Share News

కార్మిక కష్టానికి ప్రభుత్వ ఆసరా కావాలి!

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:39 AM

గత ప్రభుత్వ పదేండ్ల పాలనలో తమ కష్టాలు పరిష్కారం కావాలని ఆర్టీసీ, అంగన్‌వాడి, ఆశ, మున్సిపాలిటీ, పంచాయతీ, కేజీబీవీ తదితర రంగాల కార్మికులు సమ్మెలు ఆందోళనలు చేశారు. కానీ గత ప్రభుత్వం సమ్మె చేస్తున్న కార్మికులను పిలిచి చర్చలు చేయకపోగా, పనికిమాలిన సంఘాలంటూ అవమానపరిచింది, స

కార్మిక కష్టానికి ప్రభుత్వ ఆసరా కావాలి!

గత ప్రభుత్వ పదేండ్ల పాలనలో తమ కష్టాలు పరిష్కారం కావాలని ఆర్టీసీ, అంగన్‌వాడి, ఆశ, మున్సిపాలిటీ, పంచాయతీ, కేజీబీవీ తదితర రంగాల కార్మికులు సమ్మెలు ఆందోళనలు చేశారు. కానీ గత ప్రభుత్వం సమ్మె చేస్తున్న కార్మికులను పిలిచి చర్చలు చేయకపోగా, పనికిమాలిన సంఘాలంటూ అవమానపరిచింది, సమ్మె చేస్తారా అని చీదరించుకున్నది. గత ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి కార్మికుల సమస్యల పట్ల, సమ్మెల పట్ల, ట్రేడ్ యూనియన్ల పట్ల కఠినంగా, అసహనంతో, పెత్తందారి పోకడలతో వ్యవహరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను నిర్ధాక్షిణ్యంగా అణిచివేశారు. యూనియన్లే లేకుండా చేశారు. ఆ పదేళ్ల కాలంలో వినతి పత్రాలను కూడా స్వీకరించలేదు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో కార్మికులకు లబ్ధి చేకూరుతుందని కార్మికులు భావిస్తున్నారు. కానీ రాష్ట్రంలో కోట్లాదిమంది అసంఘటిత కార్మికులు, లక్షలాదిమంది కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ కార్మికుల బతుకులు మార్చేందుకు ప్రభుత్వ పెద్దలు గానీ అధికారులు గానీ ఇంకా సిద్ధమైనట్టు కనిపించడం లేదు. ఎందుకంటే జనవరి 29న కాంగ్రెస్ ప్రభుత్వం 73వ షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్ కనీస వేతనాల సవరణ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం శాస్త్రీయత, హేతుబద్ధత లేకుండా జరిగింది. గత ప్రభుత్వం కేవలం ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెరిగిన సిపిఐ (consumer price index) పాయింట్లపై ఆధారపడి పాత జీవోలకు వి.డి.ఎ.ను (వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్) కలిపి లెక్కిస్తూ అశాస్త్రీయంగా వేతన జీవో నోటిఫికేషన్ విడుదల చేసేది. 12 నుంచి 18 సంవత్సరాల కిందట నిర్ణయించిన జీవోలను అప్‌డేట్ చేయకుండా యథాతథంగా వి.డి.ఎ కలిపి వేతనాలు ఫిక్స్ చేస్తూ చేతులు దులుపుకోవడం సరైనది కాదు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోల ప్రకారం కనీస వేతనం ధరలకు అనుగుణంగా లేకపోవడం వల్ల కోట్లాదిమంది కార్మికులు ఆందోళనలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఇస్తున్న వేతనాల కన్నా తక్కువగా చట్టంలో పొందుపరచటం సరైంది కాదు. ప్రభుత్వం విడుదల చేసిన రైస్ మిల్లుల జీవో 86 ప్రకారం అన్‍స్కిల్డ్ వారికి రోజు కూలి రూ.456గా, ఇంజన్ డ్రైవర్‌కు రూ.12,440గా సూచించారు. కానీ క్షేత్రస్థాయిలో రోజు కూలికి రూ.500, ఇంజిన్ డ్రైవర్‌కు రూ.14 వేలకు పైగా చెల్లిస్తున్నారు. క్షేత్రస్థాయి వేతనాల కంటే జీవోలో తక్కువ వేతనాలు నిర్ధారించటం అన్యాయం! 29 నెలల క్రితం మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు కనీస వేతనం రూ.21,253గా తీర్మానించింది. దీనిని గెజిట్ చేయాలని సలహా ఇవ్వటం జరిగింది. దీని ప్రకారం కనీస వేతనం రూ.21,220 ఫైనల్ చేస్తూ కొత్త జీవోలను తయారు చేసి గెజిట్ ముద్రించి కార్మికులకు న్యాయం చేయాలని కార్మిక లోకం ఆశిస్తున్నది.


