Share News

కేజ్రీవాల్ కొత్తకేసు

ABN , Publish Date - May 08 , 2024 | 12:15 AM

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ అధినాయకుడు అరవింద్ కేజ్రీవాల్ నిర్బంధపర్వం కొత్తమలుపులు తిరుగుతోందే తప్ప, ముగింపునకు రావడం లేదు. ఎన్నికల ప్రచారం కోసం తాత్కాలిక బెయిల్ ఇచ్చే విషయం...

కేజ్రీవాల్ కొత్తకేసు

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ అధినాయకుడు అరవింద్ కేజ్రీవాల్ నిర్బంధపర్వం కొత్తమలుపులు తిరుగుతోందే తప్ప, ముగింపునకు రావడం లేదు. ఎన్నికల ప్రచారం కోసం తాత్కాలిక బెయిల్ ఇచ్చే విషయం పరిశీలిస్తామని ఒక సానుకూల సంకేతం ఇచ్చిన సుప్రీంకోర్టు, మంగళవారం నాడు, ఏ నిర్ణయం ప్రకటించకుండానే విచారణను వాయిదా వేసింది. వచ్చే గురువారమో లేక వచ్చేవారమో తిరిగి విచారిస్తామని చెప్పింది. ఈ లోగా, అరవింద్ కేజ్రీవాల్ మీద మరో అభియోగంపై విచారించడానికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనుమతించారు. శిక్ష అనుభవిస్తున్న సిక్కు మిలిటెంటును విడుదల చేయించడానికి ఖలిస్తాన్ అనుకూల బృందాల నుంచి హవాలా మార్గంలో ఆప్ పార్టీ నాయకుడు నిధులు తీసుకున్నారన్నది అభియోగం.


మద్యం కుంభకోణాన్నే బూటకంగా చెబుతూ, తనది రాజకీయ నిర్బంధమేనని వాదిస్తున్న కేజ్రీవాల్, నిర్బంధంలో ఉంటూ కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇదొక విచిత్రమైన, ప్రత్యేకమైన సన్నివేశం. మునుపెన్నడూ ఏ ముఖ్యమంత్రీ జైలు నుంచి పరిపాలన సాగించలేదు. ఇది ‘ఆప్’ పార్టీకి అప్రదిష్ఠాత్మకమో, రాజకీయ కక్ష సాధిస్తున్నారన్న ఆరోపణ దృష్ట్యా కేంద్ర అధికారపార్టీకి అవమానకరమో బోధపడడం లేదు. మద్యం కుంభకోణంలో అరెస్టయిన తక్కిన నిందితుల కంటె, కేజ్రీవాలే కేంద్ర పెద్దలకు ముఖ్యమని, రాజకీయ స్పర్థతో మొదలుకుని వ్యక్తిగత వైరం దాకా అన్నీ ఈ కేసులో ఇమిడి ఉన్నాయని పరిశీలకులు చెబుతారు.


