OU : చరిత్రను నడిపించిన ఓయూ విద్యార్థి
ABN , Publish Date - Jun 08 , 2024 | 05:31 AM
భారత సామాజిక ఉద్యమాల చరిత్రలో ముఖ్యంగా విద్యార్థి ఉద్యమ చరిత్రలో తెలంగాణ విద్యార్థి ఉద్యమం గుర్తుండిపోతుంది. నిజానికి విద్యార్థి ఉద్యమానికి పరిమితులున్నా, సామాజిక మార్పుకు
భారత సామాజిక ఉద్యమాల చరిత్రలో ముఖ్యంగా విద్యార్థి ఉద్యమ చరిత్రలో తెలంగాణ విద్యార్థి ఉద్యమం గుర్తుండిపోతుంది. నిజానికి విద్యార్థి ఉద్యమానికి పరిమితులున్నా, సామాజిక మార్పుకు దోహదపడే సమూహాల్లో విద్యార్థి సమూహం ఒక్కటి. తెలంగాణ విద్యార్థి ఉద్యమంపై చేసిన ఈ పరిశోధన కేవలం విద్యార్థులకు సాధారణంగా ఉండే లక్షణాన్నే కాకుండా సామాజిక ఉద్యమాల్లో వాళ్లు పోషించిన పాత్రనూ విశ్లేషిస్తుంది. ఈ పరిశోధన ఉస్మానియా యూనివర్సిటీలో 2009 నుంచి జరిగిన విద్యార్థి ఉద్యమ వెలుగులో నడుస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమానికి ఉన్న పోరాటాల చరిత్ర వలన అది వివిధ భావజాలాలకు వేదికగా ఉంటూ తెలంగాణ ఉద్యమానికి భిన్న దృక్పథాలను ఇచ్చింది. విశాల ప్రజారాశులను ప్రభావితం చేసి తెలంగాణ ఉద్యమంలో కలుపుకుని పోవడం ద్వారా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమం తెలంగాణ పది జిల్లాల్లో వివిధ యూనివర్సిటీల్లో, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల దాక తన నెట్‌వర్క్‌ని విస్తరించుకుంది. నిజానికి అన్ని సామాజిక వర్గాల సమూహంగా విద్యార్థులు ఉన్నప్పటికీ విద్యార్థి వర్గాన్ని పెటీ బూర్జువా వర్గంగా భావిస్తారు. కాని, తెలంగాణ విద్యార్థులు, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, విద్యార్థులకు ఉండే ఈ సాధారణ లక్షణానికి భిన్నంగా ఉన్నారు. ఈ విద్యార్థులు దాదాపుగా తెలంగాణలోని వ్యవసాయ కూలీల కుటుంబాల నుంచి వచ్చినవాళ్లే. అందులో 90 శాతం విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత మైనారిటీ వర్గాలకు చెందినవాళ్లే ఉన్నారు. తెలంగాణ ఉద్యమం ఇంత సుదీర్ఘంగా నిలబడగలిగింది అంటే ఈ ప్రత్యేక లక్షణం వలనే. ఈ లక్షణం వల్లే వాళ్లు తమ చుట్టూ ఉన్న సమాజంలో నెలకొని ఉన్న వివిధ రాజకీయ, సామాజిక సమస్యలపై స్పందించారు. వాళ్లు సమాజంలో జరిగే ప్రతి వివక్ష, దోపిడిపై సున్నితంగా ఉండడమే గాక, సమాజహితం కోసం ఏదైనా చేయడానికి ముందుకు వస్తారు.
