Share News

BJP : సుపరిపాలనపై ఒక్కటే మాట!

ABN , Publish Date - Jun 11 , 2024 | 05:34 AM

దాదాపు పదేళ్ల క్రితం వార్డ్ కౌన్సిలర్‌గా ఉన్న ఒక నేత కేంద్రంలో మంత్రి పదవి స్థాయి చేపడతారని ఎవరైనా ఊహించారా? రెండు దశాబ్దాల క్రితం కార్పొరేటర్‌‍గా ఉన్న ఒక నేతకు జాతీయ స్థాయిలో మంత్రిపదవి

BJP : సుపరిపాలనపై ఒక్కటే మాట!

దాదాపు పదేళ్ల క్రితం వార్డ్ కౌన్సిలర్‌గా ఉన్న ఒక నేత కేంద్రంలో మంత్రి పదవి స్థాయి చేపడతారని ఎవరైనా ఊహించారా? రెండు దశాబ్దాల క్రితం కార్పొరేటర్‌‍గా ఉన్న ఒక నేతకు జాతీయ స్థాయిలో మంత్రిపదవి లభిస్తుందని ఎవరైనా అంచనా వేయగలరా? ఇట్లాంటి అద్భుతాలు ఒక్క భారతీయ జనతా పార్టీలోనే జరుగుతాయి. ఆదివారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీనివాస వర్మ, తెలంగాణకు చెందిన బండి సంజయ్, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే శరీరం ఒక్కసారి పులకరించింది. ఎలాంటి వారసత్వం, సంపన్న నేపథ్యం లేకుండా క్రింది స్థాయి నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తే పార్టీ గుర్తింపు దానంతటికదే లభిస్తుందని అనేక సందర్భాల్లో రుజువైంది. ఒకప్పుడు వాజపేయి, అడ్వాణీల పోస్టర్లు అతికించి, మైకుల్లో ప్రచారం చేసిన వెంకయ్యనాయుడు తర్వాతి కాలంలో రెండవ ఉన్నత రాజ్యాంగ పదవి అయిన ఉపరాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించారు. సాధారణ కార్యకర్తగా బీజేపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న కిషన్ రెడ్డి ఇవాళ రెండోసారి మోదీ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రి కాగలిగారు. ఇంతెందుకు, రైల్వే స్టేషన్‍లో టీ అమ్మిన నరేంద్రమోదీ ఈ దేశ ప్రధానమంత్రి అవుతారని ఎవరైనా ఊహించారా?

అటల్ బిహారీ వాజపేయి ఒక సాధారణ బడిపంతులు కుమారుడు. పాంచజన్య పత్రికను అచ్చు వేయిస్తున్నప్పుడు ఆయన ప్రెస్‌‍లో ఇటుకలను తల దిండుగా పెట్టుకుని నిద్రపోయేవారు. ఆయన నిరంతర శ్రమ, వాగ్ధాటి మూలంగా అంచెలంచెలుగా పైకి ఎదిగారు. జనసంఘ్ తరఫున ఏకైక సభ్యుడిగా ఉన్నప్పుడు లోక్‍సభలో ఒక మూల నిలబడి విదేశాంగ విధానం గురించి అనర్గళంగా మాట్లాడడంతో తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దృష్టిని ఆకర్షించారు. తర్వాతి కాలంలో ఆయనే ప్రధాని అయ్యారు. దేశ విభజన సమయంలో అడ్వాణీ పాకిస్తాన్ నుంచి కట్టుబట్టలతో ఇండియాకు వచ్చి రాజస్థాన్‌‍లో ఒక చిన్న గదిలో అజ్ఞాతవాసం గడపాల్సి వచ్చింది. ఆయన ఈ దేశ ఉప ప్రధాని కాగలిగారు. ఇప్పుడు నరేంద్ర మోదీ నెహ్రూ రికార్డునే సమం చేసి మూడోసారి ఈ దేశ ప్రధాని కాగలిగారు.

