Share News

ఏఎన్‌సీకి ఎదురుదెబ్బ

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:58 AM

దక్షిణాఫ్రికా పార్లమెంట్‌ ఎన్నికల్లో అధికార ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఏఎన్‌సీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెల్లవారి నుంచి దేశానికి విముక్తి సాధించిపెట్టిన ఆ పార్టీ పట్ల ప్రజలు..

ఏఎన్‌సీకి ఎదురుదెబ్బ

దక్షిణాఫ్రికా పార్లమెంట్‌ ఎన్నికల్లో అధికార ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఏఎన్‌సీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెల్లవారి నుంచి దేశానికి విముక్తి సాధించిపెట్టిన ఆ పార్టీ పట్ల ప్రజలు ఈమారు విముఖత ప్రదర్శించడంతో ముప్పయ్యేళ్ళుగా ఒంటిచేత్తో దేశాన్ని ఏలుతున్నదల్లా ఇప్పుడు అధికారంలో కొనసాగడానికి మరోపార్టీతో చేతులు కలుపుతోంది. దేశాధ్యక్షుడు సిరిల్‌ రాంఫోసా నేతృత్వంలో ఏఎన్‌సీ ఈ ఎన్నికల్లో నలభైశాతం ఓట్లు మాత్రమే తెచ్చుకుంది. ప్రధాన ప్రతిపక్షం డెమోక్రాటిక్‌ అలయెన్స్‌ (డీఎ)కు ౨1శాతం, ఏఎన్‌సీ నుంచి విభేదించి బయటకుపోయిన మాజీ అధ్యక్షుడు జాకోబ్‌ జుమా నాయకత్వంలోని ఎంకే పార్టీకి 14శాతం వచ్చాయి. వామపక్ష భావజాలం ఉన్న ఎకనామిక్‌ ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ (ఈఎఫ్‌ఎఫ్‌)కు 9శాతం ఓట్లు పడ్డాయి. ప్రజల్లో వ్యతిరేకత హెచ్చడంతో 1994లో నెల్సన్‌మండేలా నేతృత్వంలో అధికారం చేపట్టిన ఆ పార్టీ తొలిసారిగా ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఏఎన్‌సిని అధికారానికి దూరంగా ఉంచడం ఈ ఎన్నికల సందేశమని విపక్షాల వాదన. ప్రజల ఆదేశాన్ని శిరసావహిస్తాం అంటూ, రాంఫోసా ఇప్పుడు కూటమిదిశగా చర్చలు జరుపుతున్నారు. ఓడినా, ఏఎన్‌సీయే పెద్దపార్టీ కనుక, రాంఫోసాకు ఆ అవకాశం ఉన్నది.


మూడుదశాబ్దాల తరువాత కూడా విద్యుత్‌, నీరు, ఆహారం ఇత్యాదివి సమస్యలుగా, అందని ద్రాక్షలుగా ఉన్నప్పుడు ప్రజలు మాత్రం ఎంతకని భరిస్తారు? వర్ణవివక్షనుంచి తమను రక్షించిన పార్టీగా ప్రజలకు ఇప్పటికీ ఆ పార్టీమీద ప్రేమాభిమానాలు లేకపోలేదు. కానీ, ఉత్సాహంగా పోలింగ్‌ బూత్‌ముందు బారులు తీరి ఓటేసిన తీరు మారింది. సకల సమస్యలకు, సమస్త కష్టాలకు తెల్లవాళ్ళే కారణమన్న వాదనకు కూడా కాలం చెల్లిపోయింది. మూడుదశాబ్దాలు అధికారంలో ఉన్న తరువాత, ఎవరినో తప్పుబట్టడానికీ, ఆరోపించడానికి కూడా ఏమీ ఉండదు. దీనికి తోడు, మాజీ అధ్యక్షుడు జాకోబ్‌ జుమా గత ఏడాది రాంఫోసాతో విభేదించి వేరు కుంపటిపెట్టుకోవడంతో ఏఎన్‌సీ బాగా బలహీనపడింది. పార్టీ ఓటును ఆయన గణనీయంగా చీల్చగలడన్న అంచనాలు నిజమైనాయి. జుమా స్వంత ప్రావిన్సు క్వాజులు నటాల్‌ లో ఈ చీలిక ప్రభావం బాగా కనిపించింది. అవినీతి, మనీలాండరింగ్‌ ఇత్యాది ఆరోపణలు ఎదుర్కొంటున్న సిరిల్‌ రాంఫోసా ఏమాత్రం ఉన్నతంగా వ్యవహరించకుండా తన రాజకీయబలంతో దర్యాప్తులను, విచారణలను అడ్డుకోవడం కూడా పార్టీ పరువు తీసింది. తన రాజకీయమనుగడకోసం దాదాపు యాభైమంది విపక్షనేతలు, అధికారులు, హక్కుల కార్యకర్తలను రాంఫోసా హత్య చేయించారన్న ఆరోపణలున్నాయి.

