Share News

పరస్పర అపనమ్మకాల సుడిలో ప్రజాస్వామ్యం!

ABN , Publish Date - Jun 11 , 2024 | 05:37 AM

గమనించాలి గానీ రాజకీయ సందర్భాలు కూడా అనేక రాజకీయేతర గుణపాఠాలు నేర్పిస్తుంటాయి. గత రెండు దశాబ్దాలుగా జరుగుతున్న ఎన్నికలను, వాటి ఫలితాలను గమనిస్తే ఆ గుణపాఠాలకు కొదవేమీ లేదు.

పరస్పర అపనమ్మకాల సుడిలో ప్రజాస్వామ్యం!

గమనించాలి గానీ రాజకీయ సందర్భాలు కూడా అనేక రాజకీయేతర గుణపాఠాలు నేర్పిస్తుంటాయి. గత రెండు దశాబ్దాలుగా జరుగుతున్న ఎన్నికలను, వాటి ఫలితాలను గమనిస్తే ఆ గుణపాఠాలకు కొదవేమీ లేదు. ప్రజలు సంక్షేమం కోరుకుంటున్నారా అభివృద్ధి కోరుకుంటున్నారా. ఈ ప్రశ్నలకు ఏ ప్రభుత్వం దగ్గరయినా సమాధానం ఉందా?

ప్రభుత్వాలు ప్రజలకు ఏ ఏ ఉపకారాలు చేయదలుచుకుంటున్నాయి. ప్రజలు ప్రభుత్వాల నుంచి ఎటువంటి లబ్ధి ఆశిస్తున్నారు. ప్రజల ఆశలకూ ప్రభుత్వాల పందేరాలకూ నడుమ సమన్వయం ఉన్నట్టా లేనట్టా. ప్రజలు ఆశిస్తున్న లబ్ధులనే ప్రభుత్వాలు అందిస్తున్నాయా. ప్రభుత్వాలు అందిస్తున్న ప్రయోజనాలతో ప్రజలు సంతృప్తి చెందుతున్నారా లేక ఇంకా ఇంకా కావాలి అంటున్నారా. ప్రజలు సంతృప్తి చెందుతున్నట్టయితే అధికార పీఠాన్నెక్కే రాజకీయ పార్టీల మార్పిడి తరచూ ఎందుకు జరుగుతోంది. అలా కాదనుకుంటే ప్రజలు సంతృప్తి చెందడంలేదు అనే మర్మాన్ని అధికారంలో ఉన్న పార్టీలు ఎందుకు గ్రహించలేకపోతున్నాయి.

ఈ ప్రశ్నలకు ప్రజల దగ్గర సమాధానాలున్నాయా? రెండు సందర్భాలలోనూ లేవనే గత ఇరవై ఏళ్ల ఎన్నికల ఫలితాలు చెపుతున్నాయి. ప్రజలు సంక్షేమాన్ని కోరుకుంటున్నారనడానికి గత రెండు దశాబ్దాల ఎన్నికలలో ఉదాహరణలు లేవు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారనడానికి కూడా స్పష్టమైన ఆధారాలు లేవు.


