి అంటగట్టే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. అలా చేస్తున్నవారికెవరికీ నిజాం వ్యతిరేక లేదా స్థానిక భూస్వామ్య వ్యతిరేక పోరాటంతో సంబంధం లేదు. రజాకార్ల ఆగడాలను హిందూ ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే కుట్ర నాటి నుండి జరుగుతూనే ఉన్నది.

తెలంగాణ సాయుధ పోరాటం అనగానే అందరికీ గుర్తొచ్చే పేర్లు దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగీ. ఈ ముగ్గురూ పోరాడింది నిజాం మీద కాదు. తనను తాను గొప్పగా రామచంద్రారెడ్డి రజకార్‌గా పిలుచుకున్న విసునూరు దొర మీద. ఇదే విసునూరు రామచంద్రారెడ్డి ఖాసిం రజ్వీ స్థాపించిన రజాకర్ అనే వ్యవస్థకు ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. ఇవాళ ఏ రజ్వినైతే దుర్మార్గుడిగా, ఖూనీకోరుగా మాట్లాడుతున్నామో అందులో విసునూరు రామచంద్రారెడ్డికీ భాగం ఉన్నది. అతని తల్లి జానకమ్మా, అతని కొడుకు బాబుదొర చేసిన అన్యాయాలు అకృత్యాల గురించి ఇప్పటికీ జనం చెప్పుకుంటున్నారు. ఎంత అకృత్యాలకు తెగబడకపోతే మొండ్రాయి గ్రామానికి చెందినా లంబాడాలు తిరగబడి బాబు దొర (జగన్మోహన్)ను జనగామ రైల్వే స్టేషన్‌లో కొట్టి చంపుతారు? ఈ విస్నూరు దొర నలభై వేల ఎకరాల ఆసామి. ‘‘బండెనుక బండిగట్టి పదహారు బండ్లు గట్టి/ ఏ బండ్లో పోతావు కొడుకో నా కొడకా ప్రతాపరెడ్డి’’ అని ప్రజలు పాటలు అల్లిన జెన్నారెడ్డి ప్రతాపరెడ్డికి లక్ష ఎకరాలు ఉండేవి. కల్లూరు దేశముఖ్, సూర్యాపేట దేశముఖ్ వీళ్ళంతా పీడిత ప్రజలను (మతం కోణం నుండి చూస్తే మెజారిటీ హిందువులను) వేధించుకు తిన్నవాళ్ళే. నిజాం పది రూపాయలు శిస్తు వేస్తే ప్రజల నుండి వంద రూపాయల శిస్తు వసూలు చేసి పీడించిన వాళ్ళే. వీళ్ళ అకృత్యాలకు వ్యతిరేకంగానే గుత్పల సంఘం మొదలయింది. ఆ తరువాత సాయుధ పోరాటంగా మారింది.


ఒక్కసారి చరిత్రపుటల్లోకి తరచి చూస్తే త్రివర్ణ పతాకం పట్టుకుని ర్యాలీ చేసినందుకు 23 మందిని పొట్టనబెట్టుకున్న తెలంగాణ జలియన్ వాలా బాగ్‌గా పేరుగాంచిన పరకాలలో కాల్పులకు ఆదేశం ఇచ్చిందీ అక్కడి తహసీల్దార్ విష్ణువేశ్వర్ రావు. భైరాన్‌పల్లిలో 118 మందిని నిలబెట్టి కాల్చి చంపిన ఘటనలో వాళ్లని ఒక్కదగ్గరకు చేర్చి సైనికులకు పట్టించింది స్థానిక భూస్వామే. నిజాం ఏలుబడిలో ఉప ప్రధానిగా ఉన్నది పింగళి వెంకటరామారెడ్డి. ఏ రాజ్యమైనా దుర్మార్గమైనదే. కానీ, రాజు ఫలానా మతంవాడు కనుక వాడిమీదే అన్నీ నెట్టేస్తాం అంటే చరిత్ర ఒప్పుకోదు.

ఈ సందర్భంగా మఖ్దూమ్ మొహియుద్దీన్ మాటను గుర్తు చేసుకోవాలి. ‘‘నిజాం వ్యతిరేక పోరాటమంటే ఇస్లాం వ్యతిరేక పోరాటమే’’ అని ఖాసీం రజ్వీ అంటే ‘‘మాది నిజాం వ్యతిరేక పోరాటమే కాని ఇస్లాం వ్యతిరేక పోరాటం కాదు. నిజాం ఇస్లాం ప్రతినిధి కాదు’’ అన్నాడు మఖ్దూమ్. తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన ముగ్గురిలో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూమ్ మొహియుద్దీన్ ఉన్నారు. ఇవాళ మోదీని విమర్శిస్తే ‘‘ఇది హిందూ మతంపై దాడి’’ అని ఎలా అంటున్నారో, ఆనాడు ఖాసీం రజ్వీ కూడా అలానే అన్నాడు. ఇద్దరి మోడస్ ఆపరెండి ఒకటే. ఒక కల్ట్ ఫిగర్‌ని పెట్టుకుని అతడ్ని సమర్థించడం. అది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కావొచ్చు, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ కావొచ్చు.

