Share News

రైసీ దుర్మరణం

ABN , Publish Date - May 21 , 2024 | 05:26 AM

హెలికాప్టర్‌ ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందడం ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచింది. భారీ వర్షాలు, పొంగమంచుతో ప్రకృతి ప్రతికూలంగా...

రైసీ దుర్మరణం

హెలికాప్టర్‌ ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందడం ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచింది. భారీ వర్షాలు, పొంగమంచుతో ప్రకృతి ప్రతికూలంగా మారిపోవడం ఈ దుర్ఘటనకు కారణంగా కనిపిస్తున్నప్పటికీ, గాజా యుద్ధంతో ఇరాన్‌–ఇజ్రాయెల్‌ వైరం పతాకస్థాయిలో ఉన్నప్పుడు రైసీ మరణం పలు అనుమానాలతో పాటు, సరికొత్త భయాలను కూడా కలిగిస్తోంది. అనేక దశాబ్దాల తరువాత ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ నేరుగా తలబడటం ఇబ్రహీం రైసీ ఏలుబడిలో ఇటీవలే జరిగింది. వందలాది డ్రోన్లు, క్షిపణులతో సాగిన ఆ దాడికి ప్రతీకారం తీర్చుకుంటానని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇక, ఇరాన్‌ ఆర్థిక, ఆయుధ సహకారంతో హౌతీ, హిజ్బుల్లా ఇత్యాదిసంస్థలు ఇజ్రాయెల్‌ దూకుడుకు కళ్ళెంవేసేందుకు, ఎర్రసముద్రం దాడులతో అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీసి అగ్రరాజ్యాలపై ఒత్తిడిపెంచేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇంతటి కీలకమైన సమయంలో ఇరాన్‌ అధ్యక్షుడు మరణించడంతో ఇజ్రాయెల్‌ మీదకు అనుమానాలు పోవడం సహజం. తన ప్రమేయం ఏమాత్రం లేదని ఇజ్రాయెల్‌ ప్రమాణం చేస్తున్నప్పటికీ, ఇప్పట్లో ఆ సందేహాలకు తెరపడే అవకాశాలైతే లేవు.


ఈ ప్రయాణంలో ఇరాన్‌ అధ్యక్షుడు వినియోగించిన బెల్‌ హెలికాప్టర్‌ అనేక దశాబ్దాల నాటిది. ఇస్లామిక్‌ విప్లవంకంటే ముందే దీనిని కొనుగోలుచేసి ఉండాలని కొందరి అంచనా. ఆ తరువాత అమెరికా అంక్షలు, కక్షసాధింపు చర్యలు తెలిసినవే. కొత్త హెలికాప్టర్లను కొనగలిగే అవకాశం ఎలాగూ లేకపోగా, ఉన్నవాటి విడిభాగాలకోసం కూడా వెతుక్కుంటున్న స్థితి ఇరాన్‌ది. పశ్చిమదేశాలతో కాస్తంత సయోధ్య సాధించి కష్టాలనుండి బయటపడదామని ఇరాన్‌ చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా అడ్డుపడుతూనే ఉంది. ఒబామా కాలంలో పశ్చిమదేశాలకూ ఇరాన్‌కూ మధ్య కుదిరిన అణు ఒప్పందం ప్రపంచానికి ఎంతో ఉపశమనాన్ని కలిగించింది. కానీ, డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి రాగానే ఈ ఒప్పందం నుండి వైదొలిగి తిరిగి అగ్గిరాజేశారు. ఈ కక్షపూరిత వైఖరే రైసీ ఎదుగుదలకు కూడా దోహదం చేసింది. ఇరాన్‌ అత్యున్నత మతపెద్ద అయతొల్లా అలీ ఖమేనీ అండదండలతో, ఆశీస్సులతో పైకి ఎదిగిన రైసీ 2017 అధ్యక్ష ఎన్నికల్లో హసన్‌ రౌహానీతో పోటీపడి ఓడిపోయారు. 2015లో పశ్చిమదేశాలతో అణు ఒప్పందం కుదర్చుకోవడంలో హసన్‌ రౌహానీ చొరవ కాదనలేనిది. ఆయనకు ఆధునికుడిగా, ఆలోచనాపరుడుగా అక్కడి ఉన్నతస్థానాల్లోనూ, ప్రజల్లోనూ మంచి పేరుంది. ఇక, 2018లో ట్రంప్‌ ఈ అణు ఒప్పందంనుంచి వైదొలిగి, మరిన్ని కఠిమైన ఆంక్షలతో తిరిగి ఇరాన్‌ను వేధించడం ఆరంభించడంతో పరిస్థితులు రైసీకి ఉపకరించాయి. ఆయనకు ఖమేనీ అనేక కీలక పదవులు కట్టబెట్టారు. 2021లో రౌహానీని సులువుగా ఓడించి రైసీ దేశాధ్యక్షుడు కాగలిగారు. కానీ, పాలకుడుగా ఇంటా బయటా ఆయనకు గొప్పపేరేమీ లేదు.

