కొత్త కూర్పు
ABN , Publish Date - Jun 12 , 2024 | 03:00 AM
నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. కొత్త మంత్రివర్గం 71 మందిలో ముప్పైమందికి కేబినెట్ హోదా లభించింది. ఐదుగురు స్వతంత్ర, ముప్పై ఆరుగురు సహాయమంత్రులు ఉన్నారు...

నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. కొత్త మంత్రివర్గం 71 మందిలో ముప్పైమందికి కేబినెట్ హోదా లభించింది. ఐదుగురు స్వతంత్ర, ముప్పై ఆరుగురు సహాయమంత్రులు ఉన్నారు. మిత్రపక్షాల కరుణాకటాక్షాల ఆధారంగా దేశాన్ని ఏలాల్సిన స్థితిలో ఉన్నప్పటికీ, నరేంద్రమోదీ ఈ మంత్రివర్గ కూర్పులో తనదే పైచేయి అనిపించుకున్నారని, ఊతమిస్తున్నవారి ఒత్తిళ్ళకు పెద్దగా లొంగలేదని కొందరి విశ్లేషణ. కొందరు పాతవారు పోయి, శాఖల్లోనూ మార్పుచేర్పులు ఉన్నా, అధికంగా గత మంత్రులే ఉన్నందున మార్పు ప్రభావవంతంగా అగుపించడం లేదు. సొంతబలం లేకున్నా కూడా, గతకాలపు కొనసాగింపుగానే కనిపించాలన్న ప్రత్యేక ప్రయత్నం ఈ మంత్రివర్గం కూర్పులో అత్యధికులకు కనిపిస్తున్నది.
ఆర్థికం, హోం, రక్షణ, విదేశీవ్యవహారాలు, రోడ్ ట్రాన్స్‌పోర్ట్, రైల్వేల వంటి కీలకమైన శాఖల్లో ఏ మార్పూలేదు. ఈ మారు కూడా మంత్రుల్లో ముస్లింలు లేరు. ఏడుగురు ఎస్సీలు, ముగ్గురు ఎస్టీలు, ఏడుగురు మహిళలకు మోదీ టీంలో చోటుదక్కింది. యూపీ నేర్పిన గుణపాఠం వల్ల కాబోలు, ఓబీసీల ప్రాతినిథ్యం కూడా గట్టిగానే ఉంది. పంజాబ్‌లో బలంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీతోనూ, కేరళలో ఎల్‌డీఎఫ్‌తోనూ యుద్ధం కొనసాగించాలి కనుక, తమిళనాడులో ఎదురుదెబ్బ తిన్నా విస్తరణయత్నాలు ఆగకూడదు కనుక ఆ రాష్ట్రాలనుంచి ఓడినవారికి కూడా ప్రాతినిధ్యం లభించింది. ఖలిస్తానీ ఉగ్రవాదుల చేతిలో హతమైన కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనుమడు రవ్‌నీత్‌సింగ్ బిట్టూ ద్వారా పంజాబ్‌లో ఎదగాలన్నది బీజేపీ ప్రయత్నం. ఒక్కసీటూ గెలవకపోయినా ఆప్, కాంగ్రెస్ తరువాత ఓట్లవాటాలో మూడోస్థానంలో ఉన్నందున బీజేపీ ఆశని కాదనలేం. కేరళలో ఒక్కసీటు గెలిచి ఖాతా తెరిచిన సంతోషంలో ఆ రాష్ట్రానికి రెండు పదవులు ఇచ్చినా, నటుడు సురేష్ గోపి అలగడం, రాజీపడటం తప్పలేదు. కేరళలో ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్లవాటా 17శాతం తాకి, 11 అసెంబ్లీ సెగ్మెంట్లలో మంచి బలాన్ని ప్రదర్శించిన నేపథ్యంలో, జార్జి కురియన్ ఎంపిక క్రైస్తవులకు సానుకూల సంకేతం పంపేందుకు ఉపకరిస్తుంది. తమిళనాట వీరోచిత పోరాటం చేసిన ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు అన్నామలై కాక, గతకాలపు నేత లోగనాథన్ మురుగన్‌ను మంత్రిగా తీసుకోవడం వెనుక దళిత ఉపకుల రాజకీయం ఉన్నదని అంటారు. ఇప్పుడు అంతగా ఆదరించనప్పటికీ, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాల ప్రజల మనసులను గెలుచుకోవడానికి ఈ పందేరం ఉపకరిస్తుంది.
కొత్త మంత్రివర్గాన్ని యువతరం, అనుభవజ్ఞులతో ఎంతో చక్కగా గుదిగుచ్చామని ప్రధానమంత్రి చెప్పుకున్నారు. ఐదుగురు తెలుగువారికి కేంద్రంలో చోటుదక్కడం అటుంచితే, మిత్రపక్షాలకు మొత్తంగా పదకొండు, ఐదుపార్టీలకు ఒక్కటి చొప్పున పదవులు దక్కాయి. బిహార్‌లో ముగ్గురు మిత్రులకు నాలుగుపదవులు ఇచ్చినా, మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చి, అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను తెచ్చిన అజిత్‌పవార్‌తో ఇక అవసరం తీరిపోయిందని బీజేపీ భావిస్తున్నట్టుగా చర్చ జరుగుతోంది. ఎన్సీపీ మినహా అన్ని మిత్రపక్షాలకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఇక, ఈ ఏడాది ఎన్నికలు ఉన్నందున మహారాష్ట్ర, హర్యానాలకు తగిన ప్రాతినిధ్యమే దక్కింది. ఖట్టర్‌ను తీసుకోవడం, మూడు పదవులు ఇవ్వడంలో హర్యానాను జారవిడుచుకోకూడదన్న ప్రయత్నం బలంగా కనిపిస్తున్నది. మహారాష్ట్ర కంటే, ఢిల్లీ పొరుగున ఉన్న హర్యానాలో ఓడిపోతే ఆ ప్రభావం నైతికంగా కేంద్రప్రభుత్వం మీద పనిచేస్తుంది.
గత ప్రభుత్వంలోని కీలకమైన మంత్రులను అదేశాఖలో కొనసాగించడం, నడ్డావంటివారిని కొత్తగా తేవడం వంటివి గమనించినప్పుడు మంత్రివర్గ కూర్పులో బీజేపీ ముద్ర విశేషంగా కనిపిస్తుంది. మిత్రపక్షాల అవసరం ఎంత ఉన్నప్పటికీ, వారిని కొంతమేరకే సంతృప్తిపరచి తనదే పైచేయి అనిపించుకుంది. కేబినెట్ మంత్రుల్లో పాతికమంది బీజేపీవారే అయినప్పటికీ, మిత్రపక్షాల ప్రాతినిధ్యం ఈ దేశ వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. దేశంలోని వేర్వేరు ప్రాంతాలనుంచి వచ్చినవారు మంత్రివర్గం పనితీరు మరింత మెరుగుపడేందుకు ఉపకరిస్తారు. భవిష్యత్తులో మంత్రివర్గాన్ని విస్తరించుకొనే వెసులుబాటు ఇంకా మిగిలివున్నందున, రాజకీయంగానో, సామాజిక కారణాలరీత్యానో స్వపక్షంనుంచో, మిత్రపక్షాలనుంచో మరికొందరికి చోటుకల్పించే అవకాశాలైతే లేకపోలేదు. అప్పుడు మరిన్ని వింతలూ విశేషాలు చూడవచ్చు.