Share News

PM Narendra modi : నరేంద్రుని కొత్త అంకం

ABN , Publish Date - Jun 08 , 2024 | 05:42 AM

భారతదేశ గౌరవనీయ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో నేనీ కాలమ్‌ను రాస్తున్నాను; మీరు చదవబోతున్నారు. అయితే నరేంద్ర మోదీ ఇంకెంత

PM Narendra modi : నరేంద్రుని కొత్త అంకం

ప్రపంచమొక రంగస్థలం. పురుషులు, స్త్రీలు అందరూ నటీనటులు. వారి ప్రవేశాలు, నిష్క్రమణలు వారికున్నాయి. ఏడు అంకాల నాటకంలో ప్రతి మనిషి తన జీవిత కాలంలో అనేక పాత్రలు ధరిస్తాడు.

– విలియం షేక్‌స్పియర్

అనేక రాజకీయ పక్షాలు భాగస్వాములుగా ఉన్న ఒక సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించనుండడం మోదీకి పూర్తిగా కొత్త అనుభవమే. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారక్‌గా, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధాన మంత్రిగా మోదీ తన 55 సంవత్సరాల ప్రజా జీవితంలో సొంత పార్టీకి మెజారిటీ లేని ఒక సంకీర్ణ ప్రభుత్వానికి అధినేత పాత్ర వహించేందుకు ఎన్నడూ సిద్ధం కాలేదు. తనకు తెలియని ఒక ఆటలో ఆయన ఆడనున్నారు!

భారతదేశ గౌరవనీయ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో నేనీ కాలమ్‌ను రాస్తున్నాను; మీరు చదవబోతున్నారు. అయితే నరేంద్ర మోదీ ఇంకెంత మాత్రం ఇదివరకటి ప్రధానమంత్రి కారు, కాబోరు. ఏక –పార్టీ ప్రభుత్వ నిరంకుశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిష్క్రమించనున్నారు, ఒక సంకీర్ణ ప్రభుత్వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రంగప్రవేశం చేయనున్నారు. అనేక పార్టీలు భాగస్వాములుగా ఉన్న సంకీర్ణమది (ఈ భాగస్వామ్య పక్షాలలో తెలుగుదేశం పార్టీకి 16 మంది, జనతాదళ్ (యునైటెడ్) పార్టీకి 12 మంది ఎంపీలు ఉన్నారు). ఇటువంటి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించనుండడం మోదీ మహాశయునికి పూర్తిగా కొత్త అనుభవమే. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారక్‌గా, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధాన మంత్రిగా మోదీ తన 55 సంవత్సరాల ప్రజా జీవితంలో తన సొంత పార్టీకి మెజారిటీ లేని ఒక సంకీర్ణ ప్రభుత్వానికి అధినేత పాత్ర వహించేందుకు ఎన్నడూ సిద్ధం కాలేదు. తనకు తెలియని, స్వీయ స్వభావానికి అనుగుణం కాని ఒక ఆటలో ఆయన ఆడనున్నారు!