ఖమేనీ శిష్యుడుగా, ఛాందసత్వం అమితంగానే ఉన్న ఈయన అధికారంలోకి రాగానే దేశంలో చాలా ఆంక్షలు అమలుచేశారు. మహిళల వస్త్రధారణకు సంబంధించిన నియంత్రణలమీద పెద్ద ఎత్తున ఉద్యమాలు రేగాయి. మహసా అమిని ఘటన తీవ్ర ప్రజాగ్రహాన్ని రేపింది. మహిళా ఉద్యమాన్ని అణచివేయడంలో ఈయన ప్రదర్శించిన కర్కశత్వం చరిత్రలో నిలిచిపోతుంది. ఆయన మరణానికి దేశంలో అందరూ చింతించడం లేదని, కొన్ని సమూహాలు వేడుక చేసుకుంటున్నాయని వార్తలు వస్తున్నాయి. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఖమేనీ నిష్క్రమణ అనంతరం రైసీ ఆ స్థానాన్ని భర్తీచేయబోతున్నారని అనుకుంటున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది.


చాబహార్‌ పోర్టులో ఒక టెర్మినల్‌ను అభివృద్ధి చేసుకొని వాడుకొనేందుకు భారత్‌–ఇరాన్‌ మధ్య ఇటీవలే పదేళ్ళ ఒప్పందం కుదిరింది. అధ్యక్షుడు రైసీ, విదేశాంగమంత్రి హుసేన్‌ ఆమిర్‌ అబ్దుల్లాహియన్‌ ఈ విషయంలో ఎంతో చొరవచూపి, మనకు ఎంతగానో సహకరించారంటూ విదేశాంగమంత్రి జయశంకర్‌ గుర్తుచేసుకున్నారు. భారత్‌–ఇరాన్‌ మధ్య అనాదిగా బలమైన మైత్రి ఉంది. కొన్ని సందర్భాల్లో మనస్పర్థలు కలిగినా అవి హద్దులు దాటలేదు. అమెరికా ఆంక్షలు, ఆదేశాల మేరకు ఇరాన్‌తో మనం వ్యవహరించే తీరులో గతంతో పోల్చితే ఎంతోమార్పు వచ్చినప్పటికీ, చమురు దిగుమతుల విషయంలో అమెరికా మాటను తుచ తప్పకుండా పాటించినప్పటికీ ఇరాన్‌ మన పరిస్థితిని అర్థం చేసుకుంది, సానుకూలంగానే వ్యవహరించింది. ఇప్పుడు కొత్త అధ్యక్షుడుగా ఎవరు ఎంపిక అయినప్పటికీ, ఉభయదేశాల సంబంధాలు మెరుగుపడవచ్చునే కానీ, దిగజారే అవకాశాలైతే లేవు.

Updated Date - May 21 , 2024 | 05:26 AM