బాలిక విద్య తక్కువ ఉన్న మండలాల్లో కేంద్ర రాష్ట్రాల జాయింట్ పథకమైన కస్తూరిబా బాలికల విద్యాలయాలలో రాష్ట్ర వ్యాప్తంగా 5000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి ప్రభుత్వం కనీస వేతనాలను చెల్లించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కేజీబీవీలో పని చేస్తున్న కార్మికులకు నెలకు రూ.14వేల వేతనం చెల్లిస్తుంటే, ఇక్కడ రూ.8 వేలకు మించి వేతనం ఇవ్వడం లేదు. ఈఎస్ఐ, పిఎఫ్, హెల్త్ కార్డులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లాంటి ఏ సౌకర్యాలు కల్పించకుండా వారితో బండ చాకిరీ చేయిస్తున్నారు. వీరి సమస్యలపై ఈ ప్రభుత్వమైనా దృష్టి సారించాలి.

రాష్ట్రంలో 27వేల మందికి పైగా ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం అయ్యేవరకు తల్లిని బిడ్డను క్షేమంగా చూసుకునే ప్రధాన బాధ్యత ఆశాలదే. ఇదే కాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న అనేక కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్ళే పని వారిదే. అలాంటి వీరికి రోజుకు రూ.300 వేతనం ఇచ్చి పని చేయించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా మన ఆశలకు కూడా వేతనాలు పెంచాల్సిన తక్షణ కర్తవ్యం ప్రభుత్వంపై ఉంది.

రాష్ట్రంలో 12,769 గ్రామపంచాయతీలు, 129 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లలో సుమారుగా లక్ష మందికిపైగా పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. సూర్యోదయం కంటే ముందు లేచి దుమ్ము పీలుస్తూ దుర్గంధం మధ్య పని చేస్తున్న వీరికి పని గంటలు అమలు కావటం లేదు. పండగలు, రాజకీయ పర్యటనలు, మరేదైనా విపత్తులు వచ్చినప్పుడు రాత్రీ పగలూ అన్న తేడా లేకుండా వీరితో అదనపు పని చేయించుకుంటున్నారు. పైగా రాష్ట్రంలో మూడు నుంచి ఏడు నెలలుగా అనేక పంచాయతీలలో కార్మికులకు వేతనాలు అందలేదు. గ్రామ పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత, ప్రతినెల క్రమ తప్పకుండా వేతనాలు, పెరుగుతున్న ధరలకు తగినట్టుగా వేతనాలు పెంచుతామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ హామీ నెరవేరుతుందని కార్మికులు ఆశతో ఎదురుచూస్తున్నారు.


కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ స్కీమ్ అయిన అంగన్‌వాడీల్లో మన రాష్ట్రంలో 70వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పేద మహిళలకు, బాల బాలికలకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించే గొప్ప పథకం ఇది. కానీ ప్రభుత్వాల అలసత్వం వల్ల, కేటాయిస్తున్న నిధుల వల్ల రోజు రోజుకీ ఈ వ్యవస్థ బలహీనపడుతోంది. కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీలను నిర్వీర్యం చేసే విధానాలు తీసుకొస్తుంటే రాష్ట్రంలో గత ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించకుండా మరింత వేగంగా వాటిని అమలు చేసింది. గతంలో కేసీఆర్ అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చుడే తప్ప అటువైపు కార్యచరణ ఊసే లేదు. ఈ ప్రభుత్వమైనా రెగ్యులర్ చేసేంతవరకు కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత సౌకర్యాలను కల్పించాలి.

