Share News

నిక్షేపంగా ఇంటికి...

ABN , Publish Date - Feb 15 , 2024 | 05:33 AM

ఖతార్‌లో మూడునెలల క్రితం మరణశిక్ష పడిన భారత నౌకాదళ మాజీ అధికారులు అనూహ్యంగా, చడీచప్పుడూ లేకుండా స్వదేశానికి క్షేమంగా తిరిగిరావడం ఆశ్చర్యాన్నీ ఆనందాన్నీ కలిగించే...

నిక్షేపంగా ఇంటికి...

ఖతార్‌లో మూడునెలల క్రితం మరణశిక్ష పడిన భారత నౌకాదళ మాజీ అధికారులు అనూహ్యంగా, చడీచప్పుడూ లేకుండా స్వదేశానికి క్షేమంగా తిరిగిరావడం ఆశ్చర్యాన్నీ ఆనందాన్నీ కలిగించే పరిణామం. పెట్టిన కేసులు, అరెస్టులు, శిక్షలు ఇత్యాదివన్నీ ఎంత గోప్యంగా ఉన్నాయో, వారి రాకకూడా అదేవిధంగా జరిగిపోయింది. దోహ్రా టెక్నాలజీస్‌లో ఉద్యోగాలు చేసుకుంటూ, స్థానిక సైనిక సిబ్బందికి శిక్షణనిచ్చే పనిలో ఉన్న వీరు ఇజ్రాయెల్‌ తరఫున గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణతో 2022లో అరెస్టుకావడంతో వారు ప్రాణాలతో బయటపడతారా, కనీసం జైలుశిక్షకు పరిమితమైనా అవుతారా? అన్న అనుమానాలు అందరినీ వెంటాడాయి. న్యాయస్థానాల్లో పోరాటాలనుంచి, దౌత్యయత్నాల వరకూ ప్రతీ అడుగూ జాగ్రత్తగా వేస్తూ మృత్యుముఖంలోకి వెళ్ళిన వీరందరినీ నిక్షేపంగా ఒడ్డునపడేసిన మన ప్రభుత్వాన్ని కచ్చితంగా అభినందించాల్సిందే.

గూఢచర్యం ఆరోపణ కనుక వారికి మరణశిక్షపడింది, ఆ తరువాత రెండుదశల న్యాయపోరాటాలతో మరణశిక్ష తప్పి, చివరకు యావజ్జీవం మిగిలింది. అప్పీల్స్‌ కోర్టు శిక్షను మార్చింది తప్ప, నిర్దోషులని ప్రకటించలేదు. ఆ తరువాత ఏమైనా న్యాయప్రక్రియలు కొనసాగాయో లేదో తెలియదు కానీ, మరోపక్క వారి విడుదల కోసం సాగిస్తున్న దౌత్యయత్నాలు తీవ్రమైనాయి. బహుశా ఈ కేసు దృష్టితోనే గత ఏడాది అక్కడి భారత రాయబారిని కూడా మన ప్రభుత్వం మార్చివుంటుంది. వీరిని కాపాడుకోవడమే ఏకైక ఎజెండాగా ఏడాదికాలంగా భారత విదేశాంగశాఖ అదేపనిగా కృషిచేస్తుంటే, జాతీయ భద్రతాసలహాదారు తన పరిచయాలను, శక్తియుక్తులను వాడుతూంటే, డిసెంబరులో కాప్‌ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఖతార్‌ అమీర్‌తో భేటీ అయిన ఘట్టం కూడా సాయపడి ఎట్టకేలకు వీరికి విముక్తి లభించింది. వారు దేశంలో కాలూనిన మర్నాడే ఖతార్‌లో భారత ప్రధాని పర్యటించబోతున్నట్టుగా మన విదేశాంగశాఖ ప్రకటన వెలువడింది. అరబ్‌ ఎమిరేట్స్‌ పర్యటన, ఆలయ ఆరంభం మాత్రమే అప్పటివరకూ ప్రధాని కార్యక్రమాల్లో ఉండగా, ఆఖరునిముషంలో ఖతార్‌ను కూడా చేర్చి, ఆ దేశం ఎమీర్‌కు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియచేయాలని మోదీ అనుకొని ఉండవచ్చు.