సరే, ఇటీవలే ముగిసిన 18వ లోక్‌సభ ఎన్నికలలో భారతీయ ఓటర్లు, కొద్ది వారాల క్రితం వరకు అసాధ్యమైనవిగా కన్పించిన, అనూహ్యమైనవిగా అన్పించిన ఎన్నో ఘనమైన ఫలితాలను సాధించారు. అవి: పార్లమెంటు ఉభయ సభలు నియమ నిబంధనల ప్రకారం నడవనున్నాయి. సభాపతి, సభానాయకుడి విచక్షణ మేరకు కాకుండా ఏకాభిప్రాయంతో సభా నిర్వహణ జరగనున్నది; వివిధ సభా సంఘాల కూర్పు మరింత సమతౌల్యంగా జరగనున్నది. ఆ సంఘాల సారథ్య బాధ్యతలను అన్ని రాజకీయ పార్టీలకు మరింత సమరీతిలో అప్పగించడం జరగనున్నది; లోక్‌సభలో గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు ఉంటారు, ప్రతిపక్షంలో తగినంత సంఖ్యలో ఎంపీలు ఉన్నారు; పార్లమెంటులోని ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేనిపక్షంలో రాజ్యాంగ సవరణలు అసాధ్యమవుతాయి; కేబినెట్ లేదా మంత్రిమండలి సమావేశాలు కేవలం ప్రధానమంత్రి నిర్ణయాలను లాంఛనప్రాయంగా ఆమోదించేందుకే ఇంకెంత మాత్రం జరగవు. ప్రధానమంత్రి నిర్ణయాలు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చేటప్పటికే అవి అమలులో ఉండడం ఇటీవలి సంవత్సరాలలో ఒక పరిపాటిగా ఉన్నది. పెద్దనోట్ల రద్దు లాంటి ‘కఠోర ’ నిర్ణయాలను ‘తెలియజేసేందుకు మాత్రమే’ కేబినెట్ సమావేశాలు ఇంకెంత మాత్రం జరగబోవు; రాష్ట్రాల హక్కులను అంగీకరించి, వాటిని కాపాడతారు; కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల సంక్రమణ, మంత్రిత్వ శాఖలు/ విభాగాలకు నిధుల కేటాయింపు, పథకాల రూపకల్పన, ఆమోదం నిర్హేతుకంగా జరగవు. అవి విధిగా ప్రభుత్వ భాగస్వామ్య పక్షాల ఆమోదం, సంతృప్తి మేరకు జరిగి తీరుతాయి; ప్రధానమంత్రి ఇకముందు మరింత తరచుగా ఉభయ సభలకు హాజరై సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తారు, ముఖ్యమైన చర్చలలో పాల్గొంటారు.


ప్రజా తీర్పు నుంచి నేర్చుకోవలిసిన పాఠాలు ఏమిటి? భారత ప్రజలు తమ మనసులోని మాటను ఓటు ద్వారా చెప్పారు. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు వారు అమిత విలువనిస్తున్నారు. వాక్‌స్వాతంత్ర్యాన్ని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వారు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. గోప్యతా హక్కు, నిరసన తెలిపే హక్కును వారు ప్రగాఢంగా కోరుకుంటున్నారు. ‘దేశ ద్రోహం’, ‘పరువు నష్టం’ పేరిట బూటకపు కేసులు మోపే ప్రవృత్తిని పాలకులు విడనాడాలి. ‘ఎన్‌కౌంటర్’, ‘బుల్‌డోజర్ న్యాయం’కు స్వస్తి చెప్పాలి (ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఇదొక పాఠం). రామమందిరం రాజకీయాలకు అతీతమైనది. రాజకీయ ప్రయోజనాలకు మతపరమైన అంశాలను మళ్లీ ఉపయోగించుకోకూడదు (ఇదెంత ముఖ్యమో, అయోధ్య భాగంగా ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాది పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన 77 సంవత్సరాల అవదేష్ ప్రసాద్‌ను అడగండి. అలాగే శ్రావస్తి నియోజకవర్గంలో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి సాకేత్ మిశ్రా (ప్రధానమంత్రి మాజీ ప్రధాన కార్యదర్శి, ఆలయ నిర్మాణ ట్రస్ట్ చైర్మన్ నృపేంద్ర మిశ్రా కుమారుడు) మరింత ముఖ్యంగా, మరింత బాగా చెబుతారు). ఆంక్షలు లేని పత్రికా స్వేచ్ఛను ప్రజలు కోరుకుంటున్నారు. బూటకపు ఎగ్జిట్‌పోల్స్ గతించిన విషయమైపోవాలి; ప్రధానమంత్రి అనుక్షణ కదలిలకను విసుగెత్తేలా చూపించే పద్ధతిని ఎలక్ట్రానిక్ మీడియా విడనాడాలి; పాలకుల ప్రతి మాటను సమర్థించే వైఖరిని ప్రింట్ మీడియా ఇంకెంత మాత్రం అవలంబించకూడదు; మంత్రులకు ఇబ్బంది కలిగించని రీతిలో ప్రశ్నలు వేయడం శాసన నిర్మాతలకు తగదు; ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐలు అందించిన ప్రకటనలను విధేయపూర్వకంగా వల్లించడాన్ని మానుకోవాలి.

