Share News

కాంగ్రెస్ మానిఫెస్టో : మోదీ కొత్త భాష్యం!

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:42 AM

ప్రధాన ప్రతిపక్షం అయిన భారత జాతీయ కాంగ్రెస్ పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపూర్వ సుహృద్భావాన్ని సహకార వైఖరిని చూపారు! ఇటీవల కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోను తిరగరాసి అందులో తన ఆంతరతమ (ఇన్నర్ మోస్ట్) ఆలోచనలు, భావాలను చేర్చే కార్య భారాన్ని ఆయన స్వచ్ఛందంగా తన మీద వేసుకున్నారు. మునుపెన్నడూ జరగని ఈ పని

కాంగ్రెస్ మానిఫెస్టో : మోదీ కొత్త భాష్యం!

ప్రధాన ప్రతిపక్షం అయిన భారత జాతీయ కాంగ్రెస్ పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపూర్వ సుహృద్భావాన్ని సహకార వైఖరిని చూపారు! ఇటీవల కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోను తిరగరాసి అందులో తన ఆంతరతమ (ఇన్నర్ మోస్ట్) ఆలోచనలు, భావాలను చేర్చే కార్య భారాన్ని ఆయన స్వచ్ఛందంగా తన మీద వేసుకున్నారు. మునుపెన్నడూ జరగని ఈ పని రాజకీయచర్చ గుణాధిక్యతను పెంచుతుందని ఆయన విశ్వసించారు. పాఠక మహాశయా, గతవారం చోటుచేసుకున్న సంచలనాత్మక రాజకీయ పరిణామంపై మహా ఉదార వైఖరితో నేను ఇవ్వగల వివరణ, చేయగల వ్యాఖ్య అది.

ఆ పరిణామం వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ఉన్నది. ఈ నెల 14న బీజేపీ మానిఫెస్టో విడుదలయింది. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని ఒక కమిటీ రూపొందించిన ఆ ఎన్నికల ప్రణాళిక పట్ల నరేంద్ర మోదీ ఏ మాత్రం సంతోషంగా లేరని రాజకీయ పరిశీలకులు మొదటి నుంచీ ఘంటాపథంగా చెప్పుతున్నారు. తాము రూపొందించిన మానిఫెస్టో ఒక రాజకీయ పార్టీ ఎన్నికల ప్రణాళిక కాదని అంగీకరిస్తూ ‘పార్టీకి కేంద్రంగా భాసిల్లుతున్న’ ఒక నాయకుడి ప్రజ్ఞా పాటవాలకు అది ఒక ప్రశంస అని రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలోని ఆ కమిటీ పేర్కొంది. ఆ డాక్యుమెంట్‌ను ‘మోదీకి గ్యారంటీ’ అని పేరు పెట్టడం ద్వారా నరేంద్ర మోదీ పట్ల తన విధేయతను ఆ కమిటీ ప్రదర్శించింది. అయితే మోదీ సరిగ్గానే ఊహించినట్టు, విడుదలయిన కొద్ది గంటలలోనే ‘మోదీకి గ్యారంటీ’ ఎటువంటి ఆచూకీ లేకుండా పోయింది. ఇప్పుడు బీజేపీ మానిఫెస్టో గురించి నరేంద్ర మోదీతో సహా ఏ ఒక్కరూ మాట్లాడటం లేదు.


నరేంద్ర మోదీ ‘మోదీకి గ్యారంటీ’ని ఒక చెత్త డాక్యుమెంట్‌గా కొట్టివేయలేరు. ఆ ప్రణాళికను రూపొందించిన కమిటీ అసమర్థంగా తన బాధ్యతను నిర్వర్తించిందని తప్పుపట్టలేరు. రాజ్‌నాథ్ సింగ్ నాయత్వంలోని కమిటీకి ఏవో అజ్ఞాత ఉద్దేశాలనూ ఆపాదించలేరు. ఇలా ఇరకాటంలో పడిన నరేంద్ర మోదీ కాంగ్రెస్ మానిఫెస్టోను తీసుకుని, ఆ ప్రణాళికపై తన వ్యాఖ్యానంతో దానికి మరింత ప్రచారాన్ని కల్పించి, పాఠక జనాన్ని మరింతగా పెంపొందించేందుకు నిర్ణయించుకున్నారు. మోదీ నిర్ణయం భారతీయ సారస్వత మహా సంప్రదాయాలకు అనుగుణంగా ఉన్నది. మన సంప్రదాయంలో మౌలిక కృతుల కంటే వాటిపై భాష్యాలు, వ్యాఖ్యానాలకే ఎక్కువ ప్రాధాన్యమున్నది.

