Share News

ప్లాస్టిక్‌పై విఫలపోరు

ABN , Publish Date - May 09 , 2024 | 05:51 AM

ప్లాస్టిక్‌ని భూతం అంటాం కానీ, దాన్ని అంతం చేయడానికి మాత్రం మనసొప్పడం లేదు. ప్లాస్టిక్‌ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలన్న సదాశయంతో రెండేళ్ళక్రితం ప్రపంచదేశాల మధ్య ఒక ప్రయత్నం ఆరంభమైంది....

ప్లాస్టిక్‌పై విఫలపోరు

ప్లాస్టిక్‌ని భూతం అంటాం కానీ, దాన్ని అంతం చేయడానికి మాత్రం మనసొప్పడం లేదు. ప్లాస్టిక్‌ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలన్న సదాశయంతో రెండేళ్ళక్రితం ప్రపంచదేశాల మధ్య ఒక ప్రయత్నం ఆరంభమైంది. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉన్న 175దేశాల ప్రతినిధులతో ఒక ఉన్నతస్థాయి కమిటీ ఏర్పడి, ఈ ఏడాది చివరకల్లా ప్లాస్టిక్‌ విషయంలో ఒక విధాన నిర్ణయానికి రావాలని సంకల్పించాయి. ఇప్పటివరకూ మూడువిడతల చర్చలు జరిగినప్పటికీ ఈ భూతాన్ని అంతం చేసి భవిష్యత్తును కాపాడుకొనే విషయంలో ఈ దేశాలు ఒకేతాటిపైకి రాలేకపోయాయి. గతవారం కెనడాలో నాలుగోవిడత చర్చలు కూడా విఫలం కావడాన్ని బట్టి ప్లాస్టిక్‌ పరిశ్రమకు రాజకీయంగా,ఆర్థికంగా ఎంతబలం ఉన్నదో అర్థమవుతుంది.


దక్షిణకొరియాలో ఈ నవంబరులో మరోవిడత చర్చలు జరగబోతున్నప్పటికీ, ఈ ఏడాది ముగిసేలోగా ‘గ్లోబల్‌ ప్లాస్టిక్స్‌ ట్రీటీ’ సాధ్యమయ్యే అవకాశాలైతే లేవు. ప్లాస్టిక్‌ ఉత్పత్తిని తగ్గించడం, భారీ వ్యర్థాలను మిగల్చేచోట్ల తయారీని పూర్తిగా మానివేయడం, ఉత్పత్తిలో భాగంగా హానికర రసాయనాల వాడకాన్ని ఆపివేయడం, హెచ్చుస్థాయిలో రీసైక్లింగ్‌ లక్ష్యాలను నిర్ణయించుకోవడం ఇత్యాది అంశాల్లో నిర్దిష్టమైన గడువులను విధించుకోవాలన్నది ఈ దేశాల తాపత్రయం. ఏయే లక్ష్యాలను ఎప్పటిలోగా సాధించాలో తెలియచెబుతున్న ఒక ఆచరణసాధ్యమైన ఒప్పందాన్ని అన్నిదేశాలు కలసికట్టుగా సాధించగలిగితే అంతకంటే అద్భుతం మరొకటి లేదు. కానీ, సహజంగానే ఆర్థికం దీనికి అడ్డుపడింది. చమురు ఉత్పత్తి దేశాలతో పాటు దానిని భారీగా శుద్ధిచేస్తూ లాభపడుతున్న దేశాలు ఒక అవగాహనకు రాకుండా మోకాలడ్డుతున్నాయి. ప్లాస్టిక్‌ ఉత్పత్తిని నిలిపివేసే విషయంలో గడువులు విధించడాన్ని మిగతా కొన్ని దేశాలతో పాటు భారత్‌ కూడా వ్యతిరేకిస్తోందని వార్తలు వచ్చాయి. 2040ను లక్ష్యంగా పెట్టుకుంటే, ఇప్పటినుంచే ఆ దిశగా ప్రయత్నాలు ఆరంభించడం, లక్ష్యాన్ని సాధించడం సులువవుతుందని ఆఫ్రికన్‌ దేశాలతోపాటు, అనేక యూరోపియన్‌ దేశాలు కూడా భావించాయట. ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అంతం చేయాలంటే ప్రత్యామ్నాయాలను అభివృద్ధిపరచాలని, అవి తక్కువ ఖర్చుతో కూడుకున్నవై సులభంగా అందుబాటులో రావాలని భారత్‌ భావిస్తోంది. సదరు ప్రత్యామ్నాయాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధిపరచడంతో పాటు అది సులభంగా మిగతాదేశాలకు బదిలీకావాలని కూడా భారత్‌ అంటోంది. ఉమ్మడి లక్ష్యమే అయినప్పటికీ ధనికదేశాలు, అధిక ఉత్పత్తిదేశాలు ఎక్కువ బాధ్యతలను పంచుకోవాలన్నది ప్రతిపాదన.


