Share News

బీజేపీ మనోరథం ఫలించేనా?

ABN , Publish Date - May 22 , 2024 | 02:19 AM

‘నేను పన్నెండేళ్ల క్రితం రాహుల్ మాట్లాడిన ఒక వీడియోను చూశాను. ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తామని ఆయన ఈ వీడియోలో చెప్పారు. దేశ వనరుల్లో ముస్లింలకు తొలి హక్కు ఉంటుందని నాటి ప్రధాని...

బీజేపీ మనోరథం ఫలించేనా?

‘నేను పన్నెండేళ్ల క్రితం రాహుల్ మాట్లాడిన ఒక వీడియోను చూశాను. ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తామని ఆయన ఈ వీడియోలో చెప్పారు. దేశ వనరుల్లో ముస్లింలకు తొలి హక్కు ఉంటుందని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ ఒకే రకంగా మాట్లాడారు. అతి పురాతనమైన కాంగ్రెస్ పార్టీ ముస్లింలీగ్ ఆలోచనా విధానంతో ఇప్పటికీ ఏకీభవించే మతతత్వ పార్టీ అని రుజువైంది’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం నాడు పశ్చిమ బెంగాల్‌లో ఒక సభలో ఆరోపించారు. ఏప్రిల్ 19న మొదటి దశ పోలింగ్ పూర్తయిన తర్వాతి నుంచీ ప్రధానమంత్రి కాంగ్రెస్‌ను హిందువులకు వ్యతిరేక పార్టీగా చిత్రించేందుకు సర్వయత్నాలు చేస్తున్నారు. ప్రజల ఆస్తులను కాంగ్రెస్ లాక్కొని దేశంలో ఎక్కువ మంది పిల్లలున్న వారికి, చొరబాటుదారులకు అప్పగిస్తుందన్నారు. ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్ తర్వాత మోదీ స్వరం మరింత తీవ్రంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్‌సి, ఎస్‌టి, ఓబీసీ రిజర్వేషన్లను లాక్కొని ముస్లింలకు ఇస్తారని ప్రకటించారు. అయోధ్యలో రామమందిరానికి బాబ్రీ తాళం వేస్తారని కూడా ఆరోపించారు.

రామమందిరాన్ని కాంగ్రెస్ బుల్డోజర్లతో కూల్చేస్తుందని అనేంత వరకూ ఆయన వెళ్లారు. ఒకవైపు తన బాల్యం ముస్లిం సమాజానికి చెందిన వారితోనే గడిచిందని, రంజాన్ మాసంలో గాజాపై బాంబు దాడులు ఆపాలని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును అభ్యర్థించానని చెబుతూనే మతపరమైన విభజనకు ఆస్కారం ఉన్న చోట్ల కాంగ్రెస్‌ను ముస్లింల అనుకూల పార్టీగా చిత్రించడంలో నరేంద్రమోదీ వెనుకాడలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసే వ్యాఖ్యల పట్ల ఆయనను వ్యక్తిగతంగా నిందించడంలో అర్థం లేదు. ఆయన మొత్తం భారతీయ జనతా పార్టీ, సంఘ్ పరివార్ సిద్ధాంతానికి అనుగుణంగానే మాట్లాడుతున్నారు. భారతీయ రాజకీయ యవనికపై హిందూ జాతీయవాదం 1980లలోనే ప్రబలంగా ఆవిష్కృతమైంది. రామజన్మభూమి ఉద్యమం తర్వాత అది మరింత ఊపందుకుంది. 1990లో లాల్‌కృష్ణ ఆడ్వాణీ రథయాత్ర జరిపినప్పుడు అనేక చోట్ల ‘రామ్ ద్రోహి, దేశ ద్రోహి ఒకరే’ అన్న నినాదాలతో పోస్టర్లు కనపడేవి. 1991లో పివి నరసింహారావు హయాంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించిన బీజేపీ 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత వెంటనే ఫలితాలు సాధించలేకపోయినప్పటికీ ఏడేళ్ల తర్వాత 1998లో కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది. దీనితో బీజేపీ విస్తరణను అడ్డుకోవడానికి కాంగ్రెస్‌తో పాటు అనేక శక్తులు చేతులు కలపవలిసి వచ్చింది. అయినప్పటికీ పదేళ్ల యూపీఏ పాలన తర్వాత మళ్లీ ఒక పెనుతుఫానులా బీజేపీ అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చి పదేళ్లు పాలించింది. ఇప్పుడు బీజేపీ అధికారాన్ని శాశ్వతం చేసేందుకు నరేంద్రమోదీ మరోసారి ఇప్పుడు తీవ్ర యత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే నరేంద్రమోదీ వ్యాఖ్యలని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ‘సాంస్కృతిక జాతీయవాదం భారతదేశాన్ని సమైక్యపరచడమే కాక, దేశాన్ని ఆధునిక, ప్రగతిశీల, సుసంపన్న దేశంగా మారుస్తుంది. లౌకికవాదం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ముఖ్యమైనవే కాని అవి ప్రజానీకాన్ని ప్రేరేపితం చేసేందుకు సరిపోవు..’ అని మోదీ గురువు ఆడ్వాణీ ఎప్పుడో అన్నారు.