‘‘మీరు సామాన్య కుటుంబం నుంచి వచ్చారు కదా ప్రపంచంలో అగ్రదేశాధినేతలు ఎదురైనప్పుడు వారు కూడా మిమ్మల్ని గౌరవించేలా ఎలా చేసుకోగలిగారు?’’ అని ఇటీవల ఒక విలేకరి మోదీని అడిగినప్పుడు, ‘‘నాకు కూడా తొలిసారి ప్రపంచ దేశాధినేతలను కలుసుకున్నప్పుడు అదే విధంగా జంకు కలిగింది. కాని నా వెనుక 140 కోట్లమంది భారతీయులు ఉన్నారని తెలిసినప్పుడు నేను తలెత్తుకుని వారితో మాట్లాడాను. ఈ దేశం ఆత్మ నాతో మాట్లాడించింది’’ అన్నారు. ఇవాళ కేంద్రమంత్రులైన వారు కూడా తాము సామాన్యులమని ఏ మాత్రం భయపడనక్కర్లేదు. వారు లక్షలాది మందికి ప్రజాప్రతినిధులు మాత్రమే కాదు, కోట్లాది మంది భారతీయులు వారి పనితీరుపై ఆశలు పెట్టుకున్నారని తెలుసుకున్నప్పుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

‘‘మనం సామాన్యుల్లా నిత్యం వినయంగా ఉండాలి. సామాన్యులు అలాంటి రాజకీయ నాయకులనే గౌరవిస్తారు. నిజాయితీ, పారదర్శకత విషయంలో ఏ విధంగానూ రాజీపడవద్దు’’ అని మోదీ ఆదివారం మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ముందు సహచరులతో చెప్పారు. అన్ని అంశాల కంటే దేశానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే నేషన్ ఫస్ట్ సూత్రాన్ని గౌరవించినందుకు, అందుకోసం ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధపడినందుకే మోదీ ప్రధాని కాగలిగారు.

ఇప్పుడు ఎన్డీఏలో తిరుగులేని నేత మోదీ అని చెప్పక తప్పదు. ఈ విషయం దేశ ప్రజలు బీజేపీకి మెజారిటీ సీట్లు ఇవ్వడం ద్వారా నిరూపించారు. మొత్తం ప్రపంచం ఆయన నాయకత్వాన్ని గుర్తించింది. అంతేకాదు, ఎన్డీఏ నేతలు కూడా ఈ విషయాన్ని సంపూర్ణంగా గుర్తించారు. గత పదేళ్లలో మోదీ నాయకత్వంలో దేశం అత్యంత బలోపేతంగా ఎదిగిన తీరు, ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన తీరు వారికి తెలుసు. అతుకుల బొంతగా ఉన్న పది పన్నెండు పార్టీల ఇండియా కూటమి మూలంగా దేశం విచ్ఛిన్నం కావడమే కాని, దాని వల్ల సాధించగలిగేది ఏమీ లేదని వారికి ఎవరూ చెప్పనక్కర్లేదు.

‘‘భారతదేశానికి సరైన సమయంలో లభించి సరైన నాయకుడు నరేంద్రమోదీ. మోదీ నాయకత్వంలో భారతీయులు కూడా అంతర్జాతీయంగా సమున్నత స్థాయికి ఎదిగారు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా భారతీయులు అత్యధిక తలసరి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఆయన నాయకత్వంలో భారతీయులు గ్లోబల్ నేతలుగా మారగలరు’’ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అనడం సామాన్య విషయం కాదు. మోదీ నాయకత్వంలో భారతదేశం పేదరికాన్ని నిర్మూలించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నితీష్ కుమార్ కూడా ఇండియా కూటమి నేతలు ప్రధాని పదవిని ఇవ్వజూపినప్పటికీ తిరస్కరించారని ఆ పార్టీ నేత త్యాగి చెప్పారు. మోదీ దేశానికి చేసిన సేవను ప్రజలు గుర్తించారని, ఆయన నాయకత్వానికి తిరుగులేదని నితీష్ కుమార్ ఎన్డీఏ సమావేశంలో ప్రకటించారు. జయంత్ చౌదరి, పవన్ కల్యాణ్, ఏక్‌నాథ్ షిండే, అనుప్రియ పటేల్‌తో పాటు ఎన్డీఏ నేతలందరూ మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధికి తిరుగులేదని ప్రకటించారు. ఎన్డీఏలో భాగస్వాములు కాని బీఆర్‌ఎస్, వైసీపీ, బీజేడీ వంటి అనేక పార్టీలను ప్రజలు తిరస్కరించారు.


