Share News

అవినీతిలో పురోగతి

ABN , Publish Date - Feb 07 , 2024 | 03:31 AM

అవినీతి, బంధుప్రీతి, కుటుంబపాలన మీద ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించడం కొత్తేమీ కాదు కానీ, ఎప్పుడూ వినసొంపుగానే ఉంటుంది. దేశంలో అవినీతిని అంతం చేసేంతవరకూ విశ్రమించేది లేదని ఆయన...

అవినీతిలో పురోగతి

అవినీతి, బంధుప్రీతి, కుటుంబపాలన మీద ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించడం కొత్తేమీ కాదు కానీ, ఎప్పుడూ వినసొంపుగానే ఉంటుంది. దేశంలో అవినీతిని అంతం చేసేంతవరకూ విశ్రమించేది లేదని ఆయన సోమవారం చేసిన ప్రతిజ్ఞ కచ్చితంగా సంతోషం కలిగించేదే. పదేళ్ళక్రితం వరకూ పార్లమెంటులో కుంభకోణాలమీద చర్చలు జరిగేవని, ప్రతిసారి చర్యలు తీసుకోవాలని సభ పట్టుబట్టేదని, ఇప్పుడు అవినీతిమీద చర్యలు తీసుకుంటూ ఉంటే కొందరు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. దేశాన్ని దోచుకుంటూ ఉంటే ఊరుకొనేది లేదని, దోచుకున్న సొమ్మును వాపస్‌ చేసేవరకూ అవినీతి నేతలను వదిలేదని ఆయన తీవ్రహెచ్చరికలు చేశారు.

అవినీతికి పుట్టినిల్లుగా కాంగ్రెస్‌ను చిత్రీకరించి అధికారంలోకి వచ్చినవారు కనుక, కాంగ్రెస్‌ ముక్త్‌భారత్‌ సాధించేవరకూ ఆ వాదన కొనసాగుతుంది. తాము, తమ మిత్రపక్షాలు తప్ప మిగతాపార్టీలన్నీ అవినీతిమయమైనవేనని, దర్యాప్తు సంస్థలు రాజ్యాంగానికి లోబడే విపక్షనేతలను చెడుగుడు ఆడుతున్నాయని బీజేపీ సహజంగానే వాదిస్తుంది. తమ ప్రభుత్వాలను కూల్చడానికి, ఏక్‌నాథ్‌ షిండేలు అవతరించడానికి సీబీఐ, ఈడీ, ఐటీ ఇత్యాది సంస్థలు బీజేపీకి ఉపకరిస్తున్నాయని విపక్షాలు అంటాయి. ఈ దేశంలో కుంభకోణాలు వెలుగుచూడటంలోనే కాదు, వాటిపై దర్యాప్తు జరగడంలోనూ రాజకీయం ఉంటుంది. యూపీఏ కొంపముంచిన టూజీ స్పెక్ట్రమ్‌ కుంభకోణంలో ౧.76లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ అప్పటి ‘కాగ్‌’ వినోద్‌రాయ్‌ ఇచ్చిన నివేదిక వెనుక ఎవరి కుట్రలున్నాయో ఆ తరువాత ఆడిటింగ్‌ బృందం అధిపతి చెప్పకనే చెప్పారు. కుంభకోణమే లేదని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ తేల్చినా, ఆ కేసు నిలబడకపోయినా నరేంద్రమోదీ అధికారంలోకి రావడానికి ఇది దారులుపరిచింది. ఇటువంటి ప్రమాదమే తమకు కూడా ఉన్నదని కాబోలు, స్వతంత్ర వ్యవస్థలన్నింటినీ అస్వతంత్రం చేసి దేశంలో బీజేపీ తప్ప మరేపార్టీ లేకుండా చేస్తామన్న ప్రతిజ్ఞకు అనుగుణంగా విపక్షాన్ని తుడిచిపెట్టేసే పనిలో బీజేపీ ఉంది. ప్రధాని తన ప్రసంగంలో హేమంత్‌ సొరేన్‌ పేరు ప్రస్తావించినప్పటికీ, ఆ హిట్‌లిస్టులో ఇంకా ఎవరెవరున్నారో అందరికీ తెలిసిందే.

