Share News

చెల్లుకు చెల్లు!

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:55 AM

ముప్పైమూడేళ్ళ తరువాత ఇజ్రాయెల్‌మీద నేరుగా దాడిచేసిన మొదటి సార్వభౌమ దేశంగా ఇరాన్‌ ఆదివారం రికార్డులకు ఎక్కింది. వందలాది క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్‌మీద పంపి పక్షంరోజుల క్రితం తాను చేసిన శపథాన్ని...

చెల్లుకు చెల్లు!

ముప్పైమూడేళ్ళ తరువాత ఇజ్రాయెల్‌మీద నేరుగా దాడిచేసిన మొదటి సార్వభౌమ దేశంగా ఇరాన్‌ ఆదివారం రికార్డులకు ఎక్కింది. వందలాది క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్‌మీద పంపి పక్షంరోజుల క్రితం తాను చేసిన శపథాన్ని నిలబెట్టుకుంది. అసలే లేవనివి, చివరిదాకా సాగనివి, పేలనివి, మార్గమధ్యంలోనే కూలినవి పోను గట్టిగా ఓ డజను క్షిపణులు కూడా ఇజ్రాయెల్‌ను తాకలేదని వార్తలు వచ్చాయి. పదేళ్ళబాలిక గాయపడిందని, సైనికులు, యుద్ధవిమానాలు లేని ఓ చిన్న మిలటరీబేస్‌ ధ్వంసమైందని తప్ప, పెద్దగా విధ్వంసం జరిగినట్టు దాఖలాలులేవు. ఇన్నేళ్ళకు, అంత తెగించి, ఇంతభారీగా చేసిన దాడి చివరకు ఇలా పరిణమించడం ఆశ్చర్యం. ఇజ్రాయెల్‌ ఆయుధసంపత్తి, దాని ఆత్మరక్షణ సామర్థ్యం, అగ్రరాజ్యాలు దానికి ఇప్పటికే అందించిన, అందిస్తున్న ఆర్థిక, సాంకేతిక సహాయం ఎంత హెచ్చుస్థాయిదో ఇరాన్‌కు తెలియనిదేమీ కాదు. ఆగర్భశత్రువుమీద కక్షతీర్చుకొనే తమ లక్ష్యం నెరవేరిందని, ఆపరేషన్‌ ముగిసిందని ఇరాన్‌ వెంటనే ప్రకటించేయడం చూసినప్పుడు, ఇది ప్రతీకాత్మక దాడేకానీ, నిజంగా ప్రతీకారం కాదేమోనని చాలామందికి అనుమానం కలిగింది.

అమెరికా, బ్రిటన్‌, జోర్డన్‌ తదితర దేశాల సాయంతో ఈ దాడిని ఇజ్రాయెల్‌ విజయవంతంగా తిప్పికొట్టింది. అగ్రరాజ్యాల సమస్త రక్షణ వ్యవస్థలు చక్కని సమన్వయంతో పనిచేశాయి. ఈనెల ఒకటిన సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ కాన్సులేట్‌ భవనంమీద క్షిపణి దాడిచేసి, రివల్యూషనరీ గార్డ్స్‌ అత్యున్నతస్థాయి కమాండర్లతో సహా పన్నెండుమందిని ఇజ్రాయెల్‌ చంపివేయడం, ప్రతీకారం తీర్చుకొని తీరుతానని ఇరాన్‌ హెచ్చరించడం తెలిసినవే. గాజాయుద్ధం అత్యంత అమానవీయమైన స్థాయికి చేరుకున్న ప్రస్తుతస్థితిలో, తనకు జరిగిన ఈ అవమానానికి ఇరాన్‌ ఈమారు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని చాలామంది విశ్వసించారు. ప్రతీకార దాడికి ఇరాన్‌ సన్నాహాలు ఆరంభించిదంటూ అమెరికానుంచి ఇజ్రాయెల్‌కు పదిరోజుల క్రితమే సమాచారం అందడంతో పాటు, ఇజ్రాయెల్‌ను కాపాడటంకోసం అగ్రరాజ్యాలు తమ ఆయుధసంపత్తిని పశ్చిమాసియాకు హడావుడిగా తరలించిన విషయం తెలిసిందే. ఇక, తమ పొరుగుదేశాలకు ఈ దాడికి సంబంధించి డెబ్బయ్‌రెండు గంటల ముందస్తు సమాచారాన్ని అందచేశామని ఇరాన్‌ రక్షణమంత్రి తెలియచేశారు కూడా. ఈ ప్రతీకారదాడి అనూహ్యమైనది కాకపోవడంతో ఇజ్రాయెల్‌, దానిమిత్రదేశాలకు ఆత్మరక్షణకు తగినంత సమయం లభించింది.