దేశంలో అసమానతలు మరింత పెరిగాయి. నల్లవారు, తెల్లవారు అన్న తేడాలేకుండా ఈ ముప్పయ్యేళ్ళలో కొద్దిమంది ఆర్థికంగా బలపడ్డారు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోవడానికి ఏఎన్‌సి నాయకులు కారకులని ప్రజలు నమ్మారు. నిరుద్యోగం భయంకరంగా ఉంది, ప్రపంచంలోనే దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉంది. దారిద్ర్యం యాభైశాతం దాటింది, నేరాలు అధికమైనాయి. ఇంతటి తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో ఈపాటి ప్రజావ్యతిరేకత సహజం కూడా.


ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని దశాబ్దాలు ఏలిన ఓ పార్టీకి ఎవరితోనో పొత్తుపెట్టుకోవాల్సిరావడం పెద్ద విషమపరీక్ష. మైనారిటీ శ్వేతజాతీయుల నాయకత్వంలో, వారి ప్రయోజనాల పరిరక్షణకు ఉద్దేశించిన పార్టీగా పేరుపడిన డెమోక్రాటిక్‌ అలయెన్స్‌ (డీఎ)తో కూడా రాంఫోసా చర్చలు జరుపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ పార్టీతో చేతులు కలిపితే రాంఫోసాతో పాటు ఏఎన్‌సి మరింత అప్రదిష్టపాలవుతుంది. పార్టీ కేడరు, ఓటరు దీనిని చరిత్రాత్మకద్రోహంగా, వెన్నుపోటుగా చూసే అవకాశం అత్యధికం. ఇక, అసమానతల నిర్మూలన, అవినీతిపై పోరాటం ఇత్యాది ఆశయాలనేకం లక్ష్యాలుగా ప్రకటించి ఏఎన్‌సీతో దశాబ్దం క్రితం వేరుపడిన మలేమా నాయకత్వంలోని ఎకనామిక్‌ ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ (ఇఎఫ్‌ఎఫ్‌)తో చేతులు కలిపిన పక్షంలో పెట్టుబడిదారులకు, వ్యాపారవర్గాలకు వ్యతిరేకమన్న సందేశం ఇచ్చినట్టవుతుందని రాంఫోసా భయం. ఇఎఫ్‌ఎఫ్‌ రాడికల్‌ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటూ, దాని ఎజెండాకు కట్టుబడటం రాంఫోసాకు సమస్యలు తెచ్చిపెడుతుంది. మాజీ అధ్యక్షుడు జాకోబ్‌ జుమాతో చేతులు కలిపితే, ఆయనమీద ఉన్న అవినీతి ఆరోపణలు, కేసుల విషయంలో నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించాలి, సమీప భవిష్యత్తులోనే కేసులన్నీ వీగిపోవాలి. అధికారంలోకి రావడానికి రాంఫోసా ఇప్పుడు ఎవరితో పొత్తుపెట్టుకున్నా, అది ఏఎన్‌సి పునాదులు మరింత బలహీనపడటానికే తోడ్పడుతుంది.

Updated Date - Jun 04 , 2024 | 12:58 AM