Share News

విస్తరిస్తున్న యుద్ధం

ABN , Publish Date - Jan 17 , 2024 | 05:22 AM

ఇరాక్‌లోని ఇజ్రాయెల్‌ నిఘా కేంద్రాన్ని ఇరాన్‌ సోమవారం ధ్వంసం చేసింది. గాజా యుద్ధం ఆరంభమైన తరువాత ఇజ్రాయెల్‌ ప్రయోజనాలను ఇరాన్‌ నేరుగా దెబ్బతీయడం ఇదే తొలిసారి. కుర్దిస్థాన్‌ రాజధాని...

విస్తరిస్తున్న యుద్ధం

ఇరాక్‌లోని ఇజ్రాయెల్‌ నిఘా కేంద్రాన్ని ఇరాన్‌ సోమవారం ధ్వంసం చేసింది. గాజా యుద్ధం ఆరంభమైన తరువాత ఇజ్రాయెల్‌ ప్రయోజనాలను ఇరాన్‌ నేరుగా దెబ్బతీయడం ఇదే తొలిసారి. కుర్దిస్థాన్‌ రాజధాని ఎర్బిల్‌లో అమెరికా రాయబార కార్యాలయానికి అతిసమీపంలో ఉన్న ఇజ్రాయెల్‌ గూఢచర్య సంస్థ మొసాద్‌ ప్రధాన కార్యాలయాన్ని నేలమట్టం చేయడమే కాక, ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణుల కారణంగా కొందరు ఇరాకీ పౌరులు కూడా హతమయ్యారు. అమెరికా అధికారులకు ఏ నష్టమూ వాటిల్లకున్నా వారి రాయబార కార్యాలయం కూడా కొంతమేరకు దెబ్బతిన్నదని వార్తలు వస్తున్నాయి. ఇది ఇరాక్‌ సార్వభౌమత్వంమీద దాడి అంటూ ఇరాక్‌ తీవ్రంగా ప్రతిస్పందించింది. యెమెన్‌లోని హౌతీ స్థావరాలమీద అమెరికా, బ్రిటన్‌ యుద్ధవిమానాలు దాడులు జరిపిన తరువాత, ఇరాన్‌ చర్యతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత హెచ్చాయి.

గాజాలో ఇజ్రాయెల్ యుద్ధానికి ఆదివారం నాటికి వందరోజులు పూర్తయ్యాయి. గాజా ఘోరాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా, హమాస్‌ పక్షాన హౌతీలు ఎర్రసముద్రంలో వాణిజ్యనౌకలపై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. హౌతీలను అణచివేసేందుకు అమెరికా బ్రిటన్‌లు జరుపుతున్న వైమానిక దాడుల్లో హౌతీలు ఎంత దెబ్బతిన్నారో తెలియదు కానీ, ముడిచమురు ధర మరింత పెరిగింది. ప్రపంచ నౌకారవాణాలో 15శాతం ఈ మార్గం ద్వారా జరుగుతుంది. రెండునెలల్లో హౌతీల దాడులు ఐదురెట్లు హెచ్చి, పెద్ద పెద్ద షిప్పింగ్‌ కంపెనీలు ఇటుగా పోవడమే మానుకున్నాయి. భారతదేశానికి వస్తున్న రెండు నౌకలమీద కూడా గతంలో వీరు దాడులు చేశారు. రాజధాని సహా యెమెన్‌లోని అత్యధికప్రాంతాలు హౌతీల ఏలుబడిలోనే ఉన్నాయి. ఎర్రసముద్రం తీరంమీద వారికున్న ఆధిపత్యం కారణంగా వాణిజ్యనౌకలు క్షేమంగా నడవాలంటే హౌతీలను దెబ్బకొట్టాల్సిందే. కానీ, హౌతీలకు ఆర్థిక, ఆయుధ సహకారం ఇరాన్‌నుంచే అందుతున్నదని, ఇరాన్‌ ఆశీస్సులున్న హిజ్బుల్లా దీనికి సైనికశిక్షణనిస్తుదని పాశ్చాత్యదేశాలు నమ్ముతున్నప్పుడు ఇలా ఓ నాలుగురోజులపాటు వైమానికదాడులు చేస్తే హౌతీలను నాశనం చేయడం సాధ్యమేనా? ఇరాన్‌ అందించే ఇంటలిజెన్స్‌ సమాచారం ఆధారంగానే హౌతీలు వాణిజ్యనౌకలను నాశనం చేయగలుగుతున్నారని అంటున్నప్పుడు కేవలం హౌతీలమీద వైమానికదాడులతో లక్ష్యం పూర్తిగా సిద్ధిస్తుందా?

