Share News

శాంతి సాధ్యమేనా?

ABN , Publish Date - May 07 , 2024 | 04:59 AM

భయపడినట్టే జరుగుతోంది. రాఫా నగరంనుంచి తక్షణమే ఓ లక్షమంది పాలస్తీనియన్లను ఖాళీచేయించాలని ఇజ్రాయెల్‌ నిర్ణయించుకుంది. నగరంలోకి చొరబడేందుకు...

శాంతి సాధ్యమేనా?

భయపడినట్టే జరుగుతోంది. రాఫా నగరంనుంచి తక్షణమే ఓ లక్షమంది పాలస్తీనియన్లను ఖాళీచేయించాలని ఇజ్రాయెల్‌ నిర్ణయించుకుంది. నగరంలోకి చొరబడేందుకు సైన్యానికి అత్యున్నతస్థాయి అనుమతులు లభించినందున పౌరులను ఖాళీచేయించే పనిలో సైన్యం ఉన్నదని వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్‌ సైన్యానికీ, హమాస్‌కు మధ్య భీకర పోరు ఆరంభం కాబోతున్నదన్న భయంతో రాఫానగరం నుంచి ప్రజలు తరలిపోతున్నారు. చేతికి దొరికినవాహనాల్లోనూ, గాడిదలమీదా, నడుచుకుంటూ ప్రజలు కదిలిపోతున్నారు. హమాస్‌తో కాల్పుల విరమణకు సంబంధించిన చర్చలను ప్రభావితం చేయడానికీ, దానిని లొంగదీయడానికీ ఇజ్రాయెల్‌ ఈ రాఫా నిర్ణయాన్ని ప్రకటించిందని ఓ వాదన. రాఫా జోలికి వస్తే ఊరుకొనేది లేదనీ, ఆ నగరంలోకి అడుగుపెడితే ఇక మాటలుండవని హమాస్‌ హెచ్చరిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ఇజ్రాయెల్‌ ప్ర‌ధాని బెంజమీన్‌ నెతన్యాహూకు ఫోన్‌ చేసి, పదిలక్షలమంది పాలస్తీనా శరణార్థులు తలదాచుకుంటున్న ఈ నగరంలోకి సైన్యాన్ని పంపి, మారణహోమానికి పాల్పడవద్దని హితవుచెప్పారట. వాళ్ళిద్దరూ నిజంగా ఏమి మాట్లాడుకున్నారో తెలియదు కానీ, నెతన్యాహూ ఎవరిమాటా వినడని అందరికంటే ఎక్కువగా అమెరికా అధ్యక్షుడికే ఎరుక.


పరిమితస్థాయి చొరబాటు మాత్రమే జరుగుతుందని వార్తలు వస్తున్నప్పటికీ వాటిని ఏమాత్రం విశ్వసించలేం. వందలాదిమంది సైనికులు మారణాయుధాలతో రాఫాలోకి అడుగుపెడితే, వారు రాక్షసంగా వ్యవహరించడం, రెండుపక్షాల పోరులో సామాన్యులు సమిధలు కావడం ఖాయం. పైగా, హమాస్‌ యోధానుయోధులంతా ఈ నగరంలోనే ఉన్నారని, రాఫా వారి కీలకమైన స్థావరమని ఇజ్రాయెల్‌ అంటోంది. నాలుగు హమాస్‌ బెటాలియన్లకు ఈ నగరం స్థావరమని, వీరికితోడు గత ఆర్నెల్లయుద్ధంలో ఇతర ప్రాంతాలనుంచి పారిపోయివచ్చిన వేలాదిమంది హమాస్‌ ఫైటర్లు ఇక్కడే తలదాచుకుంటున్నారని ఇజ్రాయెల్‌ వాదిస్తోంది. అందువల్ల ఇప్పటివరకూ గ్రౌండ్‌ ఆపరేషన్స్‌ చేపట్టని కీలకమైన నగరంలోకి ఇజ్రాయెల్‌ సేనలు ప్రవేశిస్తే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ఈ కారణంగానే అమెరికా సహా చాలా యూరప్‌ దేశాలు ఇజ్రాయెల్‌ సాగించబోయే విధ్వంసకాండతో తమకు అప్రదిష్టవస్తుందని భయపడుతున్నాయి, కూడదని హితవుచెబుతున్నాయి.