మరింత ఉదాహరణలతో చెప్పాల్సి వస్తే అభివృద్ధికీ, ఆత్యాధునిక ఆలోచనా విధా నానికీ మారుపేరనుకున్న చంద్రబాబును దించి ప్రజలు ఒకానొక సందర్భంలో రాజశేఖర రెడ్డికి పట్టం కట్టారు. అభివృద్ధినీ సంక్షేమాన్నీ సమపాళ్లలో అందించానని తాననుకున్న కేసీఆర్‌‍నూ ప్రజలు ఇంకో సందర్భంలో మట్టి కరిపించారు. మళ్లీ అదే అభివృద్ధికి కొండగుర్తు అనుకునే చంద్రబాబును కాదని జగన్‌‍కు ఆంధ్ర ప్రజలు లాండ్ స్లయిడ్ ఫలితాన్నిచ్చారు. మరో మలుపులో సంక్షేమమే ఆరుప్రాణాలుగా పాలన సాగించాననుకున్న జగన్‌‍ను తోసిరాజని అదే ప్రజలు మళ్లీ తామే తిరస్కరించిన చంద్రబాబును గద్దెనెక్కించారు. ‘‘మరీ 23 వచ్చేంత చెడు చేసామా మేం ప్రజలకు!’’ అని చంద్రబాబే అవాక్కయే సందర్భం, ‘‘నేను కోట్లాదిమందికి అందించిన వేల కోట్ల రూపాయల లబ్ధి ఏమయింది ఎటుపోయింది?’’ అని జగన్ స్వయంగా గద్గదపడే సందర్భం... రెండూ ఆంధ్ర ప్రజల చమత్కారాలే!

అవినీతికి అసలు సిసలు అర్థం అని ముద్రపడ్డ నితిష్‌కు మళ్లీ అదే ప్రజలు అందలమిచ్చారు. దేశాన్ని ప్రగతి సూచీలో అగ్రస్థానంలో ఉంచామన్న చెప్పన్ ఇంచ్ ఛాతీని అబ్ కీ బార్ తీన్ సౌకీ ఇస్ పార్ అని గేటు మూసేసారు. రాముడే దేశాన్ని మా చేతిలో పెడతాడనుకున్న వారికీ ఏకంగా అయోధ్యే చేయిచ్చింది. గుడి మెట్ల కింద నలిగిపోయిన గుడిసెలూ చిరువ్యాపారాలూ డొక్కాడడానికి చెమటలు కక్కే రెక్కలూ అభివృద్ధి కంటే తమ సంక్షేమమే ముఖ్యం అనుకుని ఉంటాయి. రాముడికన్నా ఆత్మారాముడే ముఖ్యం అనుకోవడంలో తప్పేంలేదు కదా. ఓడి గెలిచారో గెలిచి ఓడారో అర్థం కాని అయోమయంలోకి ఎన్డీఏనూ, ఇండియా కూటమినీ ప్రజలు విజయవంతంగా నెట్టేసారు.


ఇంత అభివృద్ధి చేసినా నన్ను ప్రజలు ఎందుకు కాదన్నారు అని గతంలో చంద్రబాబు సమాధానాల కోసం వెతుక్కున్నాడు. ఇంత సంక్షేమం అందించినా నాకెందుకిలా అయింది అని జగన్ ఇంకా కోమాలోంచి తేరుకోలేదు, బహుశా తేరుకోవడానికి చాలా కాలం పట్టొచ్చు. అభివృద్ధీ సంక్షేమం రెండూ చేసాను కదా నన్నెందుకు ప్రజలు కాదన్నారు అని కేసీఆర్ ఆ చిక్కుముడిని విప్పే ప్రయత్నంలో సతమతమవుతున్నాడు. మరోవైపు ప్రజలు కూడా అభివృద్ధిని కోరుకుంటూనే దానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం లేదు, సామూహిక ప్రయోజనాల గురించి ప్రజలు ఆలోచించడం, నిరసించడం ఏనాడో మానేసారన్నది నిజం. వ్యక్తిగత లబ్ధులకే ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నదీ నిజమే. అయితే వ్యక్తిగత లబ్ధులను ఇచ్చే ప్రభుత్వాల పట్ల ప్రజలకు సానుకూలత లేనే లేదన్నదీ వాస్తవమే. ‘‘పాలకులేమన్నా వాళ్ల జేబుల్లోంచి ఇస్తున్నారా, మాది మాకే ఇస్తున్నార’’న్న భావన కూడా ప్రజల మెదళ్లలో బలంగా పీఠం వేసుకుంది. పైగా నాకు పదివేలిస్తున్నాడూ అంటే కచ్చితంగా వాడు పది లక్షలు తినే ఉంటాడన్న విశ్వాసమూ ప్రజలకు బలంగానే ఉంది. ఈ భావనే ప్రభుత్వాలను సంక్షేమం నిలబెట్టలేకపోవడానికి ప్రధాన కారణం. అభివృద్ధి వల్ల సమూహాలకే తప్ప వ్యక్తిగత ప్రయోజనం లేదు, వ్యక్తిగత ప్రయోజనం కూర్చే సంక్షేమం ఎవడబ్బసొమ్మూ కాదన్న అభిప్రాయాలే ప్రధానంగా ఈ ప్రభుత్వాల మార్పిడికి కారణం. ఈ ప్రహేళికను అర్థం చేసుకుని అటు సంక్షేమాన్నీ ఇటు అభివృద్ధినీ కూడా కొన్ని ప్రభుత్వాలు పట్టించుకున్నప్పటికీ ప్రజలు మాత్రం ఆ ప్రభుత్వాల పట్ల కూడా కనికరం చూపడం లేదు.