హమాస్‌ పక్షాన నిలిచిన హౌతీలను నాశనం చేసేందుకు ఇజ్రాయెల్‌ తరఫున అమెరికా, దాని మిత్రదేశాలు ఈ యుద్ధానికి దిగాయి. అమెరికా ఆర్థిక, ఆయుధ అండదండలతో ఇజ్రాయెల్‌ సాగిస్తున్న మారణకాండ వాటి పరిభాషలో ఆత్మరక్షణ. హమాస్‌ దాడిలో చనిపోయినవారికంటే, ఇప్పుడు ఇజ్రాయెల్‌ దాడిలో వందలరెట్లు మరణించినా ఆ యుద్ధం వాటిదృష్టిలో న్యాయమైనదే. గాజాలో కాల్పుల విరమణ జరగక, మానవసాయం అందక వేలాదిమంది చనిపోతున్న స్థితిలో ఆ హననాన్ని ఆపడానికే తాను ఎర్రసముద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నానని, పాశ్చాత్యదేశాలమీద ఒత్తిడితేవడమే తమ లక్ష్యమని హౌతీలు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ తరఫున కాల్పుల విరమణ ప్రతిపాదనలన్నింటినీ వీటో చేస్తున్న దేశాలు వీరిమీద ఇప్పుడు యుద్ధం చేస్తున్నాయి. హౌతీలమీద అమెరికా, దాని మిత్రదేశాలు చేస్తున్న దాడులు ఉపరితలంలో ప్రపంచవాణిజ్యాన్ని పరిరక్షించడంగా కనిపించవచ్చు. కానీ, ఇజ్రాయెల్‌ మీద అంతర్జాతీయంగా ఒత్తిడిపెంచే మరో ప్రయత్నాన్ని ఆదిలోనే తుంచివేసి, గాజాలో అది యథేచ్ఛగా తన ఊచకోత కొనసాగించుకోడానికి వీలుకల్పించే వ్యూహంగా చాలామందికి అనిపిస్తోంది.

అంతర్జాతీయ న్యాయస్థానంలో దక్షిణాఫ్రికా వేసిన కేసు ఇజ్రాయెల్‌ పరువు ప్రతిష్ఠలను పూర్తిగా దిగజార్చింది. గాజాలో జరుగుతున్నది ‘జినోసైడ్‌’ అంటూ, మధ్యంతర ఉత్తర్వులతో ఇజ్రాయెల్‌ను నిలువరించాలన్న అభ్యర్థనతో దక్షిణాఫ్రికా కేసు అత్యధిక దేశాల మనోభిప్రాయానికి ప్రతీక. భద్రతామండలిలో ఇజ్రాయెల్‌ను అమెరికా రక్షించుకువస్తున్నది కానీ, ఇటీవలి ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సభలో ఓ నలభైదేశాలు మినహా 153దేశాలు గాజాలో తక్షణకాల్పుల విరమణకు అనుకూలంగా ఓటువేశాయి. హౌతీలకు ఇప్పుడు సౌదీ అరేబియాతో ఏ పేచీ లేదు కనుక, వారు పూర్తిగా తమ శక్తిసామర్థ్యాలను అమెరికా దాడులను తిప్పికొట్టడానికి వెచ్చిస్తున్నారు. ఆ దాడుల్లో ఒక యుద్ధనౌక దెబ్బతిన్నా అమెరికా పరువుపోతుంది. అధ్యక్ష ఎన్నికల ముందు జోబైడెన్‌ వీరంగం వేయడం, ఆ బీభత్స ప్రతీకారదాడులతో ఘర్షణ మరింత విస్తరించడం పశ్చిమాసియాను మరింత ప్రమాదంలోకి నెట్టేస్తుంది.

Updated Date - Jan 17 , 2024 | 05:22 AM