Share News

బాధ్యతారాహిత్యం

ABN , Publish Date - Apr 24 , 2024 | 05:40 AM

రాజస్థాన్‌లోని బన్స్‌వారాలో ఏప్రిల్ 21వ తేదీన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్న మాటలు సామాన్యమైనవి కావు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాక, అనేక ప్రజాస్వామిక, హక్కుల సంఘాలు కూడా...

బాధ్యతారాహిత్యం

రాజస్థాన్‌లోని బన్స్‌వారాలో ఏప్రిల్ 21వ తేదీన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్న మాటలు సామాన్యమైనవి కావు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాక, అనేక ప్రజాస్వామిక, హక్కుల సంఘాలు కూడా ఆ మాటల మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయంటే, అందులో ఆశ్చర్యమేమీ లేదు. చిన్నస్థాయి నాయకులు ఎవరన్నా అటువంటి వ్యాఖ్యలు చేయడం ఆనవాయితీ అయిపోయింది కానీ, సాక్షాత్తూ నరేంద్రీమోదీయే ఇంతటి తీవ్రంగా మాట్లాడడం ఆయన అభిమానులకు, బీజేపీ శ్రేణులకు కూడా జీర్ణం కావడం లేదు. పెద్ద పెద్ద పదవులలో ఉన్నవారు, దేశానికి, భారత సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు ఇట్లా మాట్లాడి, తమ గౌరవాన్ని తగ్గించుకోవడం, దేశప్రతిష్ఠను దిగజార్చడం అన్యాయమని మేధావులు, పౌరసమాజం ప్రముఖులు ఆవేదన చెందుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, అది సంపదనంతా ముస్లిములకు పంచిపెడుతుందని మోదీ అన్నారు. పిల్లలెక్కువగా కనేవాళ్ళు, చొరబాటుదార్లు, అని కూడా ముస్లిములను దృష్టిలో పెట్టుకుని మోదీ వ్యాఖ్యానించారు. సంపదను ముస్లిములకు పంచిపెట్టడమనే వాదనకు మూలం, ప్రస్తుత ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోలో ఉన్నదేమో అనుకుంటే పొరపాటు. ఎప్పుడో పద్ధెనిమిది సంవత్సరాల కిందట అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ జాతీయాభివృద్ధి మండలిలో చేసిన వ్యాఖ్యలను విచిత్రంగా అన్వయించి, మోదీ తన వాదనకు ఉపయోగించుకున్నారు. షెడ్యూల్డు కులాలు, తెగలు, మైనారిటీలు, స్త్రీలు, పిల్లలు, ఈ శ్రేణుల అభివృద్ధి కోసం చేయవలసిన ప్రణాళికారచన గురించి, మౌలికసదుపాయాల కల్పన గురించి ప్రస్తావిస్తూ, మన్మోహన్ సింగ్, అభివృద్ధి ఫలాలలో మైనారిటీలు న్యాయమైన భాగం పొందడానికి సృజనాత్మకంగా పథకరచన చేయాలని అన్నారు. వనరులను ప్రాధాన్య ప్రాతిపదికన పొందే హక్కు వారికి ఉండాలని కూడా అన్నారు. ఆ మాటలనే ఇప్పుడు తన తీవ్ర వ్యాఖ్యలకు ఇంధనంగా ఉపయోగించుకున్నారు. మన్మోహన్ మాటలకూ, మోదీ వ్యాఖ్యానానికీ ఏమైనా పొంతన ఉన్నదా అని ఆశ్చర్యం కలుగుతున్నది. మరుసటి రోజు కేంద్రహోంమంత్రి అమిత్ షా మరో సభలో మాట్లాడుతూ, వనరుల మీద మొదటి హక్కు ఆదివాసులకు, దళితులకు, ఓబీసీలకు ఉన్నదని వ్యాఖ్యానించారు. ముస్లిములను ఆయన మినహాయించారు. మోదీ తాను అన్న మాటలు అప్రదిష్ఠ కలిగిస్తాయని గుర్తించారో ఏమో తన వ్యక్తిగత వెబ్‌సైట్‌లో వాటిని తొలగించి, తక్కిన ప్రసంగం పోస్ట్ చేశారు. తరువాత రోజు కాంగ్రెస్ పార్టీ మీద మరోసారి అటువంటి ఆరోపణే చేశారు. ప్రజల దగ్గర ఉన్న ఆస్తులను, బంగారాన్ని, నగలను ఆ పార్టీ లాగేసుకుంటుందని, దానిది మావోయిస్టు తరహా అని స్త్రీలను భయభ్రాంతులను చేసే విధంగా నిందించారు. కులగణనలో భాగంగా సామాజికార్థిక వివరాలను సేకరిస్తారనే కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రస్తావనను, ఆస్తుల వివరాలను సేకరించి అపహరిస్తారనే విధంగా వ్యాఖ్యానించారు. విమర్శించడం వేరు. వక్రీకరించడం వేరు.

