Share News

మాల్దీవుల్లో రాజకీయ తుఫాను

ABN , Publish Date - Feb 01 , 2024 | 03:15 AM

మాల్దీవుల్లో రాజకీయపరిణామాలు వేగంగా మారుతున్నాయి. గత ప్రభుత్వం నియమించిన ప్రాసిక్యూటర్‌ జనరల్‌ హుస్సేన్‌ షమీమ్‌ బుధవారం ఉదయం కత్తిపోట్లకు గురి అయి ఆస్పత్రిలో చేరడం ఇప్పటికే విపక్షానికి...

మాల్దీవుల్లో రాజకీయ తుఫాను

మాల్దీవుల్లో రాజకీయపరిణామాలు వేగంగా మారుతున్నాయి. గత ప్రభుత్వం నియమించిన ప్రాసిక్యూటర్‌ జనరల్‌ హుస్సేన్‌ షమీమ్‌ బుధవారం ఉదయం కత్తిపోట్లకు గురి అయి ఆస్పత్రిలో చేరడం ఇప్పటికే విపక్షానికి, అధికారపక్షానికి మధ్య ఉన్న వైరాన్ని మరింత పెంచుతుంది. ఆదివారం అక్కడి పార్లమెంటులో కీలకమైన ఓటింగ్‌ సందర్భంలో ఉభయపక్షాల మధ్య జరిగిన దాడులు మీడియాలో విస్తృతంగా ప్రచారమైనాయి. అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జు మంత్రివర్గంలో నలుగురు మంత్రుల నియామకాన్ని తిరస్కరించి, స్పీకర్‌ సైతం రాజీనామా చేయాలంటూ విపక్షం డిమాండ్‌ చేసినప్పుడు ఈ ఘర్షణ జరిగింది. ఒకమంత్రి గట్టెక్కినా, సభ తిరస్కరించిన మిగతా ముగ్గురు మంత్రులను, అటార్నీ జనరల్‌ను అధ్యక్షుడు తిరిగి నియమించడంతో వివాదం మరింత వేడెక్కింది. మొయిజ్జు ఎన్నికైన మూడు నెలల్లోనే మాల్దీవుల్లో పరిణామాలు మారిపోవడం, అధ్యక్షుడిని అభిశంసించేందుకు విపక్షం సిద్ధపడటం వెనుక భారత్‌ హస్తం ఉన్నదని చాలామంది నమ్మకం.

‘ఇండియా ఔట్‌’ నినాదంతోనే మొయిజ్జు 54శాతం ఓట్లతో అధ్యక్షుడయ్యారు. తన చర్యలకు, చేష్టలకు ప్రజల మద్దతు ఉన్నదన్న వాదనతో అక్కడున్న భారత సైనికులను ఖాళీచేయమంటున్నారు. అధ్యక్షుడు కాగానే తొలిగా భారతదేశాన్ని సందర్శించే సంప్రదాయాన్ని పక్కనబెట్టి, తుర్కియే, సౌదీ అరేబియా వెళ్ళారు. తరువాత చైనా పోయి, భారీ పెట్టుబడులతో దేశాన్ని ఆదుకోమని విజ్ఞప్తిచేశారు. తిరిగి రాగానే భారత్‌ పేరు ఎత్తకుండా చిన్నదేశమనే కారణంతో మాల్దీవులను వేధించే హక్కు ఎవరికీ లేదన్నారు. ఇక, చైనా గూఢచర్య ఓడను మరమ్మత్తుల పేరిట లంగరువేసుకోవడానికి అనుమతించడం ఉభయదేశాల మధ్యా అగాధాన్ని మరింత పెంచింది. ఎవరికీ భయపడేది లేదు, మాల్దీవుల ప్రయోజనాలకే అగ్రస్థానం అంటూ ఎన్ని ముసుగుమాటలు చెప్పినా ఈ చర్యతో ఆయన భారతవ్యతిరేక వైఖరి మరింత స్పష్టమైంది. విపక్షం ఆయనమీద ప్రత్యక్షయుద్ధానికి దిగింది. అనాదిగా సన్నిహితంగా ఉన్న దేశాలను దూరంచేసుకోవడం వల్ల మాల్దీవుల దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతింటాయని విపక్షాలన్నీ సంయుక్త ప్రకటన చేశాయి. జమ్హూరీ పార్టీ నాయకుడు స్వయంగా అధ్యక్షుడిని కలిసి, భారతదేశాన్నీ, నరేంద్రమోదీనీ క్షమాపణలు కోరమంటూ సలహాఇచ్చారు.

అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి సరిపడినన్ని సంతకాల సేకరణలో ఇప్పుడు విపక్షం ఉంది. 87 స్థానాలున్న సభలో 58మంది సంతకాలతో అధ్యక్షుడిని దింపివేయవచ్చునని అక్కడి రాజ్యాంగం చెబుతోంది. భారత అనుకూల పక్షమైన ఎండీపీ, దానితో చేతులు కలిపిన డెమోక్రాట్లు ఈ లెక్కకు దాదాపు సరిపోతారు. దీనికితోడు, నవంబరులో మొయిజ్జు అధ్యక్షుడు కాగానే, ఏడుగురు సభ్యులు రాజీనామా చేసి అధికారపదవులు చేపట్టగానే, తనకున్న సంఖ్యాబలంలో విపక్ష ఎండీపీ ఒక ప్రధాన సవరణ సా‌ధించింది. దానిప్రకారం సభ మొత్తం బలం కాక, ఉన్న 80స్థానాలే పరిగణనలోకి వస్తాయి. ఈ కొత్త విధానం ప్రకారం అధ్యక్షుడిని అభిశంసించడానికి అవసరమైన సంఖ్యాబలం ఇంకా తగ్గుతుంది. ఆదివారం విపక్షాలు తిప్పికొట్టినప్పటికీ, అధ్యక్షుడు తిరిగి నియమించిన కొత్త అటార్నీ జనరల్‌ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ మార్పు చెల్లకుండా చేసే ప్రయత్నంలో ఉన్నారు.

మొయిజ్జు అభిశంసన జరుగుతుందా, వెనుక భారత్‌ హస్తం ఉన్నదా అన్నవి అటుంచితే, ఉభయదేశాల మధ్యా అగాధం పెరగడం సరికాదు. ప్రధాని మోదీ లక్షద్వీప్‌ను సందర్శించి కొన్ని ట్వీట్లు చేయడం, వాటి అధారంగా అభిమానులు మాల్దీవులపని అయిపోయిందని వ్యాఖ్యానించడం, ఇందుకు ప్రతిగా మొయిజ్జు మంత్రులు ముగ్గురు నోరుపారేసుకోవడం తెలిసినవే. వారు సస్పెండ్‌ అయినా కూడా సమస్తరంగాలకు చెందిన మన ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో మాల్దీవులను వెంటాడి, దాని పర్యాటకాన్ని దెబ్బతీశారు. సున్నితంగా, దౌత్యంతో కాక, దెబ్బకు దెబ్బ విధానంలో వ్యవహారాలు చక్కబెట్టాలని చూసినప్పుడు, భారత్‌ పెద్దన్నలాగా వ్యవహరిస్తున్నదంటూ ఆడిపోసుకొనే చిన్నచిన్న పొరుగు దేశాలకు ఈ వైఖరి మరింత ఉపకరిస్తుంది, భయపెడుతుంది. పొరుగుదేశాలతో స్నేహానికే ప్రథమ తాంబూలం అంటున్నప్పుడు, తన రాజకీయ మనుగడకోసం ఒక నాయకుడు అనుసరిస్తున్న విధానాలకు ఆజ్యంపోయకుండా, చైనాకు మరింత సన్నిహితం కాకుండా జాగ్రత్తపడాలి. విదేశాంగమంత్రి జయశంకర్‌ అన్నట్టుగా ఎంతకాదనుకున్నా, ఎవరు వచ్చినాపోయినా, ఇరుగూపొరుగూ అన్నాక పొద్దున్న లేస్తే మొఖాలు చూసుకోవాల్సిందే.

Updated Date - Feb 01 , 2024 | 03:15 AM