Share News

ప్రమాదకర రాజకీయం

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:39 AM

యాభైయేళ్ళక్రితం భారత్‌–శ్రీలంక మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంలో‌ భాగంగా పాక్‌ జలసంధిలోని కచ్చతీవు ద్వీపం శ్రీలంక అధీనంలోకి పోయింది. 1974జూన్‌లో ఇందిరాగాంధీ–సిరిమావో బండారునాయకే...

ప్రమాదకర రాజకీయం

యాభైయేళ్ళక్రితం భారత్‌–శ్రీలంక మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంలో‌ భాగంగా పాక్‌ జలసంధిలోని కచ్చతీవు ద్వీపం శ్రీలంక అధీనంలోకి పోయింది. 1974జూన్‌లో ఇందిరాగాంధీ–సిరిమావో బండారునాయకే చేసుకున్న ఈ స్నేహపూర్వక ఒప్పందం మనదేశానికి భద్రతాపరంగా పెద్ద నష్టాన్ని చేకూర్చిందని ప్రధాని నరేంద్రమోదీ ఇప్పుడు అంటున్నారు. కొత్త సత్యాలు బయటపడుతున్నాయనీ, దేశానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్‌ నిర్లక్ష్యంగా పొరుగుదేశానికి కట్టబెట్టిందని ఆయన ట్వీట్లు చేశారు. ఈ సార్వత్రక ఎన్నికల కాలంలో భారతీయ జనతాపార్టీ తమిళనాడు రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారంలో, ఐదుదశాబ్దాలుగా వెలుగుచూడని రహస్యాలు, దేశం నిర్ఘాంతపోయే సత్యాలు కొత్తగా ఏముంటాయన్నది అటుంచితే, పొరుగుదేశంతో దౌత్యసంబంధాలమీద విశేష ప్రభావం చూపే ఓ అంశంమీద ప్రధాని, విదేశాంగమంత్రీ వ్యాఖ్యలు చేయడం అమితాశ్చర్యం కలిగిస్తోంది. తమిళనాడులోని వివిధ రాజకీయపక్షాల మధ్య వాదోపవాదాలకు, కవ్వింపులకు పరిమితమవుతూన్న ఓ అంశం ఇప్పుడు ప్రధాని ప్రకటనతో, దానికి కొనసాగింపుగా ఈ దీవి విషయాన్ని తేలుస్తామంటూ విదేశాంగమంత్రి చేసిన వ్యాఖ్యతో అమితప్రాధాన్యం సంతరించుకుంది. నిర్మానుష్యమైన, తాగేందుకు గుక్కెడు మంచినీళ్ళు దొరకని ఓ అతిచిన్న ప్రాంతం ఎన్నికలపుణ్యమాని రెండుదేశాల మధ్య దూరాన్ని పెంచడానికి తోడ్పడితే ఎంతో ప్రమాదం.

తమిళనాడులో ఎలాగైనా కాలూనాలన్న తహతహ వల్ల కాబోలు, కచ్చతీవుకు సంబంధించి ఏదో కొత్తగా బయటపడిందని మోదీ అంటున్నారు. కానీ, తమిళనాట డీఎంకె, అన్నాడీఎంకెలకు ఈ అంశం దశాబ్దాలుగా రాజకీయాస్త్రంగా ఉపకరిస్తున్నదే. తమిళ మత్స్యకారులమీద శ్రీలంక దాష్టీకం ప్రదర్శించినప్పుడల్లా తమిళనాడులో రాజుకొనే వేడి ఇదే. కచ్చతీవును మనదేశం శ్రీలంకకు పూర్తిగా ఇచ్చేసిందా, ఒప్పందం ప్రకారం మనకున్న పరిమితమైన అధికారాలను సైతం ఆ దేశం ఎందుకు గౌరవించడం లేదు అన్న లోతైన చర్చను అటుంచితే, ఈ దీవిని వెనక్కు తెచ్చుకోవడం అసాధ్యమన్న విషయం ఇప్పటికే తేలిపోయింది. కచ్చతీవు అప్పగింత రాజ్యాంగవ్యతిరేకమని 2008లో జయలలిత సుప్రీంకోర్టులో కేసువేయడం, దానిని వెనక్కుతీసుకోవాలంటే యుద్ధం ఒక్కటే మార్గమని అటార్నీ జనరల్‌ పేర్కొనడం ప్రధానికి తెలియనివేమీ కావు.