మాకు అభివృద్ధి వద్దని కానీ సంక్షేమం వద్దని కానీ ప్రజలు కరాఖండిగా చెప్పలేరు. ఏ ప్రభుత్వాలు వచ్చినా తమ సంక్షేమం తమకు దక్కుతుందనే నమ్మకం ప్రజలలో బలపడిపోయింది. అభివృద్ధి తమ సమస్య కాదనీ అది ప్రభుత్వాలే చూసుకుంటాయనీ నమ్మి కూడా ప్రజలు బలంగా దాన్ని పట్టించుకోవడం లేదు. చేపల్ని పట్టడం నేర్పాలి ఉచితంగా చేపల్నివ్వడం చేటు అనే సత్యాన్ని ఎప్పుడో పెడచెవిన పెట్టాం. ఉచితాల పద్మవ్యూహం నుంచి ఏ ప్రభుత్వమూ ఏ రాజకీయ పార్టీ అయినా అర్జునుడు కాలేని అభిమన్యుడే. రెండు రెండ్లు నాలుగనే లోకంలో అప్పట్లో చంద్రబాబు ఓడిపోకూడదు. ఇప్పట్లో కేసీఆర్ ఓడిపోకూడదు. కానీ వాస్తవం వేరేగా వుంది కదా.

ప్రజలను అర్థం చేసుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తేలిపోయింది. తమను ఫలానా రకంగా అర్థం చేసుకోండి అని ప్రజలు కూడా ప్రభుత్వాలకు తాత్పర్యాలను వివరించడంలోనూ సఫలం కాలేదని తేలిపోయింది. ఇటువంటి సందర్భాల్లోనే ఒక ప్రశ్న అందరినీ తొలుస్తూంటుంది. ప్రజలు మేధావులు, ఎవర్ని ఎక్కడ కూచోబెట్టాలో వాళ్లకు స్పష్టంగా తెలుసు అనే మాట నిజమేనా అని. మరో వైపు ప్రజలను మోసం చేసే నాయకులను చూసాం కానీ నాయకులను మోసం చేసే ప్రజలను చూడలేదు అని వినిపించే విచిత్రమైన వాదన సరైందేనా అనీ అనిపిస్తుంది. ఎవరి సైజును వాళ్లకు తెలియచేయాలన్నా ఎవరినైనా మోసం చేయాలన్నా వాళ్లను సంపూర్ణంగా అర్థం చేసుకోవడం అవసరం. వాళ్ల పట్ల పూర్తి అవగాహన తప్పనిసరి. కానీ ఇక్కడ అటు ప్రభుత్వాలూ ప్రజలను సరిగా అర్థం చేసుకోలేదనీ ఇటు ప్రజలూ ప్రభుత్వాల పట్ల సరైన అవగాహనకు రాలేకపోతున్నారనీ తెలిసిపోతోంది. ఈ ఒకరిని ఒకరు అర్థం చేసుకోని పరిస్థితే గొప్పది అనుకుంటే ప్రజాస్వామ్యానికి చాలా నష్టం.