ఈ వ్యవహారంలో మన విదేశాంగశాఖ కృషి, మోదీ వ్యక్తిగతంగా చేసిన ప్రయత్నాలు విశేషమైనవి. ఖతార్‌తో దశాబ్దాలుగా ఉన్న ఆర్థిక, వ్యాపార బంధం తెలిసిందే. గతంలో మిగతా అరబ్‌దేశాలు దానిని బాయ్‌కాట్‌ చేసినప్పుడు కూడా భారతదేశం అండగా నిలబడింది. ఎనిమిదిలక్షల మంది భారతీయులు అక్కడ నిర్భయంగా పనిచేసుకుంటూ, స్వదేశానికి పెద్ద ఎత్తున డబ్బు పంపగలుగుతున్నారు. వేలాది భారతీయ కంపెనీలు అక్కడ పనిచేస్తున్నాయి. ఏటా పదహారు బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం సాగుతోంది. అప్పుడప్పుడు కొన్ని పొరపొచ్చాలు వచ్చినా, ఖతార్‌తో సంబంధాలు ఎన్నడూ ఘర్షణ పడాల్సిన స్థాయికి చేరలేదు. ఈ కారణంగానే, ఈ ఎనిమిది అధికారుల విషయంలో అన్యాయం జరిగిందని అనిపించినప్పటికీ అంతర్జాతీయ జోక్యాన్ని భారత్‌ కోరుకోలేదు, ఖతార్‌మీద మాటలతో విరుచుకుపడలేదు. పశ్చిమాసియాలోని ఈ విశ్వసనీయమైన మిత్రదేశంతో సున్నితంగా వ్యవహరిస్తూ అనుకున్నది అంతిమంగా సాధించింది. ఖతార్‌లోని అన్ని రంగాల్లోనూ భారతీయులు విస్తరించి ఉండటం, ముఖ్యంగా అక్కడి సైనికరంగంలో మనవారు అధికంగా ఉండటం పాకిస్థాన్‌ సహించలేకపోతున్నదని, మన అధికారులను గూఢచర్యం కేసులో ఇరికించడంలో దాని పాత్ర ఉండవచ్చునని కొందరి అనుమానం.

భారతదేశం దిగుమతిచేసుకొనే ద్రవీకృత సహజవాయువు (ఎల్‌ఎన్‌జీ)లో నలభైశాతం ఖతార్‌ నుంచే అందుతున్నది. 1999లో ఉభయదేశాల మధ్యా గ్యాస్‌ సరఫరాకు సంబంధించి కుదర్చుకున్న ఒప్పందం 2028తో ముగిసిపోతుంది. ఐదేళ్లముందుగానే ఆ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాల్సి ఉండగా, ఆ గడువు కూడా గత ఏడాది డిసెంబరుతో పూర్తయింది. ఈ విషయంలో ఎంతో ముందునుంచే ఖతార్‌ మనవెంటపడుతోంది. ఎట్టకేలకు, వారంక్రితమే, 2048వరకూ అమలులో ఉండే 78 బిలియన్‌ డాలర్ల విలువైన అతిపెద్ద గ్యాస్‌ ఒప్పందం ఉభయదేశాల మధ్యా కుదిరిన నేపథ్యంలో, ఈ ఒప్పందానికీ అధికారుల విడుదలకూ మధ్య ఏమైనా సంబంధం ఉన్నదా? అన్న అనుమానాలు, చర్చలు జరగడం సహజం. తెరవెనుక వ్యవహారాలు తెలియడం కష్టం కానీ, మనవారు క్షేమంగా వెనక్కువచ్చినందుకు మాత్రం సంతోషించాల్సిందే.

Updated Date - Feb 15 , 2024 | 05:33 AM