అంచెలంచెలుగా ప్రజలు సమూహంగా ఆధిపత్యాలకు వ్యతిరేకంగా చేసే కార్యాచరణే రాజకీయ మార్పుకు కారణమవుతుందని చెప్పేందుకు తెలంగాణ ఉద్యమం ఒక ఉదాహరణ. 1969 ఉద్యమం నుంచి బలమైన విద్యార్థి నాయకత్వం సమాజానికి అందివచ్చింది. ఆ నాయకత్వమే తరువాత ఇక్కడ వచ్చిన అనేక సామాజిక విప్లవ ఉద్యమాలకు నాయకత్వం వహించింది. బ్రాహ్మణీయ, భూస్వామ్య పెట్టుబడిదారి విధానాల సంకెళ్ల నుంచి ప్రజలను విముక్తం చేసేందుకు వారు దారులు వేశారు. తెలంగాణ జిల్లాలోని ప్రతి గ్రామంలో వారు నాడు వేసిన ప్రభావం ఇంకా ఉంది. పైగా అదే నాయకత్వం దేశంలోని అనేక రాష్ట్రాల్లో నక్సలైట్ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తోంది. అనేక సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కారణాల వల్ల 1969 ఉద్యమంతో పోలిస్తే ఇప్పటి విద్యార్థి ఉద్యమానికి పరిమితులున్నాయి. రాజ్య నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రూపాలను ప్రస్తుత ఉద్యమం తీసుకోలేకపోతోంది. కొన్ని సందర్భాలలో రాజ్యంపై ఆధారపడటమో లేదా రాజ్యంతో చర్చలు చేయడమో చేస్తుంది తప్ప, పోరాటం చేయడం లేదు. అనేక సందర్భాలలో వర్గ, కుల ప్రయోజనాలు నీరుగారిపోయాయి. నిజానికి డిసెంబర్ 2009 నుంచి పూర్తిగా ఉద్యమం విద్యార్థుల నియంత్రణలో నడిచింది. ఆ విద్యార్థుల సమూహంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ నేపథ్యం నుంచి వచ్చిన నాయకత్వమే ఉంది. ఇదే కారణం చేత అగ్రకుల, బూర్జువా వర్గం రాజకీయ జేఏసీని ఏర్పాటు చేసింది.
కుల – వర్గ వైరుధ్యం, ఐక్యత ఉద్యమంలో అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. విద్యార్థులు కూడా కులం, ఉపకులం ఆధారంగా విడిపోయారు. దీనికి అన్ని అస్థిత్వాలకన్నా కుల అస్థిత్వం బలంగా ఉండటమే కారణం.
రాజకీయ పార్టీల అవకాశవాదాన్ని, ఎన్నికల ప్రచార రాజకీయాలను సరైన సమయంలో జేఏసీ బహిర్గతం చేయలేకపోయింది. కొన్ని సందర్భాల్లో తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంబంధాలను నెరిపింది. జేఏసీ నాయకత్వం, పాల్గొన్న విద్యార్థులు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మొదటితరం వాళ్లు కావడం ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. కోస్తాంధ్ర మధ్యతరగతి వర్గం ఆక్రమించుకున్న జీవనోపాధి అవకాశాలు తెలంగాణ వస్తే తమకు దక్కుతాయని వెనుకబడిన విద్యార్థులు అనుకున్నారు. అమాయక ఆంధ్ర సెటిలర్లను, బతుకుదెరువు కోసం వచ్చిన సీమాంధ్ర ప్రాంతం వారిని విద్యార్థులు ఏనాడూ ఏమీ అనలేదు. ఆధిపత్య దోపిడీ వర్గం, సీమాంధ్రకు చెందిన పెట్టుబడిదారులపై మాత్రమే దృష్టి సారించారు. బ్రాహ్మణీయ సంస్కృతికి వ్యతిరేకంగా కుల వ్యతిరేక ఉద్యమాన్ని ప్రచారం చేయడంపై ఉస్మానియా విద్యార్థులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సైద్ధాంతికంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అనేది ఒక పెటీ బూర్జువా డిమాండ్. అయితే, వివిధ రకాల సమస్యలు, వివిధ సెక్షన్ల ప్రజల ఆకాంక్షలు ఇందులో మిళితమై ఉండడం వలన ఇతర ప్రాంతీయ పోరాటాలతో పోల్చినప్పుడు భిన్నమైన కోణం కనిపిస్తుంది. ఎందుకంటే, ఇది విభిన్న భావజాలాల ద్వారా వివిధ సామాజిక సమూహాల ఆకాంక్షలు, అవసరాలకు ప్రాతినిధ్యం వహించడానికి ప్రయత్నించింది. ప్రజలు హృదయపూర్వకంగా ఇంత సుదీర్ఘకాలం పనిచేయడానికి గల కారణం అదే. ఒక పరిశోధన అంశంగా తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకోవడంలో ఉస్మానియా విద్యార్థి ఉద్యమం ముఖ్యమైన భాగంగా ఉంటుంది.
(‘‘ఉస్మానియా వెలుగులో తెలంగాణ విద్యార్థి ఉద్యమం’’ పుస్తకంలోని కొన్ని భాగాలు ఇవి. ‘ఛాయ’ ప్రచురించిన
ఈ పుస్తకం ఆవిష్కరణ నేటి ఉదయం 11 గంటలకు
ఓయూ ఆర్ట్స్ కాలేజీలో జరుగుతుంది.)
– నలమాస కృష్ణ