మనం వేసే ఓటువల్ల గొప్ప మార్పు జరిగిపోతుంది అనే మాట నిజమే అయితే వాళ్లు మనల్ని ఓటు వేయనివ్వరు అంటాడు ఆస్కార్ వైల్డ్. అసలిక్కడ ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య పరస్పర విశ్వాసం లేకపోవడం ప్రధానాంశం. ప్రజలు తమను మరోసారి కూడా గెలిపిస్తారు అని ఏ ప్రభుత్వమూ నమ్మలేకపోతోంది. ఈ ప్రభుత్వం కాక మరో ప్రభుత్వం మరింత మేలు చేస్తుందేమో అన్న గోడదూకుడు అవకాశం ఉండడం చేత ప్రజలూ ప్రస్తుత ప్రభుత్వాలను నమ్మరు. ఈ అపనమ్మకాల గందరగోళంలోనే ప్రజాస్వామ్యం చిక్కుకుపోతోంది. ప్రజలూ పాలకులు వేరువేరుగా ఉండని వ్యవస్థే ప్రజాస్వామ్యం అని చెప్పుకునే నిఘంటు అర్థాలను విని నవ్వుకుని ప్రజలూ పాలకులూ ఎప్పుడూ వేర్వేరే, వాళ్లు ఒకళ్లకొకళ్లు ఎప్పటికీ అర్థం కారు అని నిర్ధారించుకునే రోజులొచ్చాయని మన ఎన్నికలు రౌండ్ రౌండ్ కీ రుజువు చేస్తున్నాయి.

ఈ ఒకళ్లనొకళ్లు అర్థం చేసుకోవడానికి మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి ప్రయత్నాలూ జరగలేదు. అర్థం చేసుకుంటున్నాం అనుకుంటూ ప్రతి ప్రయోగంలో ఆకులు పట్టుకుంటూ కాలిన చేతులను చూసుకుని దిగాలు పడడమే మిగిలింది. ఇప్పుడు తీవ్రంగా ప్రయోగాలు జరగాలి. ఏం కావాలి ఏం ఇవ్వాలి అనే విషయంలో మధ్యేమార్గాన్ని సుస్థిరం చేయాలి. రాజకీయేతర వ్యవస్థల నుంచి కొన్ని ప్రయోగశాలలు తయారై పరిష్కారాన్ని కనుగొనాలి. అభివృద్ధా, సంక్షేమమా లేక రెండూనా లేక రెండూ కాదా అనే సందిగ్ధత నుంచి బయటపడడం ప్రజలకూ ప్రభుత్వాలకూ అత్యవసరం. నిజమే రాజకీయ సందర్భాలు రాజకీయేతర గుణపాఠాలను నేర్పిస్తాయి. కానీ ఆ రాజకీయేతర గుణపాఠాలు కూడా రాజకీయాలను సవరించడానికి సరిదిద్దడానికి మాత్రమే ఉపయోగపడాలి.

ప్రజలూ పాలకులు వేరువేరుగా ఉండని వ్యవస్థే ప్రజాస్వామ్యం అని చెప్పుకునే నిఘంటు అర్థాలను విని నవ్వుకుని ప్రజలూ పాలకులూ ఎప్పుడూ వేర్వేరే, వాళ్లు ఒకళ్లకొకళ్లు ఎప్పటికీ అర్థం కారు అని నిర్ధారించుకునే రోజులొచ్చాయని మన ఎన్నికలు రౌండ్ రౌండ్ కీ రుజువు చేస్తున్నాయి. అభివృద్ధా, సంక్షేమమా లేక రెండూనా లేక రెండూ కాదా అనే సందిగ్ధత నుంచి బయటపడడం ప్రజలకూ ప్రభుత్వాలకూ అత్యవసరం.

ప్రసేన్

Updated Date - Jun 11 , 2024 | 05:37 AM