ఈజిప్ట్‌, ఖతార్‌ మధ్యవర్తిత్వంలో, హమాస్‌–ఇజ్రాయెల్‌మధ్య సాగుతున్న చర్చలు ఫలించాయని, కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్‌ అంగీకరించిందని వార్తలు వస్తున్నాయి. రాఫానుంచి తొలివిడతగా లక్షమందిని ఖాళీచేయించి, తన సైన్యాన్ని ప్రవేశపెట్టేందుకు ఇజ్రాయెల్‌ సిద్ధపడటంతోనే హమాస్‌ దిగివచ్చిందని కొందరివాదన. కాల్పుల విరమణకు హమాస్‌ సానుకూలంగా ఉన్నదని తెలిసి, అది తన నిర్ణయాన్ని ప్రకటించేలోగా నెతన్యాహూ రాఫామీద పడ్డారని మరోవాదన. కాల్పులవిరమణకు లొంగినపక్షంలో రాఫాలోకి చొరబడటం ఇక అసాధ్యమైపోతుంది. ఆ నగరం సంగతి తేల్చకుండానే ఇజ్రాయెల్‌ సైనికులు వెనక్కుమళ్ళాల్సిరావచ్చు. అందువల్లనే, రాఫా విషయంలో రాజీపడవద్దనీ, యుద్ధంలో మనదే విజయమని రేప్పొద్దున ప్రజలకు చెప్పుకోవాలంటే అందులోకి చొరబడి, హమాస్‌ను ఊచకోతకోయాల్సిందేనని నెతన్యాహూ మీద ఆయన మిత్రపక్షాలు తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాయట. రాఫాలోకి అడుగుపెట్టవద్దంటూ హమాస్‌ చేస్తున్న హెచ్చరికలకు, అంతర్జాతీయ ఒత్తిళ్ళకు లొంగితే రచ్చగెలిచి ఇంట ఓడిపోతానని నెతన్యాహూ నమ్ముతున్నారనీ, శాంతియత్నాలు, హమాస్‌తో సంధి ఆయనకు ఈ దశలో ఇష్టంలేదని వార్తలు వస్తున్నాయి. అందువల్ల హమాస్‌మీద ఒత్తిడి తేవడానికి కాక, దానిని రెచ్చగొట్టడానికే చర్చలు ఫలించబోతున్న ఆఖరుదశలో నెతన్యాహూ రాఫా మీద పడ్డారని ఓ వాదన. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్‌ తన దగ్గరున్న బందీలందరి అప్పగింత, గాజాలోని పలుప్రాంతాలనుంచి ఇజ్రాయెల్‌ దశలవారీ ఉపసంహరణ ఉంటాయని ఖతార్‌ ఎప్పటినుంచో అంటోంది. శాశ్వత కాల్పులవిరమణ, గాజానుంచి ఇజ్రాయెల్‌ పూర్తిగా వెనక్కుపోవడం, నిరాశ్రయులైనవారంతా తిరిగి ఇళ్ళకు చేరడం వంటివి హమాస్‌ ప్రధానంగా డిమాండ్‌ చేస్తోంది. ఇప్పుడు హమాస్‌ సరేనన్న ఒప్పందంలో ఏయే అంశాలున్నాయో, వాటికి ఇజ్రాయెల్‌ అంగీకరిస్తుందో లేదో తెలియదు. నెతన్యాహూ యుద్ధకండూతికి వ్యతిరేకంగా ఇంటాబయటా రేగుతున్న ఆగ్రహం ఇప్పటికే తీవ్రస్థాయికి చేరుకుంది. రాఫాను వదిలి, కాల్పుల విరమణకు సరేనని, బందీలను విడిపించుకున్న పక్షంలోనే ప్రజలు ఆయనను క్షమిస్తారు.

Updated Date - May 07 , 2024 | 04:59 AM