ప్లాస్టిక్‌ కాలుష్యం మీద అన్ని దేశాలదీ ఒకే అభిప్రాయం. మానవ మనుగడను ప్రమాదంలో పడేస్తున్న దీనిని పూర్తిగా నిషేధించుకోవాలన్న విషయంలోనూ భేదాభిప్రాయాలు లేవు. కానీ, లక్ష్యసాధన దిశగా అడుగులు ఎలావేయాలన్న విషయంలో ఒక్కమాట సాధ్యపడటం లేదు. పెట్రో కెమికల్‌ పరిశ్రమ బలంగా ఉన్నదేశాలు ప్లాస్టిక్‌ తయారీమీద నియంత్రణలు విధించాలన్న ప్రతిపాదనను ఏమాత్రం పడనీయడం లేదు. అభివృద్ధి చెందుతున్నదేశాలకంటే ధనికదేశాల్లో ప్లాస్టిక్‌ పరిశ్రమ వెలిగిపోతున్నది కనుక అవి ప్రతీ ఆలోచనకూ అడ్డుపడుతున్నాయి. పేదదేశాలతో పోల్చితే అభివృద్ధిచెందిన దేశాల్లో మరిన్ని వందల రకాల ప్లాస్టిక్‌ ఉత్పత్తుల వినియోగం అధికంగా ఉంటూ, అక్కడి జనజీవనంతో మిళితమైపోయాయి. వినియోగరంగాన్ని, ఆర్థికాన్ని ప్లాస్టిక్‌ శాసిస్తోంది.

ప్లాస్టి్క్స్‌ ఒప్పందం ప్రతిపాదన ముందుకు కదిలిన 2022లో భారతదేశం 19రకాల సింగిల్‌ యూజ్‌ ప్లాస్టి్క్స్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. మరిన్నింటిని కూడా చేర్చవలసిన అవసరం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శించిందని అప్పట్లోనే పర్యావరణ ఉద్యమకారులు విమర్శించారు. ఆ తరువాత కాలంలో ఈ నిషేధం కూడా దేశవ్యాప్తంగా ప్రభావవంతంగా అమలుజరగలేదు. మట్టిలో కలవదనీ, మనిషిప్రాణానికి మహాప్రమాదకారనీ, పర్యావరణాన్ని నాశనం చేస్తోందనీ ప్లాస్టిక్‌ గురించి భయపడని క్షణం లేదు, తిట్టుకోనిరోజు ఉండదు. దాని తయారీ భూతాపాన్ని తీవ్రంగా హెచ్చిస్తోంది. ప్లాస్టిక్ ఉత్పత్తి ఏయేటికాయేడు పెరిగిపోతూ, ఏటా మరింత చెత్త చేరుతూంటే, మొత్తం ప్లాస్టిక్స్‌లో పదోవంతు కూడా రీసైకిల్‌ కావడం లేదు. ఈ విషవలయంనుంచి ప్రజలను రక్షించి ఒడ్డునపడేయాల్సిన ప్రభుత్వాలు ఇలా నిమ్మకునీరెత్తినట్టు ఉండటం విషాదం.

Updated Date - May 09 , 2024 | 05:51 AM