వేలాది తెగలు, జాతులు, కులాలు, ఉపకులాలు, స్థానిక, ప్రాంతీయ భాషలు, మాండలికాలు, ఆచారాలు, పద్ధతులు ఉన్న వైవిధ్యభరితమైన సువిశాల భారత దేశంలో ఒక జాతీయ రాజ్యం (నేషన్ స్టేట్) దృక్పథం సరిపోదని చాలా మంది వాదించారు. యూరప్‌లో లాగా భారతదేశం ఒక జాతీయ రాజ్యంగా మారబోదని, భారత్‌లో ఒక ప్రపంచమే కనపడుతుందని విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ 1917లోనే అభివర్ణించారు. ‘భారతదేశం వివిధ జాతుల, తెగల చారిత్రక ప్రదర్శన శాల’ అని ప్రముఖ మెక్సికన్ కవి, భారతదేశంలో దౌత్యవేత్తగా ఉన్న అక్టావియో పాజ్ అన్నారు. పార్లమెంట్‌లో అత్యధిక మెజారిటీ ఉన్నప్పటికీ నెహ్రూ హిందీ భాషను జాతీయ భాషగా ప్రకటించలేకపోవడం భాషాపరంగా మన దేశ వైవిధ్యాన్ని స్పష్టం చేసిందని, ఇది మన దేశం జాతీయ రాజ్యంగా మారడంలో ఒక అడ్డంకి అని చెప్పినవారు కూడా ఉన్నారు. గాంధీజీ రాముడిని, రామరాజ్యాన్ని ఆదర్శ వ్యవస్థకు సూచికలుగా భావించారు కాని మత రాజ్యాన్ని ఆయన కూడా వాంఛించలేదన్న విషయం స్పష్టమే. ఆడ్వాణీ నుంచి మోదీ వరకూ తమను మతతత్వవాదులంటే అంగీకరించబోరు. తమది జాతీయవాదమని, ప్రజల మత విశ్వాసాలు, నమ్మకాలు, ఆచారాలు జాతీయ ఐక్యతకు ప్రతిబింబమని అడ్వాణీ తన ఆత్మకథలో రాసుకున్నారు. బాబ్రీ మసీదు స్థానంలో రామమందిర నిర్మాణం కోసం ప్రజలు 500 సంవత్సరాలుగా పోరాడుతున్నారని ఆయన చెప్పారు.


మండల్ కమిషన్ నివేదికను విపిసింగ్ బయటకు తీసిన తర్వాత దానికి వ్యతిరేకంగా అడ్వాణీ రథయాత్ర జరపడం కులపరమైన రాజకీయ చైతన్యాన్ని ఎదుర్కోవడానికి మతాన్ని ఒక ఆయుధంగా బీజేపీ ఉపయోగించుకోవడమే దాని సైద్దాంతిక దృక్పథం అని అర్థం చేసుకోవడానికి వీలు కలిగింది. నిజానికి దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన సమగ్ర మానవతా వాదంలోనే ఈ దృక్పథం మూలాలున్నాయి. ఆడ్వాణీ రథయాత్ర జరిగి దాదాపు మూడు దశాబ్దాలు గడిచినప్పటికీ ఈ దృక్పథం మారలేదని ఇవాళ దేశంలో మోదీ సారథ్యంలోని బీజేపీకీ, కాంగ్రెస్ సారథ్యంలో ఏకమైన వివిధ సామాజిక శక్తులకూ మధ్య జరుగుతున్న రాజకీయ పోరు, వాద ప్రతివాదాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. 1991 తర్వాత దేశంలో అనేక సామాజిక రాజకీయ, ఆర్థిక మార్పులు జరిగాయి. వివిధ సామాజిక శక్తులు ఉత్తరప్రదేశ్, బిహార్ లాంటి రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాయి. దేశంలో వెనుకబడినవర్గాలు, బడుగు, బలహీన వర్గాలు సమాజంలో వివిధ రంగాల్లో తమ భాగస్వామ్యం కోసం చైతన్యవంతమైన ప్రయత్నాలు, పోరాటాలు చేశారు. ఆర్థిక సంస్కరణల వల్ల అనేక వర్గాలకు అవకాశాలు విస్తరించాయి. ఈ సంధి దశలో అనేక ప్రభుత్వాలు మారాయి. కాని 2014లో నరేంద్రమోదీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం అన్ని మార్పులను అధిగమించిన ఉధృత పరిణామం. ఇది పలువురు సామాజికవేత్తల అంచనాకు భిన్నంగా కులానికీ, మతానికీ మధ్య వైరుధ్యాలను కూడా అధిగమించిందనడంలో సందేహం లేదు. మోదీ రెండుసార్లు అఖండమైన మెజారిటీతో అధికారంలోకి రావడాన్ని బట్టి చూస్తే రవీంద్రనాథ్ టాగోర్ లాంటి వారి ఆలోచనలకు భిన్నంగా భారతదేశం ఒక జాతీయ రాజ్యంగా మారే అవకాశాలున్నాయా అన్న అనుమానాలకు కూడా ఆస్కారం కలిగింది.


