Share News

ప్రజలూ అటే..!

ABN , Publish Date - Apr 23 , 2024 | 03:36 AM

మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్‌ మొయిజ్జుకు చెందిన పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ భారీ మెజార్టీ సాధించింది. మజ్లిస్‌లోని మొత్తం 93స్థానాల్లో ఆయన పార్టీకి 70సీట్లు దక్కాయి...

ప్రజలూ అటే..!

మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్‌ మొయిజ్జుకు చెందిన పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ భారీ మెజార్టీ సాధించింది. మజ్లిస్‌లోని మొత్తం 93స్థానాల్లో ఆయన పార్టీకి 70సీట్లు దక్కాయి. మిత్రపక్షాలకు మరో మూడు లభించాయి. మొయిజ్జుకు అగ్నిపరీక్షగా నిలిచిన ఈ ఎన్నికలు భారత్‌, చైనాలకు కూడా అత్యంత ముఖ్యమైనవి. చైనా అనుకూలుడికి పేరుపడిన అధ్యక్షుడికి సభలో ఇంతబలం చేకూర్చిన ప్రజలు, భారత్‌కు అనుకూలంగా ఉండే మాజీ అధ్యక్షుడు ఇబ్రాహీం మహ్మద్‌ సోలీ నేతృత్వంలోని మాల్దీవియన్‌ డెమోక్రాటిక్‌ పార్టీ (ఎండీపీ)కి పన్నెండు స్థానాలే ఇచ్చారు. గతంలో 65 స్థానాలున్న ఈ పార్టీని తన భారత వ్యతిరేక ప్రచారంతో మొయిజ్జు బలంగా దెబ్బతీయగలిగారు.

‘చిన్నదేశమైనంత మాత్రాన మమ్మల్ని వేధించే హక్కు ఎవరికీ లేదు’ అంటూ భారతదేశాన్ని ఉద్దేశించి పరోక్షవ్యాఖ్యలతో, మన డెబ్బయ్‌మంది సైనికులను వెళ్ళగొట్టడం వంటి చర్యలతో ప్రజలను మొయిజ్జు తనవైపు బాగా తిప్పుకోగలిగారు. గత ఏడాది ఇబ్రాహీం మహ్మద్‌ సోలీని ఓడించి అధ్యక్షుడైన మొయిజ్జు పార్లమెంట్‌ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువబలాన్ని ప్రదర్శించగలడని ఎవరూ అనుకోలేదు. మొయిజ్జు చైనా అనుకూల వైఖరిమీద ప్రజల్లో అంత సానుకూలత లేదని, అధ్యక్షుడైన తరువాత ఆయన పొరుగుదేశమైన భారత్‌తో ఘర్షణాత్మకంగా వ్యవహరించడం అధికులకు నచ్చడం లేదని విశ్లేషకులు భావించారు. మహా అయితే, త్రిశంకు సభ ఏర్పడుతుంది తప్ప, విజయం అధ్యక్షుడి పక్షాన ఏకపక్షంగా ఉండబోదని విపక్షం ఎంతగానో నమ్మింది. కానీ, దాని అంచనాలకు భిన్నంగా ప్రజలు ఆయనకు భారీ మెజారిటీ కట్టబెట్టడం విచిత్రం. 2008లో మాల్దీవుల్లో ప్రజాస్వామిక పాలన ఆరంభమైన తరువాత, ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోకుండా, కూటమికట్టకుండా తొలిసారిగా ఒంటరిగా 2019లో అధికారంలోకి వచ్చిన ఎండీపీ ఇప్పుడు ఏకంగా చతికిలబడిపోయింది. అనేకమంది స్వతంత్రుల కంటే ఇబ్రాహీం సోలీ పార్టీ అభ్యర్థులు వెనుకబడ్డారు. ఇండిపెండెంట్లుగా గెలిచిన ఆరుగురూ అధ్యక్షుడి కూటమిలో చేరినపక్షంలో ఆయన మరింత బలపడతారు.