అరవింద్ కేజ్రీవాల్, అన్నా హజారే మొదలైనవారు పది, పన్నెండు సంవత్సరాల కిందట నిర్వహించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం కేంద్రంలో ప్రభుత్వం మారడానికి, ‘ఆప్’ పార్టీ అవతరణకూ కూడా ఉమ్మడి నేపథ్యం. కాంగ్రెస్ ప్రతిష్ఠను తీవ్రంగా మలినపరచిన ఆ నాటి ఉద్యమం, కేజ్రీవాల్‌కు మచ్చలేని నూతన తరం నాయకుడిగా గుర్తింపు ఇచ్చింది. ఆయన ఆచరణ రాజకీయరూపం తీసుకుని, దేశరాజధానిలో గట్టి బలాన్ని సమకూర్చుకుంది. దేశమంతా జైత్రయాత్ర చేస్తున్న బీజేపీకి ఢిల్లీలో మాత్రం ఆదరణ దక్కడం లేదు. పోనీ, ఢిల్లీకి పరిమితమై ఉంటేనైనా ఊరుకునేవారేమో కానీ, ‘ఆప్’ పంజాబ్‌కు, గోవాకు, గుజరాత్‌కు కూడా విస్తరిస్తూ వచ్చింది. కాంగ్రెస్ వంటి భ్రష్ఠ ప్రత్యామ్నాయం మీద సాధ్యపడుతున్న అవలీల ఆధిక్యం, వేగంగా ఎదుగుతున్న ‘ఆప్’ మీద సాధ్యపడదని, అది గట్టి జాతీయ ప్రత్యామ్నాయం కాగలదని బీజేపీలో బెరుకు మొదలైనట్టుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, జాతీయస్థాయిలో ఏర్పడిన ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లో ‘ఆప్’ భాగస్వామి కావడం మరో ఎత్తు. అవినీతి రాహిత్యానికి పర్యాయపదంగా జనంలో ‘ఆప్’కు ఉండిన ప్రసిద్ధిని దెబ్బతీయడమే లక్ష్యంగా మద్యం కుంభకోణం దర్యాప్తు సాగిందని, గుజరాత్, గోవా, ఢిల్లీ, పంజాబ్‌లలో ప్రచారం నుంచి దూరం చేయడానికే అరెస్టు జరిగిందని ‘ఆప్’ ప్రతినిధులు చేసే ఆరోపణలు ఆలోచించదగ్గవే. కుంభకోణంలో అవినీతి ఎంత ఉన్నదో కానీ, ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ ప్రయోజనాల పాత్ర చిన్నదేమీ కాదు. ఎక్కడ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తుందో అన్న భయమే, ఇప్పుడు మరో కొత్త కేసును వెలికితీయడానికి కారణమని వాదిస్తున్నవారున్నారు. కొత్త కేసులో కనిపిస్తున్న కేంద్రం పట్టింపు చూసి, సుప్రీంకోర్టే మంగళవారం బెయిల్ ఇవ్వడానికి జంకిందేమోనని అనుమానిస్తున్నవారూ ఉన్నారు. పరిణామాల మధ్య సంబంధాలను ఎవరికి తోచినరీతిలో వారు వ్యాఖ్యానించకుండా ఆపలేము.


1990ల మొదట్లో యూత్ కాంగ్రెస్ అధ్యకుడిగా ఉన్న మణీందర్ సింగ్ బిట్టా లక్ష్యంగా చేసుకుని, ఢిల్లీలో ఒక బాంబు పేలుడు జరిగింది. బిట్టా తప్పించుకున్నారు కానీ, పేలుడులో 9 మంది మరణించారు.. లూథియానాలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ దేవిందర్‌పాల్ భుల్లార్‌ను ఆ పేలుడులో దోషిగా 2001లో టాడా కోర్టు నిర్ధారించింది. మొదట మరణశిక్ష పడినా, తరువాత అది యావజ్జీవ శిక్షగా మారింది. పాతికేళ్లకు పైగా నిర్బంధంలో ఉన్న భుల్లార్‌ను విడుదల చేయాలని అకాలీదళ్ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నది. దేశవిదేశాల్లోని ఖలిస్థాన్ వాదులు, సిక్కు హక్కుల సంఘాలవారు కూడా భుల్లార్ విడుదల కోరుతున్నారు. ‘సిక్స్ ఫర్ జస్టిస్’ అనే ప్రవాస సిక్కు సంస్థ కూడా ఆ సంఘాలలో ఒకటి. దానిని భారత్ నిషేధించింది కూడా. భారత్ భద్రతాసంస్థలు హత్యచేయడానికి ప్రయత్నించాయని ఈ మధ్య అమెరికా ప్రభుత్వం చెబుతున్న గురుపత్వంత్ సింగ్ పన్నున్ దానికి నాయకుడు. భుల్లార్ విడుదల కోసం తాను కేజ్రీవాల్‌కు డబ్బు ఇచ్చానని ఆ పన్నున్ ఒక వీడియోలో చెప్పాడని, దాని ఆధారంగా ఇప్పుడు విచారణ చేయాలని ఎన్ఐఎ కోరుతోంది. నిజానికి, ఈ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్ కలసి భుల్లార్ విడుదలకు ఆటంకాలు కల్పిస్తున్నారని అకాలీదళ్ ఈ మధ్యన కూడా ఆరోపించింది. నిషిద్ధ సంస్థగా ప్రకటించిన ఎస్ఎఫ్‌జె ప్రతినిధి చేసిన ఆరోపణకు విలువ ఎట్లా ఇస్తారని, అది తప్ప మరో ఆధారమెక్కడుందని ఆప్ వాదిస్తోంది.

మంగళవారం నాటి గుజరాత్ పోలింగ్‌కు ముందటి ప్రచారంలో కేజ్రీవాల్ పాల్గొనలేకపోయారు. గురువారమో, ఆ తరువాతో బయటకు వచ్చి ఢిల్లీ ప్రచారానికి అందుకోగలుగుతారా అన్నది పెద్ద ప్రశ్న.

Updated Date - May 08 , 2024 | 12:15 AM