కాంగ్రెస్ మానిఫెస్టోలో నరేంద్ర మోదీ చేసిన మార్పుల్లో రత్నాల లాంటి మాటలు ఉన్నాయి. అవేమిటో చూడండి: కాంగ్రెస్ అధికారానికి వస్తే ప్రజల భూములు, బంగారం, ఇంకా ఇతర విలువైన ఆస్తులను ముస్లింలకు పంపిణీ చేస్తుంది; ప్రతి ఒక్కరి ఆస్తి, స్త్రీల సొత్తు అయిన బంగారం, గిరిజన కుటుంబాల వద్ద ఉన్న వెండి విలువ తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా ఒక సర్వేను నిర్వహిస్తుంది. ఆ ఆస్తులను సొంతదారుల నుంచి లాక్కొంటుంది; ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన భూమి, నగదును కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజలకు పంపిణీ చేస్తుంది; దేశ సహజ వనరులపై మొదటి హక్కు ముస్లింలదేనని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. ఆయన ఈ ఉద్ఘాటన చేసిన సభలో (గుజరాత్ ముఖ్యమంత్రిగా) నేనూ ఉన్నాను; కాంగ్రెస్ మీ మంళసూత్రాన్ని, స్త్రీ ధనాన్ని తీసుకుని, అధిక సంతానం ఉన్న వారికి ఇస్తుంది; మీకు స్వగ్రామంలో ఒక ఇల్లు, పట్టణంలో ఒక చిన్న ఫ్లాట్ ఉంటే ఆ రెండు గృహాలలో ఒకదాన్ని కాంగ్రెస్ తీసుకుని ఎవరో ఒకరికి ఇస్తుంది.


మోదీ స్పూర్తితో ఆయన విశ్వసనీయ సహచరుడు, సలహాదారు అమిత్ షా ఇలా అన్నారు: దేవాలయాల ఆస్తులను కాంగ్రెస్ స్వాధీనం చేసుకుని, పంపిణీ చేస్తుంది. ఇక రాజ్‌నాథ్ సింగ్ తన వంతుగా ఇలా అన్నారు: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను కైవసం చేసుకుని, చొరబాటుదారులకు పునః పంపిణీ చేస్తుంది. ఈ వ్యాఖ్య చేసిన మరుసటి రోజే రాజ్‌నాథ్ సింగ్ మరొక ‘సత్యాన్ని’ వెల్లడించారు: సాయుధ బలగాలలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లను ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ వ్యాఖ్యాతల సంఖ్య పెరిగిపోయి, ఒకరిని మించి ఒకరు పోటా పోటీగా వివిధ అంశాలపై వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ ‘వారసత్వ పన్ను’ను ప్రవేశపెట్టనున్నదని నరేంద్ర మోదీ కనుగొన్నారు! వెన్వెంటనే దాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ను దుయ్యబట్టడం ప్రారంభించారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రంగంలోకి దిగారు. వారసత్వ పన్ను భావనపై తన అపార పాండిత్యాన్ని వెల్లడించారు. 1985లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టేట్ సుంకం (ఇది ఒక విధమైన వారసత్వ పన్ను)ను రద్దు చేసిందని, 2015లో బీజేపీ ప్రభుత్వం సంపద పన్నును రద్దు చేసిందన్న విషయాలు ఆమెకు తెలిసినట్టు లేదు. అయితే ఇందుకు ఆమెను క్షమించవచ్చు.

కాంగ్రెస్ మానిఫెస్టోపై ఈ సమన్వయ దాడి ఎప్పుడు, ఎందుకు ప్రారంభమయిందో చూడడం కష్టమేమీ కాదు. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ అనంతరం ప్రధానమంత్రి కార్యాలయాన్ని, బీజేపీని భయాందోళనలు ఆవహించాయి. ఏప్రిల్ 21న రాజస్థాన్‌లోని జలోర్, బాన్సవారాలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలలో కాంగ్రెస్ మానిఫెస్టోపై తీవ్ర విమర్శలు చేయడాన్ని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆయన విమర్శలు విడ్డూరంగా, విపరీతంగా ఉన్నాయి. ఆయన మంత్రివర్గ సహచరులు కూడా ముందువెనుక ఆలోచించకుండా వ్యాఖ్యలు, విమర్శలు చేయసాగారు.

ఈ ఉన్మాద విమర్శలను నిలిపివేయాలని అధికారపక్షానికి విజ్ఞప్తి చేయడం మీడియా విధ్యుక్త ధర్మం. అయితే వార్తా పత్రికలు ఆ విధిని విస్మరించి వివాదాస్పద అంశాలను ‘వివరించాయి’. గంభీరమైన సంపాదకీయాలు రాశాయి. టీవీ ఛానెల్స్ రాజకీయ, ఆర్థిక రంగ ప్రముఖలతో ఇంటర్వ్యూలు ప్రసారం చేశాయి. నిపుణుల బృందాలతో చర్చలు నిర్వహించాయి. కాంగ్రెస్ మానిఫెస్టోపై నరేంద్ర మోదీ ప్రారంభించిన విమర్శలు అదే రీతిలో మరింతగా ఉధృతమయ్యాయి.