మాల్దీవుల్లో ‘ఇండియా ఔట్‌’ నినాదానికి పునాదులు వేసి, ఆరేళ్ళక్రితం వరకూ భారతదేశానికి తలనొప్పిగా పరిణమించిన దేశమాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ ఒక అవినీతి కేసులో పదకొండేళ్ళ జైలుశిక్ష అనుభవిస్తున్న కారణంగా తన బదులు శిష్యుడైన మొయిజ్జును అధ్యక్ష ఎన్నికల బరిలోకి దింపారు. ప్రమాణస్వీకారం చేయగానే పొరుగున ఉన్న భారతదేశాన్ని సందర్శించడమనే సంప్రదాయాన్ని పక్కనబెట్టి తుర్కియే, సౌదీ అరేబియా వెళ్ళారు. తరువాత చైనా వెళ్ళివచ్చి భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. భారతప్రధాని నరేంద్రమోదీ అనూహ్యంగా లక్షద్వీప్‌ను సందర్శించి అక్కడి ప్రకృతిశోభను ప్రశంసించి, చక్కని పర్యాటక ప్రదేశంగా అభివర్ణిస్తూ ట్వీట్లు చేయడం, వాటి అధారంగా అభిమానులు మాల్దీవులపని అయిపోయిందని వ్యాఖ్యానించడం, ఇందుకు ప్రతిగా మొయిజ్జు మంత్రులు ముగ్గురు నోరుపారేసుకోవడం, వారిని ఆయన సస్పెండ్‌ వంటి పరిణామాలు తెలిసినవే. ఆ తరువాత కూడా భారతదేశ ప్రముఖులు చాలామంది సామాజిక మాధ్యమాల్లో మాల్దీవులను వెంటాడినందువల్ల దాని పర్యాటకం దెబ్బతిన్నది. దీనికి పోటీగా మొయిజ్జు చైనా సందర్శించి ఇరవైకు పైగా ఒప్పందాలు కుదర్చుకున్నారు, బిఆర్‌ఐని పునరుద్ధరించారు. ఈ తరహా భారత్‌ వైఖరి మొయిజ్జు ఘనవిజయానికి మరింత దోహదపడిందా అన్నది అటుంచితే, ఇప్పుడు ఆయన చైనాకు మరింత సన్నిహితం కావడానికి మార్గం సుగమం అయింది.

మొయిజ్జు భారత వ్యతిరేక ఎజెండా మాల్దీవులకు మేలుచేయదని ప్రధాన విపక్షపార్టీ ఎండీపీ చెప్పిచూసింది, పార్లమెంటులో తనకున్న సంఖ్యాబలంతో అధ్యక్షుడి నిర్ణయాలకు, నియామకాలకు అడ్డుతగిలి దారికి తెచ్చేందుకు విఫలయత్నంచేసింది. చివరకు అభిశంసన తీర్మానంతో ఆయనను దించేందుకు కూడా సిద్ధపడింది. కానీ, ఇప్పుడు ప్రజలు ఆయనకే భారీ విజయం చేకూర్చి సమర్థించారు. నిరంకుశమైన బలంతో ఇప్పుడు ఆయన కావాల్సిన చట్టాలు చేసుకోవచ్చు, నచ్చిన విధానాలు అమలుచేయవచ్చు. భారత్‌ పక్షాన ఆయనను నిలదీసే, ప్రశ్నించే ప్రధానప్రతిపక్షం ప్రస్తుతానికి తన ఉనికి కోల్పోయింది. చారిత్రకంగా, భౌగోళికంగా ఎంతో సన్నిహితంగా ఉండే భారతదేశంతో, ఇప్పటివరకూ కొనసాగిన సత్సంబంధాలను విఘాతం కలగకుండా, నిప్పురేపకుండా వ్యవహరించాలని కోరుకోవడం వినా చేయగలిగిందేమీ లేదు. విదేశాంగమంత్రి జయశంకర్‌ అన్నట్టుగా ఎవరు వచ్చినాపోయినా, ఇరుగూపొరుగూ అన్నాక పొద్దున్న లేస్తే మొఖాలు చూసుకోవాల్సిందే.

Updated Date - Apr 23 , 2024 | 03:36 AM