ఈ రాజకీయ వైరాన్ని అటుంచితే, నేను తినను, ఎవరినీ తిననివ్వనని ప్రకటించిన నరేంద్రమోదీ ఈ పదేళ్ళకాలంలో అవినీతిపై పోరాటంలో ఎంతోకొంత విజయం సాధించివుండాలి. అవినీతి నిర్మూలనను ఒక ఆదర్శంగా, సమున్నత లక్ష్యంగా ప్రకటించి, ఎవ్వరినీ వదిలిపెట్టవద్దని సీవీసీ, ఐటీ అధికారులకు సందేశాలు ఇస్తుంటారు కనుక, ప్రభుత్వస్థాయిలో అవినీతి బక్కచిక్కివుండాలి. కానీ, ఇందుకు పూర్తి భిన్నంగా, ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సర్వేలో దేశం ఒకేమారు ఎనిమిది ర్యాంకులు దిగజారి, 180 దేశాల్లో 93వ స్థానంలో మిగిలింది. ప్రభుత్వంలో అవినీతి పెరిగిందనీ, ముడుపులు ముట్టచెప్పవలసివస్తున్నదని, ప్రైవేటు లబ్ధి పెరిగిందన్నది ఈ సర్వే సారాంశం. ఈ నివేదికను సైతం బీజేపీ అంతర్జాతీయ కుట్రగా తీసిపారేయగలదేమో కానీ, కేంద్రంలో తామే అధికారంలో ఉంటూ, సగానికిపైగా రాష్ట్రాలు తమ చేతుల్లో ఉన్నందున మోదీ ప్రవచిత పోరాటం ప్రయోజనం చేకూర్చడం లేదని ప్రజలు భావించే ప్రమాదమైతే ఉంది.

పదేళ్ళక్రితం వరకూ పార్లమెంటులో కుంభకోణాలమీద చర్చలు జరిగేవని, చర్యలు తీసుకోవాలని సభ పట్టుబట్టేదని మోదీ తనకు తెలియకుండానే ఓ మంచి విషయం చెప్పారు. ఇప్పుడు పాలకులు ఉద్దేశపూర్వకంగానే చర్చకు వీల్లేకుండా చేస్తున్నారు. అధికారపక్షం అవినీతినీ, ఆశ్రితపెట్టుబడిదారుల అక్రమాలను ప్రస్తావించినవారిని సభనుంచి బహిష్కరించేవరకూ, శిక్షించేవరకూ వదలడం లేదు. అంతర్జాతీయ పత్రికలు, సంస్థలు వెలికి తీస్తున్న కుంభకోణాలను విదేశీకుట్రగా, వాటిమీద దర్యాప్తుకోరిన వారిని కుట్రదారులుగా ముద్రవేసి నోరుమూయిస్తున్నారు. ఐదేళ్ళవరకూ లోక్‌పాల్‌ ఏర్పాటు చేయకుండా, తరువాత పలు సవరణలతో చివరకు దానికి కోరలు లేకుండా చేశారు. అవినీతిని బహిర్గతం చేయడంలో ప్రధానాస్త్రంగా ప్రజలకు ఉపకరించే సమాచార హక్కు విషయంలోనూ ఇదే జరిగింది. అవినీతి నిర్మూలనకు వీలుగా సమస్త వ్యవస్థలనూ సిద్ధంచేయడానికి బదులు, ఫిర్యాదు చేస్తే ప్రాణంమీదకు వస్తుందని ప్రజలు భయపడే వాతావరణాన్ని నెలకొల్పు తున్నప్పుడు అవినీతిలో అగ్రస్థానానికి ఎగబాకుతూనే ఉంటాం.

Updated Date - Feb 07 , 2024 | 03:31 AM