ఎంత రెచ్చగొట్టినా, ఇరాన్‌ నేరుగా ఇజ్రాయెల్‌మీద దాడికిదిగదన్న భ్రమలు ఈ ఘటనతో తొలగిపోయాయి. జరిగినదానికి ఆగ్రహంతో ఇజ్రాయెల్‌ కచ్చితంగా ఇరాన్‌మీద విరుచుపడుతుందని కొందరి నమ్మకం. ప్రతీకారం తథ్యమని ఇజ్రాయెల్‌, సహకారం ఖాయమని అమెరికా బయటకు ప్రకటిస్తున్నప్పటికీ, ఇరాన్‌తో కయ్యానికి దిగినపక్షంలో తాను ఏ మాత్రం రక్షించబోనని ఇజ్రాయెల్‌కు అమెరికా తేల్చేసింది. అమెరికా పాలకుడుగా ఎవరున్నా ఇజ్రాయెల్ పక్షాన నిలవడం తప్పదు కానీ, నెతన్యాహూను గుడ్డిగా వెనకేసుకొస్తూ, గాజాయుద్ధాన్ని అమెరికా యథేచ్ఛగా అనుమతించడం బైడెన్‌కు స్వదేశంలో చెడ్డపేరుతెస్తోంది. సంప్రదాయ డెమోక్రాట్‌ ఓటుబ్యాంకులోనే అసమ్మతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఇరాన్‌ దాడికి ఇజ్రాయెల్‌ ప్రతీకారం తీర్చుకున్న పక్షంలో అది పశ్చిమాసియాకు మాత్రమే పరిమితం కాదు. అమెరికా దిగితే తానూ రంగప్రవేశం చేస్తానని రష్యా అంటోంది. గాజాయుద్ధం ప్రపంచాన్ని చుట్టుముడుతుందన్న భయాలు నిజమవుతాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు ముకుతాడు వేయాల్సిన అవసరం, బాధ్యత అమెరికాకు ఉన్నాయి. ఇరాన్‌ దాడి నిజానికి సంపూర్ణంగా విఫలమైనప్పటికీ, స్వదేశంతోపాటు చాలా ఇస్లామిక్‌ దేశాల ప్రజలకు అది ఆత్మసంతృప్తిని మిగల్చింది. గాజాలో మారణహోమానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు ఆ మాత్రం గుణపాఠం చెప్పినందుకు వారంతా సంతోషిస్తున్నారు. చెల్లుకు చెల్లు ఇక చాలు అని ఇరాన్‌ కూడా అంటోంది. కానీ, నెతన్యాహూ అధికారకూటమిలోని పార్టీలన్నీ ప్రతీకారం పేరిట ఆవేశంతో ఊగిపోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఆర్నెల్ల యుద్ధంలో ముప్పైమూడువేలమంది పాలస్తీనియన్లను ఊచకోతకోయడం, గాజాను నేలమట్టంచేయడం వినా నెతన్యాహూ సాధించిందేమీ లేదు. బందీలను విడిపించలేదు, హమాస్‌ నాయకత్వం నాశనం కాలేదు, యుద్ధం లక్ష్యాలన్నవేవీ నెరవేరలేదు. హమాస్‌ దాడికి ప్రతీకారం పేరిట గాజాలో సాగిస్తున్న మారణకాండకు స్వస్తిచెప్పి కాలువెనక్కుతీసుకొనేందుకు ఇజ్రాయెల్‌ ఇప్పటికైనా సిద్ధపడాలి.

Updated Date - Apr 16 , 2024 | 06:33 AM