ప్రాంతీయ పార్టీలు తమ ప్రధాన సిద్ధాంతాలు, విశ్వాసాలకు చిత్తశుద్ధితో నిబద్ధమవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఢిల్లీలో ఒక మాట, రాష్ట్ర రాజధానిలో మరొక మాట చెప్పడాన్ని వారు హర్షించరు. అటువంటి ప్రాంతీయ పక్షాలను అసోం గణపరిషత్, శిరోమణి అకాలీదళ్, జేజేపీ, భారత రాష్ట్రసమితి, జనతాదళ్ (సెక్యులర్)ను శిక్షించిన విధంగా శిక్షించి తీరుతారు. బిజూ జనతాదళ్, వైసీపీల విషయంలో వలే చెంపపెట్టుగా వ్యవహరిస్తారు. ఇటీవలి ఎన్నికలలో ఈ ప్రస్తావిత పార్టీలకు ఎదురైన అనుభవాల నుంచి తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ (యునైటెడ్)లు పాఠాలు నేర్చుకోవాలి.


ప్రతిపక్షాల ఎజెండా ఏమిటి? ఒక పార్లమెంటరీ ప్రతిపక్షంగా ప్రవర్తించేందుకు ప్రతిపక్షాలకు పది సంవత్సరాల అనంతరం ఒక అవకాశం లభించింది. పార్లమెంటు లోపలా, బయటా ప్రతిపక్షాలు తమ ఎజెండాకు కట్టుబడాలి. ప్రజలు ఆమోదించి, పలువురు ఇండియా కూటమి అభ్యర్థులను ఎన్నుకోవడానికి కారణమైన కొన్ని భావాలు: దేశ వ్యాప్తంగా సామాజిక– ఆర్థిక సర్వే, కులాల వారీ జనగణన; 106వ రాజ్యాంగ సవరణను వెన్వెంటనే అమలుపరిచి, ప్రజలు ఎన్నుకునే చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్లు సమకూర్చడం; గ్రామీణ ఉపాధి హామీ పథకంతో సహా ప్రతి ఉపాధి కార్యక్రమంలోనూ కనీస దినసరి వేతనాన్ని రూ.400గా నిర్ణయించి అమలుపరచడం; వ్యవసాయ రుణగ్రస్తతపై ఒక శాశ్వత కమిషన్‌ను నియమించి, దాని సిఫారసుల ప్రకారం వ్యవసాయ రుణాలను రద్దు చేయాలి; ప్రభుత్వంలోను, ప్రభుత్వ నియంత్రిత సంస్థలలోను 30 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి; అప్రెంటిసెస్ చట్టానికి, అవసరమైతే సవరణలు చేసి, వెన్వెంటనే అమలుపరచాలి. అప్రెంటిస్‌లను నియమించేలా లాభదాయకంగా నడుస్తున్న ప్రతి వ్యాపార, పారిశ్రామిక సంస్థపై ఒత్తిడి తేవాలి; ఆప్రెంటిస్‌లకు ఇచ్చే స్టైఫండ్‌ల భారాన్ని ప్రభుత్వమూ పంచుకోవాలి; అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాలి; పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టు నిర్ణయించేంతవరకు దాని అమలును నిలిపివేయాలి; సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ, ఎస్‌ఎఫ్‌ఐఓ, ఎన్‌సీబీ మొదలైన దర్యాప్తు సంస్థలను ఒక సంయుక్త పార్లమెంటరీ సంఘం పర్యవేక్షణలో ఉంచాలి.

జూన్ 9న ఒక కొత్త ఆట ఆరంభమవనున్నది. కొత్త ఆటగాళ్లు అగ్రభాగంలో ఉన్నారు. ఆటగాళ్ల నిష్క్రమణలు, ప్రవేశాలను గమనిస్తూ ఉండండి.

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Jun 08 , 2024 | 05:42 AM