అంగన్‌వాడీ టీచర్లకు ప్రభుత్వం సరైన వేతనం ఇవ్వకపోగా ఆసరా కళ్యాణ లక్ష్మి తదితర ప్రభుత్వ పథకాలు వీరికి వర్తించకుండా నిబంధనలు పెట్టారు. రకరకాల ప్రభుత్వ సర్వేలు, పనులు, అనేక యాప్స్ తీసుకొచ్చి వీరిపై తీవ్ర పని ఒత్తిడి మోపారు. అంగన్‌వాడీలకు సేవ అందించి వయసు పైబడిన ఉద్యోగులను ఎలాంటి రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇంటికి పంపిస్తున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీరి సమస్యల పరిష్కారానికి కార్యచరణ చేపడుతుందని ఎదురుచూస్తున్నారు.

రాష్ట్రంలో 30వేల చేనేత కార్మికుల కుటుంబాలు ఉన్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వం వారికి బతుకమ్మ చీరల బకాయిలు సుమారు రూ.300కోట్లు వరకు చెల్లించలేదు. కార్మికులకు నేరుగా రావాల్సిన దారం సబ్సిడీని కూడా ఇవ్వలేదు. కార్మికుల పొదుపు సొమ్ముకు మ్యాచింగ్ గ్రాంట్స్, విద్యుత్ సబ్సిడీలు చెల్లించకుండా బకాయి పెట్టింది. దీంతో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 17శాతం పెంచింది. ఫలితంగా చేనేత పరిశ్రమ సంక్షోభంలో పడింది. ప్రభుత్వం నేతన్నలను ఆదుకునేందుకు సకాలంలో చర్యలు తీసుకోలేదు. ఆ కార్మికులు ఐక్యంగా సమ్మె చేశారు. ఈ సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దానిని అమలుకు పూనుకోవాలి. అనేక కష్టనష్టాలు కూర్చి సమస్త ఉత్పత్తులను పెంచుతున్న కార్మిక వర్గం కష్టాలను ప్రభుత్వాలు పట్టించుకోకుంటే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది.


వివిధ ప్రభుత్వ శాఖలో సుమారు మూడు లక్షల మంది కాంట్రాక్ట్ ఔట్‌ సోర్సింగ్ కార్మికుల పని చేస్తున్నారు. వీరందరినీ రెగ్యులరైజ్ చేస్తామని అనేక పార్టీలు, ప్రభుత్వాలు హామీలు ఇస్తూ వస్తున్నాయి. కానీ కార్యచరణలో ముందడుగు వేయటం లేదు. దశాబ్దాలుగా ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న వీరు ఉద్యోగ భద్రత, రెగ్యులరైజేషన్, సమాన పనికి సమాన వేతనం లాంటి డిమాండ్లను తీర్చాలని వివిధ సందర్భాల్లో విజ్ఞప్తి చేస్తున్నారు. హామీలు ఇచ్చుడే తప్ప వారి సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రభుత్వం చొరవ చూపటం లేదు. ఇకనైనా ప్రభుత్వరంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ కార్మికులనందరినీ రెగ్యులర్ చేసేందుకు ఇందిరమ్మ రాజ్యం పూనుకోవాలి.

ఐఎఫ్‌టియు రాష్ట్ర నాయకులుప్రభుత్వం విడుదల చేసిన రైస్ మిల్లుల జీవో 86 ప్రకారం అన్‌స్కిల్డ్‌ వారికి రోజు కూలి రూ.456గా, ఇంజన్ డ్రైవర్‌కు రూ.12,440గా సూచించారు. కానీ క్షేత్రస్థాయిలో రోజు కూలికి రూ.500, ఇంజిన్ డ్రైవర్‌కు రూ.14 వేలకు పైగా చెల్లిస్తున్నారు. క్షేత్రస్థాయి వేతనాల కంటే జీవోలో తక్కువ వేతనాలు నిర్ధారించటం అన్యాయం!

అవుల అశోక్

Updated Date - Apr 27 , 2024 | 04:39 AM