ఏప్రిల్ 5, 19 తేదీల మధ్య దేశవ్యాప్తంగా ప్రజల మాటా మంతీలో కాంగ్రెస్ మానిఫెస్టో ఒక ప్రధానాంశంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ మీద అన్ని వర్గాల వారూ విస్తృతంగా చర్చించుకున్నారు. ఆ హామీలు వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సామాజిక, ఆర్థిక సర్వే, నిర్వహణ, కులాలవారీ జన గణన; విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఉసంహరించడం; గ్రామీణ ఉపాధి హామీ కూలీల దినసరి వేతనాన్ని రూ. 400కి పెంచడం; పేద కుటుంబాలకు మహాలక్ష్మి ఆర్థిక సహాయ పథకం; వ్యవసాయక ఉత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం; వ్యవసాయ రుణాల మాఫీ విషయమై ప్రభుత్వానికి తగు సలహా ఇచ్చేందుకు ఒక కమిషన్ నేర్పాటు చేయడం; యువతకు అప్రెంటిస్‌షిప్ హక్కు కల్పించడం; అగ్నివీర్ పథకం రద్దు; కేంద్ర ప్రభుత్వంలోని 30 లక్షల ఉద్యోగ ఖాళీలను ఒక ఏడాదిలోగా భర్తీ చేయడం మొదలైనవి.

కాంగ్రెస్ మానిఫెస్టో ‘లోక్‌సభ ఎన్నికల హీరో’ అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్.కె.స్టాలిన్ అభివర్ణించారు. చాలా యథార్థమైన అభివర్ణన అది. కాంగ్రెస్ సంకల్ప పత్రంపై స్టాలిన్ అభిప్రాయం మోదీకి కోపం తెప్పించి ఉంటుంది. కనుకనే కాంగ్రెస్ మానిఫెస్టోను ఒక విలన్‌గా తూర్పారపట్టేందుకు నిర్ణయించుకున్నారు. మోదీ దురదృష్ట మేమిటంటే కాంగ్రెస్ మానిఫెస్టోలోని ఏ అంశమూ తప్పు పట్టేందుకు వీలు లేనిదే. అందుకే కాంగ్రెస్ సంకల్ప పత్రంపై మోదీ విమర్శలను ప్రజలు హర్షించడం లేదు. దీంతో ఒక దెయ్యం రాసిన మానిఫెస్టోను ఊహించుకుని దాన్ని దుయ్య బడుతున్నారు! ఇది, కాంగ్రెస్ పార్టీ నిజ మానిఫెస్టోకు బీజేపికి చెందిన ప్రధానమంత్రి ఒకరు ఇవ్వగల ఒక అంతిమ ప్రశంస అని నేను భావిస్తున్నాను.

బీజేపీ మూడోసారి విజయం సాధించి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే ఎటువంటి వక్రీకరణలు, అసత్యాలు, నిందలు, దుర్బాషలను చవిచూడవలసివస్తుందో ప్రజలు తెలుసుకునేలా చేసినందుకు ‘థాంక్యూ, ప్రైమ్ మినిస్టర్’ అని ఆయనకు కాంగ్రెస్ ధన్యవాదాలు చెప్పాలి. మానిఫెస్టోలను పునః రచించడంలో విశేష ప్రతిభా సమన్వితంగా పట్టభద్రుడైన నరేంద్ర మోదీ భారత రాజ్యాంగాన్ని మళ్లీ రాయవచ్చు సుమా!

‘మోదీకీ గ్యారంటీ’ని ఒక చెత్త డాక్యుమెంట్‌గా నరేంద్ర మోదీ కొట్టివేయలేరు. ఆ ప్రణాళికను రూపొందించిన కమిటీ తన బాధ్యతను అసమర్థంగా నిర్వర్తించిందని తప్పుపట్టలేరు. రాజ్‌నాథ్ సింగ్ నాయత్వంలోని ఆ కమిటీకి ఏవో ఉద్దేశాలనూ ఆపాదించలేరు. ఇలా ఇరకాటంలో పడిన నరేంద్ర మోదీ కాంగ్రెస్ మానిఫెస్టోను తీసుకుని, ఆ ప్రణాళికపై తన వ్యాఖ్యానంతో దానికి మరింత ప్రచారాన్ని కల్పించి, పాఠక జనాన్ని పెంపొందించేందుకు నిర్ణయించుకున్నారు!

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Apr 27 , 2024 | 04:42 AM