విచిత్రమేమంటే ప్రతిపక్షాలకి మోదీని ఎదుర్కోనే సామర్థ్యం లేక ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశాయి. ఎన్నికల సమయంలో సుప్రీంకోర్టుకు వెళ్లి ఈవీఎంలను అడ్డుకోవాలని చూశాయి. భారతదేశం టెక్నాలజీలో ముందడుగు వేస్తుంటే ప్రతిపక్షాలు ఇంకా 20వ శతాబ్దంలో ఉన్నారు, వారి ఆలోచనా విధానం అదే విధంగా ఉన్నది. ఇవాళ దేశం సుపరిపాలనలో ఫలితాలు సాధించాలంటే టెక్నాలజీ అవసరమని మోదీ నిరూపించారు. సంక్షేమ పథకాల నిధులు నేరుగా ప్రజల ఖాతాల్లోకి చేరుతున్నాయంటే ఆధార్, మొబైల్, బ్యాంకు ఖాతాలు సమ్మిళితం అవుతున్నాయంటే టెక్నాలజీ మూలంగానే.

ఎన్డీఏలో ఉన్నవారందరూ అభివృద్ధిని ఆశించేవారు. ముఖ్యంగా చంద్రబాబునాయుడి ప్రధాన లక్ష్యం జగన్ హయాంలో కొన్ని సంవత్సరాలు వెనకబడిన ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ గాడిలో పెట్డడమే. రాజధానిగా అమరావతిని నిర్మించడం, పోలవరం వంటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం, రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి చెందడం ఆయన లక్ష్యం. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఈ లక్ష్యాలను సాధించగలరనే విశ్వాసం ఆయనకున్నది. మోదీకి, తనకు అభివృద్ధియే ప్రధాన ఎజెండా అన్న విషయం ఆయనకు తెలుసు.

రాబోయే పదేళ్ళు అత్యంత కీలకం. దేశ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కాలంటే, మోదీ ప్రారంభించిన చరిత్ర ఫలవంతం కావాలంటే ఎన్డీఏ కలిసికట్టుగా పనిచేయాలి. ప్రభుత్వాన్ని నడపాలంటే ఏకాభిప్రాయం అవసరమని మోదీ తెలిపారు. సుపరిపాలన, ప్రజల జీవన నాణ్యత, అభివృద్ధి తన సంకల్పాలని ఆయన చెప్పారు. ఈ విషయంలో ఎన్డీఏ నేతలకు ఎటువంటి భేదాభిప్రాయం లేదు. రానున్న రోజుల్లో దేశం శరవేగంతో అభివృద్ధి చెందుతుంది, అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతుంది. మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పీఎం కిసాన్ నిధి క్రింద రైతులకు రూ.20వేల కోట్లు మంజూరు చేశారంటేనే ఎన్డీఏ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎంత కట్టుబడి ఉన్నదో అర్థమవుతోంది.

(బీజేపీ జాతీయ కార్యదర్శి)


రాబోయే పదేళ్ళు అత్యంత కీలకం. దేశ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కాలంటే, మోదీ ప్రారంభించిన చరిత్ర ఫలవంతం కావాలంటే ఎన్డీఏ కలిసికట్టుగా పనిచేయాలి. ప్రభుత్వాన్ని నడపాలంటే ఏకాభిప్రాయం అవసరమని మోదీ తెలిపారు. సుపరిపాలన, ప్రజల జీవన నాణ్యత, అభివృద్ధి తన సంకల్పాలని ఆయన చెప్పారు. ఈ విషయంలో ఎన్డీఏ నేతలకు ఎటువంటి భేదాభిప్రాయం లేదు.

Updated Date - Jun 11 , 2024 | 05:34 AM