దాశరథి రంగాచార్య నవల ‘జనపదం’ మొదటి పేజిలోనే ఇలా ఉంటుంది: ‘‘బండి ఒక రాతిని ఎక్కింది పడింది కుదిపింది. బలరామయ్య చాలా బాధపడ్డాడు. తాను రెండు జతల ఎడ్లను ఎప్పుడూ మేపుతుండేవాడు తన కచ్చాదానికి, బండికి కడితే వాటిని ఆపడం ఎవరితరమూ అయ్యేది కాదు. తాను బయలు దేరేడంటే ఊరంతా హడలిపోయి తప్పుకునేది. బండి ముందు ఒక చాకలి పరుగెత్తాలి. వెనుక సామాను నెత్తిన పెట్టుకొని మరొకడు పరుగెత్తాలి. పరిగెత్తలేకుంటే చచ్చాడన్నమాటే. ఒకసారి అమీనూ తానూ కచ్చాడంలో పోతున్నారు. ముందు నడిచే చాకలికి ఏమైందో తెలియదు ఎందుకు మెల్లగా నడిచాడో తెలియదు. ఎడ్లు పరిగెత్తాయి. వాణ్ణి తొక్కేశాయి. బండి ఆపోద్దన్నాడు తాను. వాడి శవం అక్కడే పడిపోయింది. అలా ప్రభుత్వం చేశాడు తాను. అయినా ఒక్కసారి ఇగిరిపోయింది ప్రభుత్వం. తాను ఊరే వదలిపోవాల్సి వచ్చింది. ఇప్పుడైనా పోలీసు చర్య జరిగింది కాబట్టి పోలీసులు తనవెంట ఉన్నారు కాబట్టి రాగలుగుతున్నాడు. నిజాం నవాబు వట్టి బలహీనుడు. తనకు రక్షణ కల్పించలేకపోయాడు. భారత ప్రభుత్వం మంచిది. అందుకే తనకు పోలీసులనిచ్చి పంపుతుంది’’.


ఏ నిజాంనైతే వ్యతిరేకిస్తూ, ఏ సర్దార్ పటేల్‌ని అయితే ఆకాశానికి ఎత్తుతున్నారో అదే పటేల్ నిజాంని రాజ్ ప్రముఖ్‌గా గవర్నర్ హోదాలో గవర్నర్ భవన్‌లో కూర్చోబెట్టాడు. ఏ బలరామయ్యలను ఐతే కమ్యునిస్టు ఉద్యమాలు ఊరి నుండి తరిమి భూమిని పేదలకు పంచాయో, ఆ పేదల నుండి మళ్ళీ భూములు లాక్కొని రాజ్యం చేసేందుకు బలరామయ్యలకు పటేల్ బలగాలను ఇచ్చాడు. సరిహద్దు గ్రామాల్లో మిలటరీ కనుసన్నల్లో ముస్లింలపై దాడులు చేశారని, లూఠీ చేశారనీ, హత్యలు, అత్యాచారాలు చేశారనీ సుందర్‌లాల్ కమిషన్ పేర్కొన్నది. తన ప్రాంతంలో తనను ఎదిరించిన వారిపై రాచరికపు రాజు దాడిచేస్తే మతం కోణంలో ఆ మతంలోని వారందరికీ ఆ నేరాల్లో భాగాన్ని అంటగట్టేవారు, ఒక రాజ్యం మీద దాడి చేసేందుకు ఒక మత సమూహంపై మరో మత సమూహాన్ని ఎగదోసాడంటూ పటేల్‌ని, అతని మతాన్ని ఇదే మాట అంటే సహిస్తారా?

రెండు మతాల మధ్య గొడవపెట్టి కేవలం ఎన్నికల్లో ఓట్లో, సీట్లో పొందడంలో ఏమైనా అర్థముందా? ఎక్కడైనా రాజకీయాలు విద్వేషాలను రూపుమాపడానికి పాటుపడాలి కాని విద్వేషాలు రెచ్చగొట్టడమే ఎజెండాగా పెట్టుకుంటే ఎట్లా? విద్వేషాలు రేపిన, రేపుతున్న పార్టీ రేపు ఎన్నికల్లో ఓడిపోవచ్చు గాక. కాని అది మలినం చేసిన మెదళ్ల మాటేమిటి? కనీస చరిత్ర తెలియక కళ్ళముందు రోజూ తిరిగే మనిషిని శత్రువనుకుని కత్తులు నూరాలా? అయినా పీల్చేగాలికి, పోయిన ప్రాణానికి మతం ఉంటుందా!? చరిత్రలో రజ్వీలు, రామచంద్రారెడ్లు కలిసే ఉన్నారు. వర్తమానంలో కలిసే ఉన్నారు. భవిష్యత్తులోనూ ఉంటారు. అచ్చంగా ముస్లిం దేశాలతో వ్యాపారాలు చేస్తూ సంపద కూడబెట్టుకుంటారు కూడా. కాని పోయే ప్రాణాలు కొమురయ్య, షోయబుల్లా ఖాన్లవే.

ఏ రాజ్యమైనా దుర్మార్గమైనదే. కానీ, రాజు ఫలానా మతంవాడు కనుక వాడిమీదే అన్నీ నెట్టేస్తాం అంటే చరిత్ర ఒప్పుకోదు. ఈ సందర్భంగా మఖ్దూమ్ మొహియుద్దీన్ మాటను గుర్తు చేసుకోవాలి. ‘‘నిజాం వ్యతిరేక పోరాటమంటే ఇస్లాం వ్యతిరేక పోరాటమే’’ అని ఖాసీం రజ్వీ అంటే ‘‘మాది నిజాం వ్యతిరేక పోరాటమే కాని ఇస్లాం వ్యతిరేక పోరాటం కాదు. నిజాం ఇస్లాం ప్రతినిధి కాదు’’ అన్నాడు మఖ్దూమ్.

అరుణాంక్ లత

Updated Date - May 11 , 2024 | 06:00 AM