సమాజంలోని ఒక వర్గం మీద తక్కిన ప్రజలకు ద్వేషాన్ని, వ్యతిరేకతను పెంచే వ్యాఖ్యలను ఎప్పుడూ ఎవరూ చేయకూడదు. ఎన్నికలప్రచారంలో భాగంగా అసలే చేయకూడదు. ప్రజాప్రాతినిధ్యచట్టం సెక్షన్ 123(3), 123(3ఎ) ప్రకారం మతం, జాతి, కులం, భాష తదితర ప్రాతిపదికలమీద ఓటు వేయమని కానీ, వేయవద్దని కానీ చెప్పడం నేరం, పౌరులలో ద్వేషభావాన్ని, శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం శిక్షార్హం. నేరం నిరూపణ జరిగితే, ఎన్నికలలో పోటీచేయకుండా ఆరేళ్లపాటు నిషేధించే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం నిర్దేశించే నమూనా ప్రవర్తనా నియమావళి ప్రకారం కూడా, ప్రజలలో ఇప్పటికే ఉన్న వైషమ్యాలను పెంచడం కానీ, కొత్తవి కల్పించడం కానీ అనైతికం. చట్టాన్ని, నియమావళిని కూడా ఉల్లంఘించిన ఆరోపణలను స్వయంగా ప్రధానమంత్రి ఎదుర్కొనవలసిరావడం విచారకరం. ఈ విషయంలో ఇప్పటిదాకా ఎన్నికల సంఘం స్పందన కర్తవ్యనిష్ఠకు తగినట్టుగా కనిపించడం లేదు. మునుముందు ఎట్లా వ్యవహరిస్తుందో చూడాలి. దేశవ్యాప్తంగా ఈ వివాదం మీద వ్యక్తమవుతున్న ఆందోళనను గమనిస్తే, న్యాయవ్యవస్థ కూడా కల్పించుకోవలసిన పరిస్థితి రావచ్చుననిపిస్తుంది.

ఈ సారి బీజేపీ అభ్యర్థుల ఎంపికలో కొన్ని జాగ్రత్తలు పాటించి, గతంలో హద్దుమీరి మాట్లాడిన, వ్యవహరించిన వివాదాస్పదులైన నాయకులను పక్కనపెట్టింది. మరి మోదీ ఇప్పుడు, రెండో దశ పోలింగ్ ముందు ప్రచారంలో ఎందుకిటువంటి తీవ్ర ప్రచారానికి పాల్పడినట్టు? మొదటి దశ పోలింగ్ తీరు నిరాశ కలిగించిందా? మొత్తంగా ఉత్తరాదిలో, ప్రజాస్పందన గత ఎన్నికలకు భిన్నంగా కనిపించిందా? ఓటింగ్ శాతాలు తక్కువగా ఉండడం బీజేపీకి అనుకూల సంకేతాలా? అనుకూల ఓటర్ల నిరాసక్తతా? ఈ ప్రశ్నలనేకం ఉత్పన్నమవుతున్నాయి. నిన్నటి దాకా 400 సీట్ల లక్ష్యం గురించి మాట్లాడినవారు, ఇప్పుడు అకస్మాత్తుగా కాంగ్రెస్ అధికారానికి వచ్చే అవకాశం గురించి ఎందుకు జనాలను హెచ్చరిస్తున్నట్టు? అంచనాలలో ఏమి మార్పు వచ్చింది? ఒకవేళ, కొంత ఎదురుగాలి వీస్తున్నట్టు అనిపించినా, భయాందోళనలతో చివరి నిమిషంలో బాధ్యతారహితమైన ప్రచారాలకు ఒడిగట్టడం, పదేళ్లకు పైగా అధికారంలో ఉన్న పార్టీ స్థాయికి తగినది కాదు.

Updated Date - Apr 24 , 2024 | 05:40 AM