Share News

రాప్తాడులో రాక్షసత్వం!

ABN , Publish Date - Feb 20 , 2024 | 01:31 AM

అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ‘సిద్ధం’ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌ శ్రీకృష్ణమీద జరిగినదాడి పాలకుల నిరంకుశత్వానికి మరో రుజువు....

రాప్తాడులో రాక్షసత్వం!

అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ‘సిద్ధం’ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌ శ్రీకృష్ణమీద జరిగినదాడి పాలకుల నిరంకుశత్వానికి మరో రుజువు. వృత్తినిర్వహణలో భాగంగా సభను చిత్రీకరించిన ఈ ప్రతినిధి, ముఖ్యమంత్రి ప్రసంగం ఆరంభమైన కొద్దినిముషాల్లోనే ప్రజలు సభాప్రాంగణంనుంచి వెళ్ళిపోతున్న దృశ్యాలను కూడా కెమెరాలో బంధించాడు. దీనితో వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన మీద విరుచుకుపడ్డారు. జేబులోనుంచి ఐడీకార్డులాగి, ఆంధ్రజ్యోతి పేరు చూడగానే వీరావేశమెత్తిపోయారు. తమ చేతుల్లో ఉన్న వైసీపీ జెండా కర్రలతో అతడిని చావగొట్టారు. కర్రలతో కొడుతూ, కాళ్ళతో కుమ్ముతూ చాలాదూరం వరకూ వెంటాడి వేటాడారు. తీవ్రంగా గాయపడిన ఆ ఫోటోగ్రాఫర్‌ చివరకు సొమ్మసిల్లిపోవడంతో, ఒక పోలీసు అధికారి ఎత్తుకొని తన జీపులోకి చేర్చారు. ఆ ఫోటోగ్రాఫర్‌ కెమెరా, పర్సు, సెల్‌ఫోన్‌ ఇత్యాదివన్నీ లాక్కున్న వైసీపీ కార్యకర్తలు జీపుకు అడ్డుపడుతూ, ఆ పోలీసు అధికారిమీద కూడా దాడి యత్నం చేశారు. ఆఖరునిముషంలో, పోలీసువాహనంలో తరలించకపోయివుంటే ఈ ఫోటోగ్రాఫర్‌ ఆ ఉన్మాదుల చేతిలో ప్రాణాలుకోల్పోయేవాడేమో! మొదట అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో, పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఇప్పుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అతను చికిత్సపొందుతున్నాడు.

ఉత్తరాది రాష్ట్రాల్లో ‘మాబ్‌ లించింగ్‌’ ను ఈ ఉదంతం గుర్తుకు తెస్తున్నది. ముఖ్యమంత్రి సమక్షంలో, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్న సభలో జరిగిన ఈ మూకదాడి వీడియోను చూసి దేశం విస్తుపోయింది. పాత్రికేయ సంఘాలు తీవ్ర నిరసనను, ఆగ్రహాన్ని వ్యక్తంచేశాయి. జర్నలిస్టు ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసిన ఈ ఘటనకు నిరసనగా ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టు సంఘాలు ప్రదర్శనలు నిర్వహించాయి. ఇదేమీ యాదృచ్ఛికంగా జరిగిన దాడికాదు. పార్టీ సభల్లోనే కాదు, ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం సీఎం జగన్‌ ఆంధ్రజ్యోతి సహా కొన్ని మీడియా సంస్థలమీద అక్కసు వెళ్లగక్కుతూ, వాటిపై తాను యుద్ధం చేస్తున్నానని చెబుతూ కార్యకర్తలను రెచ్చగొడుతున్న పర్యవసానం ఇది. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అరెస్టునుంచి తప్పించుకోవడానికి గత ఏడాది మే నెలలో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి విశ్వభారతి ఆస్పత్రిలో తలదాచుకున్న విషయం తెలిసిందే. సీబీఐ అధికారులు అక్కడకు వచ్చారన్న ప్రచారం జరగడంతో, ఆ వార్తను నివేదించడానికి వెళ్ళిన ఆంధ్రజ్యోతి ప్రతినిధిని కడపజిల్లా వైసీపీ కార్యకర్తలు ఒక గదిలో నిర్బంధించి రాత్రంతా తీవ్రంగా కొట్టారు. అలాగే, కర్నూలులో పార్టీలోని రెండువర్గాల మధ్య పోరులో ఫ్లెక్సీలు చింపుకుంటున్న ఘటనను చిత్రీకరించినందుకు వైసీపీ కార్యకర్తలు ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌ మీద మూకుమ్మడి దాడిచేసి కర్రలతో కొట్టారు. ప్రజలకు సమాచారాన్ని అందించడం పాత్రికేయుల విధి. కానీ, తమకు వ్యతిరేకంగా రాస్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థల పేర్లు చెబుతూ, నిండుసభల్లో పేపర్లు ప్రదర్శిస్తూ సాక్షాత్తూ ముఖ్యమంత్రే రెచ్చగొడుతున్నందున అధినేత మనసెరిగిన కార్యకర్తలు ఇలా మీడియా మీద తెగబడుతున్నారు.

ముఖ్యమంత్రి సభలో ఒక పాత్రికేయుడిమీద దాడిజరగడం ఎన్నడూ లేదు. అంగళ్ళు ఘటనలో చంద్రబాబు ప్రమేయం లేకపోయినా పాలకులు కేసుపెట్టారు. ఇప్పుడు ఓ దుర్మార్గమైన దాడి తన సమక్షంలోనే చోటుచేసుకుంటే సీఎం మాట్లాడటం లేదు, పాలకపక్షం ఖండించడం లేదు, బాధితుడు ఫిర్యాదు చేస్తేనే కేసు పెడతామని పోలీసులు సైతం అంటున్నారు. తన మనోభిప్రాయానికి అనుగుణంగా కార్యకర్తలు వ్యవహరించినందుకు సీఎం సంతోషిస్తున్నట్టు ఉంది. ఇదేమీ ముఖ్యమంత్రి కుటుంబ కార్యక్రమం కాదు. ఒక బహిరంగసభలో మీడియా ప్రతినిధి ఫోటోలు తీయడం ఎలా తప్పవుతుందో పాలకులే చెప్పాలి. పార్టీ కార్యకర్తలు బరితెగించి ఒక జర్నలిస్టుమీద చేసిన ఈ దాడి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారపక్షం మరింత దుర్మార్గంగా వ్యవహరించబోతున్నదనడానికి సూచన. తమకు నచ్చనిదానిని రాసినా, చిత్రీకరించినా తీవ్ర శిక్షతప్పదన్న హెచ్చరిక, పాత్రికేయులను తమకు వ్యతిరేకంగా నోరువిప్పకుండా చేసే లక్ష్యం ఇందులో ఉంది. మీడియా మీదకు కార్యకర్తలను ఉసిగొల్పుతున్న సీఎం మీద రాజ్యాంగ సంస్థలు చర్యలు తీసుకోవాలి. న్యాయస్థానాలు సుమోటోగా విచారణ చేపట్టాలి. ప్రజాస్వామ్యంమీద, భావస్వేచ్ఛమీద, సమాచారాన్ని తెలుసుకొనే ప్రజల మౌలిక హక్కుమీద జరిగిన దాడి ఇది.

Updated Date - Feb 20 , 2024 | 01:31 AM