మోదీ తొలివిడత పాలనలో బంగ్లాదేశ్‌తో చేసుకున్న ఓ ఒప్పందంతో కాంగ్రెస్‌ ఈ కచ్చతీవు ఒప్పందాన్ని పోలుస్తోంది. భారతదేశానికి చెందిన 111 చిన్నాచితకా భూభాగాలను బంగ్లాదేశ్‌కు ఇచ్చేస్తూ, ఈ సరిహద్దుల ఒప్పందం కేవలం భూమికి పరిమితమైనది కాదని, రెండు హృదయాల కలయికని మోదీ వ్యాఖ్యానించిన విషయాన్ని కాంగ్రెస్‌ గుర్తుచేస్తోంది. పదేళ్ళపాలన తరువాత, సరిగ్గా లోక్‌సభ ఎన్నికలముందు కచ్చతీవుతో ముడిపడిన దేశసమగ్రత, భద్రత ప్రధానికి గుర్తురావడం విశేషం. నెహ్రూ కూడా ఈ చిన్నదీవి విషయంలో పట్టింపులేనితనం ప్రదర్శించారని, ఒక సమావేశంలో పొరుగుదేశంతో సత్సంబంధాలకంటే ఈ చిన్నప్రాంతం తనకు ముఖ్యం కాదన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు గుర్తుచేస్తున్నారు. ఇందిరాగాంధీ ఎంతో నిర్లక్ష్యంగా ఈ కీలకమైన ప్రాంతాన్ని లంకకు ఇచ్చేశారని బీజేపీ పెద్దలు ఇంతగా బాధపడుతున్నప్పుడు, దానిని వెనక్కుతెచ్చుకొనే ప్రయత్నాలు ఇప్పటికే ఆరంభించివుంటే బాగుండేది. గౌతమ్‌ అదానీకి శ్రీలంకలో ఓ భారీ ప్రాజెక్టు ఇప్పించేందుకు మోదీ స్వయంగా ఫోన్‌ చేశారన్న ఆరోపణలను కొందరు ఇప్పుడు గుర్తుచేసుకుంటూ, నరేంద్రమోదీకి శ్రీలంక పాలకులతో బలమైన బంధాలున్నందున ఆయనే కనుక తలుచుకొనివుంటే కచ్చతీవు కథ ఈపాటికే ఓ కొలిక్కివచ్చేదని అంటున్నారు. దేశభద్రతకు అమితప్రాధాన్యం ఇచ్చేపాలకులకు కచ్చతీవు ఇంతకాలం గుర్తుకురాకపోవడం విచిత్రమే మరి. కాంగ్రెస్‌పార్టీ దేశాన్ని రక్షించలేకపోయిందనీ, పొరుగుదేశాల చొరబాట్ల నుంచి మనలను కాపాడలేకపోయిందనీ, దేశభద్రత విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ మన భూభాగాలను ఇతరులకు ధారాదత్తంచేసిందని బీజేపీ అనాదిగా వాదిస్తూ, కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలోకీ, ఇరకాటంలోకి నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. చైనా, పాకిస్థాన్‌తో ముడిపడిన విషయాల్లో ఎన్ని విమర్శలు చేసుకున్నా అంత ప్రమాదం ఉండకపోవచ్చును కానీ, ఇతర పొరుగుదేశాల విషయంలో మన మాటలు చేతలూ జాగ్రత్తగా ఉండక తప్పదు.

Updated Date - Apr 03 , 2024 | 02:39 AM