అందువల్లే 2024 ఎన్నికలకు అంత ప్రాధాన్యత ఏర్పడింది. గత పది సంవత్సరాల్లో బీజేపీ తన సైద్ధాంతిక భూమిక ప్రజల్లో విస్తరించేందుకు అనేక చర్యలు చేపట్టింది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ చట్టం, కాశీ కారిడార్, త్రిపుల్ తలాఖ్ రద్దు, పార్లమెంట్‌లో రాజదండ ప్రతిష్టాపన నుంచి రామమందిర నిర్మాణం వరకూ బీజేపీ దేశంలో ఉన్న మెజారిటీ హిందువులకు తానే ప్రతినిధిగా నిరూపించుకునేందుకు చేయాల్సిన పనులన్నీ చేసింది. రాష్ట్రాల స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ మతాన్ని, ఆలయాలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా మార్చుకుంది. బీజేపీ సోషల్ మీడియాలో మతమే దాని ప్రధాన రాజకీయంగా మారిందనడంలో సందేహం లేదు. మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే ఆరునెలల్లో ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో ఏకమవుతుందనే కొత్త ప్రచారమూ ఊపందుకుంది. మోదీ నుంచి అన్నామలై వరకూ ఇవాళ బీజేపీ సైద్దాంతిక విశ్వరూపాన్ని మనం ఆకళింపు చేసుకోవల్సి ఉన్నది. అందువల్ల మోదీ హిందూ ముస్లింల గురించి అధికంగా మాట్లాడుతున్నారని అనడం కొత్త విషయాన్ని చెప్పినట్లు కాదు. ముస్లింల ప్రస్తావన తెచ్చి వారు పరాయివారు అనే ధ్వని వచ్చేలా మాట్లాడడం బీజేపీ వర్గాలకు కొత్త కాదు. సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్ అని చెప్పే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లింల గురించి ప్రత్యేక ప్రస్తావన ఏ మాత్రం కనిపించదు. అదే కాంగ్రెస్ అన్ని వర్గాల వారితో పాటు ముస్లింల గురించి ప్రస్తావిస్తే బీజేపీకి అది మహా పాపంలా కనిపించడంలోనూ ఆశ్చర్యం లేదు.


ఈ నేపథ్యంలో భారతదేశం ఎటువైపు వెళుతున్నది అని తెలుసుకోవడానికి ఈ ఎన్నికలు దోహదం చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిపిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలు సానుకూలంగా స్పందించారన్నది అవాస్తవం కాదు. దేశంలో అనేక పట్టణ ప్రాంతాల్లో ప్రజలు బీజేపీ సానుభూతిపరులుగా కనిపిస్తున్నారు. వారితో తార్కికంగా వాదించడం అంత సులభం కాదు. కాని ఈ సానుకూలత ఎల్లెడలా విస్తరించిందా అన్నది చర్చనీయాంశం. కాని రామమందిర నిర్మాణం, కశ్మీర్‌లో 370 అధికరణ ప్రజల అంత శ్చేతనలో ఇమిడిపోయినందువల్ల తమకే భారీగా ఓట్లు పడతాయాని బీజేపీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ ఆశించిన విధంగా ఆ పార్టీకి 350 సీట్లు దక్కితే జాతీయ రాజ్యాన్ని ఏర్పర్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతాయనడంలో ఆశ్చర్యం లేదు. కాని ప్రజలు రామమందిర ప్రభావం నుంచి తేరుకుని వాస్తవాలు గ్రహించడం మొదలు పెట్టారని, మొదటి రెండు దశల్లో పోలింగ్‌లోనే ఇది స్పష్టమైందని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు చెబుతున్నాయి. భారతదేశ ప్రజలు మత భావనల వెల్లువలో కొట్టుకుపోయి ఆర్థిక, సామాజిక న్యాయాన్ని విస్మరించబోరని ఆ పక్షాలు వాదిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, హర్యానా, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిషాతో పాటు అనేక రాష్ట్రాల్లో బీజేపీ సీట్లు తగ్గిపోతాయని చెప్పేవారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. అందువల్ల ఈ ఎన్నికలు బీజేపీ చిరకాల ఆకాంక్షకూ, ప్రజల ఆలోచనా విధానానికీ మధ్య వ్యత్యాసాన్ని ఎంతమేరకు ప్రతిఫలిస్తాయో వేచి చూడాల్సి ఉన్నది.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - May 22 , 2024 | 02:19 AM